ఐపీఎల్ -17లో సిక్సర్ల సునామీ!
లక్నో సూపర్ జెయింట్స్ తో 12వ రౌండ్ మ్యాచ్ లో 10 వికెట్ల విజయంతో నెగ్గడం ద్వారా రికార్డుల హ్యాట్రిక్ నమోదు చేసింది. అంతేకాదు..ప్రస్తుత సీజన్ లీగ్ లో 1000 సిక్సర్ సైతం హైదరాబాద్ వేదికగానే ..సన్ రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ సాధించడం విశేషం.
దేశవిదేశాలలోని కోట్లాదిమంది అభిమానులను ఓలలాడిస్తున్న ఐపీఎల్ -17వ సీజన్ సిక్సర్ల హోరుతో, సరికొత్త రికార్డులతో హోరెత్తి పోతోంది.
ఐపీఎల్ -17వ సీజన్ లీగ్ మ్యాచ్ లకు ఆతిథ్యమిస్తోన్న హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం పలు సరికొత్త రికార్డులకు చిరునామాగా నిలిచింది.
లీగ్ లో తలపడుతున్న హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు ఇప్పటికే హోంగ్రౌండ్ లో పరుగుల వెల్లువతో రికార్డుల సునామీ సృష్టించింది.
లక్నో సూపర్ జెయింట్స్ తో 12వ రౌండ్ మ్యాచ్ లో 10 వికెట్ల విజయంతో నెగ్గడం ద్వారా రికార్డుల హ్యాట్రిక్ నమోదు చేసింది. అంతేకాదు..ప్రస్తుత సీజన్ లీగ్ లో 1000 సిక్సర్ సైతం హైదరాబాద్ వేదికగానే ..సన్ రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ సాధించడం విశేషం.
13079 బంతుల్లోనే 1000 సిక్సర్లు...
ఐపీఎల్ గత 17 సీజన్ల చరిత్రలో అతితక్కువ బంతుల్లో 1000 సిక్సర్లు నమోదైన సీజన్ గా ప్రస్తుత 2024 సీజన్ నిలిచింది. కేవలం మొదటి 57 మ్యాచ్ ల్లోనే వివిధ జట్ల బ్యాటర్లు వెయ్యి సిక్సర్ల రికార్డు సాధించడంలో తమవంతు పాత్ర నిర్వర్తించారు.
ప్రస్తుత సీజన్ లీగ్ మొదటి 57వ మ్యాచ్ లోనే వెయ్యవ సిక్సర్ నమోదు కావడం విశేషం. 2008 ప్రారంభ ఐపీఎల్ నుంచి ప్రస్తుత 17వ ఐపీఎల్ వరకూ వెయ్యి సిక్సర్లు నమోదు కావడం ఇది మూడోసారి మాత్రమే. అంతేకాదు..అతితక్కువ బంతుల్లో అత్యంత వేగంగా 1000 సిక్సర్ల మైలురాయిని సీజన్ గా కూడా ప్రస్తుత 2024 సీజన్ నిలిచింది.
2023 సీజన్ లీగ్ లో 1000 సిక్సర్లను 15390 బంతుల్లో సాధిస్తే..2022 సీజన్లో వెయ్యి సిక్సర్లు రావటానికి 16 వేల 269 బంతులు ఎదుర్కొనాల్సి వచ్చింది.
గత సీజన్లో మొత్తం 1124 సిక్సర్లు నమోదు కాగా..2022 సీజన్లో 1062 సిక్సర్లు వచ్చాయి.
ప్రస్తుత సీజన్ మొదటి 57 మ్యాచ్ ల్లోనే 1000 సిక్సర్లు రావటంలో సన్ రైజర్స్ ఓపెనింగ్ జోడీ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మతో పాటు ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ లాంటి వీరబాదుడు ఓపెనర్లు సైతం ప్రధానపాత్ర వహించారు.
ప్లే-ఆఫ్ రౌండ్ కు చేరువగా సన్ రైజర్స్...
లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన కీలక 12వ రౌండ్ పోరులో రికార్డు విజయం సాధించడం ద్వారా మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్ ప్లే-ఆఫ్ రౌండ్స్ కు చేరుకోగల అవకాశాలను మెరుగుపరచుకొంది.
హోంగ్రౌండ్ రాజీవ్ స్టేడియం వేదికగా జరిగిన ఈ ఏకపక్ష పోరులో సన్ రైజర్స్ తన విజయలక్ష్య 167 పరుగుల్ని వికెట్ నష్టపోకుండా సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పింది.
కేవలం 58 బంతుల్లోనే ప్రత్యర్థిని చిత్తు చేయడం, మొదటి 10 ఓవర్లలోనే విజేతగా నిలవడం ద్వారా సన్ రైజర్స్ తిరుగులేని రికార్డులు నమోదు చేయగలిగింది.
కేవలం 166 పరుగుల లక్ష్యాన్ని 62 బంతుల్లోనే సాధించిన తొలిజట్టుగా నిలిచింది.
సన్ రైజర్స్ ఓపెనింగ్ జోడీ ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ 30 బంతుల్లోనే మొదటి వికెట్ కు అజేయ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేయడం ద్వారా మరో రికార్డు నెలకొల్పారు.
అభిషేక్ శర్మ 28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 75 పరుగుల నాటౌట్ స్కోరు సాధిస్తే..మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ కేవలం 30 బంతుల్లోనే 8 ఫోర్లు, 8 సిక్సర్లతో 89 పరుగులన నాటౌట్ స్కోరుతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
ప్రస్తుత సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ కమ్ ఓపెనర్ ఘనతను సన్ రైజర్స్ యువఓపెనర్ అభిషేక్ శర్మ దక్కించుకొన్నాడు. మొదటి 12 రౌండ్లలో 7 విజయాలు, 5 పరాజయాలతో 14 పాయింట్లు సాధించడం ద్వారా 10 జట్ల లీగ్ టేబుల్ 3వ స్థానానికి సన్ రైజర్స్ చేరుకోగలిగింది.
ఆఖరి రెండు రౌండ్లలో కనీసం ఒక్కమ్యాచ్ నెగ్గినా..సన్ రైజర్స్ ప్లే-ఆఫ్ రౌండ్ చేరుకోగలుగుతుంది.