టెస్ట్ క్యాప్ అంటే...ఆనంద భాష్పాలు, ఆలింగనలు, అంతులేని భావోద్వేగం!

భారత టెస్టుజట్టులో చోటు సంపాదించాలన్న ముంబై బ్యాటర్ సరఫ్రాజ్ ఖాన్ మూడేళ్ల పోరాటం ఎట్టకేలకు ఫలించింది.

Advertisement
Update:2024-02-16 08:15 IST

భారత టెస్టుజట్టులో చోటు సంపాదించాలన్న ముంబై బ్యాటర్ సరఫ్రాజ్ ఖాన్ మూడేళ్ల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. టెస్టు క్యాప్ అందుకోడమే కాదు..అరంగేట్రం ఇన్నింగ్స్ లోనే మెరుపు హాఫ్ సెంచరీతో వారేవ్వా! అనిపించుకొన్నాడు.

మనిషిజీవితం విచిత్రమైనది. కొందరికి జీవితం వడ్డించిన విస్తరయితే...అపారప్రతిభ కలిగిన మరికొందరికి మాత్రం అంతులేని పోరాటం. దానికి పెద్దమనుషుల క్రీడ క్రికెట్ సైతం ఏమాత్రం మినహాయింపు కాదు. ముంబై యువబ్యాటర్ సరఫ్రాజ్ ఖాన్ ఎట్టకేలకు భారత టెస్ట్ క్యాప్ సాధించగలిగాడు. భారత 311వ టెస్టు క్రికెటర్ గా రికార్డుల్లో చేరగలిగాడు. అంతేకాదు..అరంగేట్రం ఇన్నింగ్స్ లోనే మెరుపు హాఫ్ సెంచరీ బాదిన అతికొద్ది మంది భారత క్రికెటర్లలో ఒకనిగా నిలిచాడు.

మూడేళ్ల పోరాటం తరువాత.....

క్రికెట్ పిచ్చితో ఉత్తరప్రదేశ్ నుంచి ముంబైకి వలస వచ్చిన నౌషాద్ ఖాన్, ఆయన ఇద్దరు కుమారుల కథ ఇది. నౌషాద్ ఖాన్ స్వతహాగా క్రికెటర్ మాత్రమే కాదు..చక్కటి క్రికెట్ కోచ్ కూడా. తాను సాధించలేనిది తన కుమారులు సరఫ్రాజ్ ఖాన్ ( 26 ), ముషీర్ ఖాన్ ( 18 ) సాధించాలని కలలు కన్నారు. విపరీతమైన పోటీ ఉండే ముంబై క్రికెట్ ద్వారా తన కుమారులను అంతర్జాతీయ క్రికెటర్లుగా తీర్చిదిద్దాలని, భారతజట్టులో సభ్యులుగా చేయాలని భావించారు. ఇద్దరినీ చక్కటి ఆటగాళ్లుగా తీర్చిదిద్దారు. అయితే..ప్రతిభ ఉన్నా భారతజట్టులో చోటు అంతతేలిక కాదని నౌషాద్ కు, ఆయన కుమారులకు అర్ధమైపోయింది.

22 సంవత్సరాల వయసు నుంచే రంజీట్రోఫీలో సెంచరీల మీద సెంచరీలు బాదుతూ వచ్చినా సరఫ్రాజ్ ను సెలెక్టర్లు ఏమాత్రం కరుణించలేదు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించడం ద్వారా సెలెక్టర్ల దృష్టిలో పడినా..భారతజట్టులో చోటు మాత్రం అంత తేలికగా దక్కలేదు.

2019 సీజన్ నుంచి పరుగులే పరుగులు..

అత్యున్నత ప్రమాణాలకు మరోపేరైన ముంబై క్రికెట్లో అత్యంత ప్రతిభావంతులైన బ్యాటర్లలో ఒకడిగా సర్పరాజ్ ఖాన్ గుర్తింపు తెచ్చుకొన్నాడు. ముంబై రంజీజట్టుకు మిడిలార్డర్ ఆటగాడిగా అసమాన సేవలు అందిస్తున్నాడు.

22 ఏళ్ల వయసు నుంచే దేశవాళీ రంజీక్రికెట్లో అత్యంత నిలకడగా రాణిస్తున్న బ్యాటర్ గా గుర్తింపు సంపాదించాడు. 2019, 2020, 2021, 2022 సీజన్లలో సగటున 900 పరుగులు చొ్ప్పున సాధిస్తూ వచ్చాడు. అంతేకాదు..ప్రస్తుత 2023 సీజన్లో ఇప్పటికే మూడుశతకాలు బాదాడు. 2024 సీజన్లో సైతం సెంచరీలతో కదం తొక్కాడు.

