పారిస్ ఒలింపిక్స్ కు భారత నవతరం అథ్లెట్లు!

పారిస్ ఒలింపిక్స్ కోసం భారత నవ,యువతరం అథ్లెట్లు ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ప్రపంచ వేదికపై తమ సత్తా చాటుకోడానికి తహతహలాడుతున్నారు.

Advertisement
Update:2024-07-24 18:15 IST

పారిస్ ఒలింపిక్స్ కోసం భారత నవ,యువతరం అథ్లెట్లు ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ప్రపంచ వేదికపై తమ సత్తా చాటుకోడానికి తహతహలాడుతున్నారు.

భారత జనాభా 140 కోట్లు. అయితే ప్రపంచ క్రీడల పండుగ ఒలింపిక్స్ లో పాల్గొనే అరుదైన అవకాశం కేవలం 117 మంది క్రీడాకారులకు మాత్రమే దక్కింది.

పారిస్ వేదికగా జులై 26 నుంచి ఆగస్టు 11 వరకూ జరిగే ఈ విశ్వక్రీడాసమరంలో 204 దేశాలకు చెందిన 10,500 మంది అథ్లెట్లు 32 రకాల క్రీడలు, 70కి పైగా క్రీడాంశాలలో పోటీపడబోతున్నారు.

ఇటు సీనియర్లు...అటు జూనియర్లు

పారిస్ ఒలింపిక్స్ లో భాగంగా మొత్తం 32 రకాల క్రీడల్లో పోటీలు నిర్వహిస్తుంటే భారత క్రీడాకారులు 16 క్రీడల్లో మాత్రమే పోటీపడటానికి అర్హత సంపాదించగలిగారు.

పురుషుల, మహిళల విభాగాలలో భారత అథ్లెట్లు టీమ్, వ్యక్తిగత అంశాలలో పోటీపడబోతున్నారు.

తెలుగుతేజం, వెటరన్ టేబుల్ టెన్నిస్ స్టార్ ఆచంట శరత్ కమల్ తన క్రీడాజీవితంలో ఐదోసారి ఒలింపిక్స్ బరిలో నిలుస్తుంటే 44 సంవత్సరాల టెన్నిస్ స్టార్ రోహన్ బొపన్న

అత్యంత పెద్దవయసు కలిగిన భారత క్రీడాకారుడిగా నిలిచాడు.

ఇక ..కర్నాటక స్విమ్మర్ ధినిధి కేవలం 14 సంవత్సరాల చిరుప్రాయంలోనే ఒలింపిక్స్ ఈతలో పాల్గొనటానికి అర్హత సాధించడం ద్వారా చరిత్ర సృష్టించింది.

తొలిసారిగా ఒలింపిక్స్ బరిలో....

భారత బృందంలోని సగానికి పైగా అథ్లెట్లకు గతంలోనే ఒలింపిక్స్ లో పాల్గొన్న అనుభవం ఉంది. అయితే మిగిలిన వారిలో ఎక్కువమంది తొలిసారిగా ఒలింపిక్స్ లో అడుగుపెట్టబోతున్నారు.

వీరిలో తెలుగు విలుకాడు ధీరజ్ బొమ్మదేవర, మహిళా యువ వస్తాదు అంతిమ్ పంగల్, షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా, తెలంగాణా టీటీ సంచలనం శ్రీజ ఆకుల, హైదరాబాదీ షూటర్ ఈషా సింగ్, బాక్సర్ నిఖత్ జరీన్ , బ్యాడ్మింటన్ స్టార్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి ఉన్నారు.

డార్క్ హార్స్ లుగా నవతరం అథ్లెట్లు....

పారిస్ ఒలింపిక్స్ లో ఏదో ఒక పతకం సాధించే సత్తా కలిగిన భారత క్రీడాకారులు ఎవరంటే...నీరజ్ చోప్రా, నిఖత్ జరీన్, సాయిసాత్విక్ -చిరాగ్ జోడీ, పీవీ సింధు అన్న పేర్లే ముందుగా గుర్తుకు వస్తాయి.

అయితే..ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగుతూ సంచలనాలు సృష్టించే సత్తా కలిగిన పలువురు నవతరం అథ్లెట్లు సైతం భారత బృందంలో సభ్యులుగా ఉన్నారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ షూటింగ్ లో కొద్దిపాటి అదృష్టం కలసి వస్తే భారత యువషూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా ఏదో ఒక పతకంతో స్వదేశానికి తిరిగి రావడం ఖాయమని భావిస్తున్నారు.

హాంగ్జు వేదికగా ముగిసిన ఆసియాక్రీడల షూటింగ్ లో బంగారు పతకం సాధించిన సిఫ్ట్ కౌర్ కు చైనా షూటర్ జాంగ్ నుంచి గట్టిపోటీ ఎదురైనా ఏదో ఒక పతకం సాధించే సత్తా ఉంది.

హైదరాబాదీ షూటర్ 'బంగారు' ఆశలు!

మహిళల పిస్తోల్ షూటింగ్ లో హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్ బంగారు పతకానికి గురిపెట్టింది. 17 సంవత్సరాల వయసులోనే ఆసియాక్రీడల షూటింగ్ లో బంగారు మోత మోగించిన ఇషా కు ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్షిప్ 10 మీటర్ల ఏర్ పిస్టల్ విభాగంలో సైతం స్వర్ణపతకం సాధించిన రికార్డు ఉంది. మను బాకర్, హీనా సిద్దూ లాంటి

అపారఅనుభవం కలిగిన సీనియర్ షూటర్లనే కంగు తినిపించిన ఇషా ఒలింపిక్స్ టీ్మ్, వ్యక్తిగత అంశాలలో పతకాలు సాధించే అవకాశం ఉంది.