భారతజట్టులో చోటు సంపాదించాలంటే తాను ఇంకా ఏంచేయాలని, ఎన్నిసెంచరీలు, పరుగులు సాధించాలంటూ తీవ్రనిరాశలో కూరుకుపోయాడు.

వయసుకు మించిన బరువే అడ్డంకా?

సర్పరాజ్ ఖాన్ వయసుకు మించిన బరువు ఉండటమే..ఎంపిక చేయకపోడానికి కారణమని మరోవైపు ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే..బరువుతో ప్రమేయం లేకుండా ఈ కుర్రాడు దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నాడని, ఏడాది ఏడాదికీ ఒకేతీరుగా రాణిస్తూ సెంచరీల వర్షం కురిపిస్తున్నాడని భారత మాజీ క్రికెటర్, విమర్శకుడు వెంకటేశ్ ప్రసాద్ అంటున్నారు.

సర్పరాజ్ ఖాన్ ప్రతిభను, గణాంకాలను పట్టించుకోకుంటే..అది దేశవాళీ క్రికెట్ నే అవమానించినట్లవుతుందని సెలెక్టర్లను హెచ్చరించాడు. ప్రస్తుత భారతజట్టులో తమ వయసుకు మించిన బరువున్నఆటగాళ్లు చాలామందే ఉన్నారని గుర్తు చేశాడు.

25 సంవత్సరాల వయసుకే 12 రంజీ సెంచరీలు, 3వేల 380 పరుగులు సాధించిన సరఫ్రాజ్ ఖాన్ మొరను ఎంపిక సంఘం ఎట్టకేలకు ఆలకించి భారతజట్టులో చోటు కల్పించింది.

రాజకోట వేదికగా మూడోటెస్టు తుదిజట్టులో చోటు కల్పించింది.

కుటుంబసభ్యుల భావోద్వేగం...

ఇంగ్లండ్ తో రాజకోట నిరంజన్ షా స్టేడియం వేదికగా మూడోటెస్టు ప్రారంభానికి ముందు సరఫ్రాజ్ ఖాన్ కుటుంబసభ్యులు పట్టలేని ఆనందంతో..తీవ్రభావో్ద్వేగాలతో కన్నీరుమున్నీరయ్యారు.

సరఫ్రాజ్ ఖాన్ కు భారత మాజీ కెప్టెన్ అనీల్ కుంబ్లే 311 నంబర్ తో కూడిన టెస్టు క్యాప్ ను అందించారు. సరఫ్రాజ్ టెస్టు టోపీ అందుకొంటున్న సమయంలో స్టేడియంలోనే ఉన్న అతని తండ్రి నౌషాద్ ఖాన్, భార్య ఆనందభాష్పాలతో కన్నీరు మున్నీరయ్యారు. పట్టలేని విధంగా భావోద్వేగాలకు లోనయ్యారు.

సరఫ్రాజ్ తన టెస్ట్ క్యాప్ ను అందుకొన్న వెంటనే తండ్రి వద్దకు వచ్చి ఆలింగనం చేసుకొని మురిసిపోయాడు. తాను సాధించలేనిది తన కుమారుడు సాధించడం చూసి తండ్రిగా, ఓ క్రికెట్ కోచ్ గా నౌషాద్ పొంగిపోయారు. కంటనీరు పెట్టుకొని భావోద్వేగానికి గురయ్యారు. అంతేకాదు తన భార్య కంటనీరును సైతం సరఫ్రాజ్ తుడిచాడు.

48 బంతుల్లోనే మెరుపుహాఫ్ సెంచరీ..

సరఫ్రాజ్ ఖాన్ టెస్టు క్యాప్ అందుకోడంతోనే ఆగిపోలేదు. అరంగేట్రం ఇన్నింగ్స్ లోనే ఇంగ్లండ్ బౌలర్లను ఓ పట్టు పట్టాడు. తన బ్యాటింగ్ అమ్ముల పొదిలోని అస్త్ర్రాలను ప్రయోగించి కేవలం 48 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు.

కెప్టెన్ రోహిత్ శర్మ 131 పరుగుల స్కోరుకు అవుటైన వెంటనే క్రీజులోకి వచ్చిన సరఫ్రాజ్ 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగుల స్కోరుకు..దురదృష్టవశాత్తు రనౌట్ గా వెనుదిరిగాడు.

మొత్తం మీద..భారత టెస్టు జట్టులో చోటు సంపాదించాలన్న సరఫ్రాజ్ ఖాన్ మూడేళ్ల పోరాటం ఫలించింది. భారత్ కు ఓ ప్రతిభావంతుడైన మిడిలార్డర్ బ్యాటర్ సరఫ్రాజ్ రూపంలో దక్కాడు.

Tags:    
Advertisement

Similar News