గురితప్పని విలుకాడు ధీరజ్....

ఒలింపిక్స్ రికర్వ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో పాల్గొనటానికి అర్హత సాధించిన భారత తొలి ఆర్చర్ గా ఇప్పటికే అరుదైన ఘనతను సొంతం చేసుకొన్న ఆంధ్రప్రదేశ్ విలుకాడు ధీరజ్ బొమ్మదేవర భారీఆంచనాలతో పతకాల వేటకు దిగుతున్నాడు.

2023, 2024 ప్రపంచ విలువిద్య పోటీలలో కాంస్య పతకాలు సాధించిన ధీరజ్...పారిస్ ఒలింపిక్స్ లోనూ అత్యుత్తమంగా రాణించాలన్న పట్టుదలతో ఉన్నాడు. 23 ఏళ్ల ధీరజ్ పూర్తిస్థాయిలో సిద్ధమై బరిలోకి దిగుతున్నాడు.

బాక్సింగ్ బరిలో యువ తరంగం....

మహిళల బాక్సింగ్ లో నిఖత్ జరీన్, లవ్లీనా బోర్గెయిన్ భారత్ కు పతకాలు అందించే సత్తా కలిగిన బాక్సర్లుగా గుర్తింపు పొందారు. అయితే..తొలిసారిగా ఒలింపిక్స్ బరిలోకి దిగుతున్న హర్యానా యువబాక్సర్ ప్రీతి సాయి పవార్ బంతామ్ వెయిట్ విభాగంలో తన అదృష్టం పరీక్షించుకొంటోంది. వరుస కుదిరితే ఏదో ఒక పతకం సాధించే ప్రతిభ ప్రీతి సాయికి ఉందని శిక్షకులు చెబుతున్నారు.

14 ఏళ్ల వయసులోనే ఒలింపిక్స్ బరిలో...

పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించిన మొత్తం 117 మంది భారత అథ్లెట్లలో అత్యంత చిన్నవయసు కలిగిన అథ్లెట్ గా కర్నాటక స్విమ్మర్ ధినిధి దేశింగు ఇప్పటికే రికార్డు నెలకొల్పింది. జాతీయ సీనియర్, జూనియర్ విభాగాలలో పతకాల పంట పండించుకొన్న ధినిధి ఫ్రీ-స్టయిల్ విభాగంలో ప్రపంచ మేటి స్విమ్మర్లతో పోటీపడే అవకాశాన్ని దక్కించుకొంది. పతకం సాధించే అవకాశాలు ఏమాత్రం లేకున్నా ఒలింపిక్స్ లో పాల్గొన్న అనుభవంతో తన ప్రతిభకు సానపెట్టుకోనుంది. 200 మీటర్ల ఫ్రీ-స్టయిల్ విభాగంలో 14 సంవత్సరాల ఈ బాల స్విమ్మర్ ప్రపంచ మేటి దిగ్గజ స్విమ్మర్లతో ఢీ కోనుంది.

మహిళల 76 కిలోల కుస్తీలో రీతిక హుడా తొలిసారిగా పోటీకి దిగుతుంటే...మహిళల 53 కిలోల విభాగంలో మరో హర్యానా వస్తాదు అంతిమ్ పంగల్ సైతం పతకం వేటకు దిగుతోంది. ఆసియా అండర్ -20 కుస్తీ పోటీలలో ఇప్పటికే రెండుసార్లు బంగారు పతకాలు సాధించిన అంతిమ్ సత్తాకు ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ అసలుసిసలు పరీక్షకానున్నాయి.

భారీఅంచనాలతో హైదరాబాదీ టీటీ సంచలనం..

మహిళల టేబుల్ టెన్నిస్ టీమ్, వ్యక్తిగత విభాగాలలో సత్తాచాటుకోడానికి తెలంగాణా టీటీ సంచలనం శ్రీజ ఆకుల ఎదురుచూస్తోంది. గత ఎనిమిది మాసాలుగా పలు అంతర్జాతీయ టోర్నీలలో పాల్గొని విజేతగా నిలవడం ద్వారా తన సింగిల్స్ ర్యాంకును శ్రీజ గణనీయంగా మెరుగుపరచుకోడం ద్వారా తొలిసారిగా ఒలింపిక్స్ లో పాల్గొనటానికి అర్హత సంపాదించింది.

గత కామన్వెల్త్ గేమ్స్ మిక్సిడ్ డబుల్స్ లో శరత్ కమల్ తో జంటగా బంగారు పతకం సాధించిన శ్రీజ ఒలింపిక్స్ లోనూ అత్యుత్తమంగా రాణించాలన్న పట్టుదలతో ఉంది.

మహిళల జూడోలో 25 ఏళ్ల తులికా మాన్, పురుషుల హాకీలో 19 సంవత్సరాల మిడ్ ఫీల్డర్ రాజ్ కుమార్ పాల్ సైతం తొలిసారిగా ఒలింపిక్స్ లో పాల్గొంటూ తమ ఉనికిని నిలుపుకోవాలని భావిస్తున్నారు.

ఇప్పటికే భారతజట్టులో సభ్యుడిగా 50 మ్యాచ్ ల వరకూ ఆడిన రాజ్ కుమార్ కు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ, ఆసియాకప్ టోర్నీలలో పతకాలు సాధించిన అనుభవం, రికార్డు ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News