బ్రూక్ బ్యాంగ్, బ్యాంగ్..సన్ రైజర్స్ సూపర్ హిట్!

బ్రూక్ సెంచరీతో హైదరాబాద్ సన్ రైజర్స్ 23 పరుగులతో కోల్ కతా నైట్ రైడర్స్ పై సంచలన విజయం సాధించింది.

Advertisement
Update:2023-04-15 13:01 IST

బ్రూక్ బ్యాంగ్, బ్యాంగ్..సన్ రైజర్స్ సూపర్ హిట్!

ఐపీఎల్-16 రౌండ్ రాబిన్ లీగ్ లో పడినజట్లు లేస్తుంటే..లేచినజట్లు పడిపోతున్నాయి. బ్రూక్ సెంచరీతో హైదరాబాద్ సన్ రైజర్స్ 23 పరుగులతో కోల్ కతా నైట్ రైడర్స్ పై సంచలన విజయం సాధించింది..

ఐపీఎల్ ప్రారంభరౌండ్లలో వరుస పరాజయాలతో కుదేలైన హైదరాబాద్ సన్ రైజర్స్ పుంజుకొంది. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో రై..రై మంటోంది. వరుస విజయాలతో జోరు మీదున్న కోల్ కతా నైట్ రైడర్స్ కు పగ్గాలు వేసి వరుసగా రెండో విజయంతో గెలుపుబాట పట్టింది.

బ్రూక్ వడిలో కోల్ కతా గల్లంతు...

భారత క్రికెట్ మక్కా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముగిసిన హైస్కోరింగ్ థ్రిల్లర్లో ఆతిథ్య కోల్ కతా నైట్ రైడర్స్ ను మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్ 23 పరుగులతో కంగు తినిపించింది.

ప్రస్తుత సీజన్లోనే ఇప్పటి వరకూ జరిగిన 19 రౌండ్ల మ్యాచ్ ల్లో అత్యధిక స్కోరు సాధించిన జట్టు( 228 )గా సన్ రైజర్స్ నిలిస్తే..హైదరాబాద్ ఓపెనర్ హ్యారీ బ్రూక్ ప్రస్తుత సీజన్లో తొలిశతకం బాదిన బ్యాటర్ గా రికార్డుల్లో చేరాడు.

ఈడెన్ గార్డెన్స్ లో పరుగుల మోత....

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ సన్ రైజర్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. లీగ్ మొదటి రెండు రౌండ్లమ్యాచ్ ల్లో పరాజయాలు చవిచూసిన సన్ రైజర్స్..మూడోరౌండ్లో పంజాబ్ ప్రత్యర్థిగా సాధించిన విజయంతో తేరుకోగలిగింది. అదేజోరును కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన నాలుగోరౌండ్ మ్యాచ్ లో సైతం కొనసాగించింది.

హ్యారీబ్రూక్ ..పైసా వసూల్..

ప్రస్తుత ఐపీఎల్ వేలంలో డాషింగ్ ఓపెనర్ హ్యారీ బ్రూక్ ను 13 కోట్ల 25 లక్షల రూపాయల భారీధరకు దక్కించుకొన్న హైదరాబాద్ ఫ్రాంచైజీ పెట్టుబడికి తగిన ప్రతిఫలాన్ని చవిచూసింది.

మొదటి మూడు మ్యాచ్ ల్లో కలిపి 25 పరుగులు మాత్రమే చేసిన హ్యారీ బ్రూక్..ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన నాలుగోరౌండ్ పోరులో మాత్రం వీరవిహారమే చేశాడు.

ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 55 బంతుల్లో 100 పరుగుల నాటౌట్ స్కోరుతో ప్రస్తుత సీజన్లో శతకం బాదిన తొలి బ్యాటర్ గా నిలిచాడు.

అంతకుముందు..టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్‌కు కుదురైన ఆరంభం దక్కలేదు. ఉమేశ్‌ యాదవ్‌ తొలి ఓవర్ లోనే మూడు బౌండ్రీలతో..

తన బ్యాట్ పవర్ ఏంటో రుచిచూపించిన బ్రూక్..‌.. ఉమేశ్‌ రెండో ఓవర్‌లో రెండు సిక్సర్లతో విరుచుకు పడ్డాడు.

ఓవైపు బ్రూక్‌ ధాటిగా ఆడుతుంటే మరో వైపు ఓపెనర్ మయాంక్‌ (9), వన్ డౌన్ రాహుల్ త్రిపాఠి (9) వెంట వెంటనే అవుటయ్యారు. రస్సెల్‌ తొలి ఓవర్‌లో వీరిద్దరూ వెనుదిరిగారు. దీంతో పవర్‌ ప్లే (6 ఓవర్లు) ముగిసేసరికి హైదరాబాద్‌ 65/2తో నిలిచింది. మిడిల్‌ ఓవర్స్‌లో కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేయడంతో పరుగుల వేగం మందగించింది. ఇంపాక్ట్ ప్లేయర్ సుయాశ్‌ శర్మ వేసిన 12వ ఓవర్లో కెప్టెన్ మర్కరమ్ 6,6,4 షాట్లతో పరుగులు రాబట్టాడు. బ్రూక్‌ 32 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మరో 4,6 కొట్టి 25 బంతుల్లో అర్థశతం పూర్తి చేసిన మర్కరమ్ భారీషాట్ కు వెళ్లి అవుటయ్యాడు.

ఆ తర్వాత నుంచి బ్రూక్ గేర్ మార్చి దూకుడు పెంచాడు. పేసర్ లాకీ ఫెర్గూసన్‌ వేసిన 15వ ఓవర్లో బ్రూక్‌ 6,4,4,4,4, షాట్లతో 23 పరుగులు సాధించాడు.. తదుపరి ఓవర్‌లో బ్రూక్‌, అభిషేక్‌ చేరో మూడు ఫోర్లు బాదారు.

ఇదేజోరులో బ్రూక్ 55 బంతుల్లో ఐపీఎల్లో తొలి శతకం నమోదు చేసుకున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ లో తొలిశతకం బాదిన బ్యాటర్ ఘనతను బ్రూక్ సొంతం చేసుకోగలిగాడు.

చివరకు సన్ రైజర్స్ 4 వికెట్ల న‌ష్టానికి 228 పరుగులతో ప్రస్తుత సీజన్లోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది.

కోల్ కతా బౌలర్లలో రస్సెల్ 3 వికెట్లు పడగొట్టాడు.

రాణా, రింకూ పోరాడినా...

అనంతరం 229 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు మాత్రమే చేయగలిగింది.

కోల్‌క‌తాకు తొలి ఓవ‌ర్‌లోనే గట్టి షాక్ త‌గిలింది. భువ‌నేశ్వ‌ర్ కుమార్ రెండో బంతికే ఓపెన‌ర్ ర‌హ‌మ‌నుల్లా గుర్బాజ్(0) దొరికిపోయాడు. ఆ త‌ర్వాత మార్కో జాన్‌సెన్ ఓవ‌ర్‌లో వ‌రుస బంతుల్లో వెంక‌టేశ్ అయ్య‌ర్(10), సునీల్ న‌రైన్(0)ల‌ను పెవిలియ‌న్ పంపాడు. 20 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయిన కోల్ కతా ను 4వ వికెట్ కు 62 పరుగుల భాగస్వామ్యంతో మిడిలార్డర్ బ్యాటర్లు ఆదుకొన్నారు. నితీశ్ రానా(75), జ‌గ‌దీశ‌న్(36) నాలుగో వికెట్‌కు 62 ర‌న్స్ జోడించారు. డేంజ‌ర్ మ్యాన్ ఆండ్రూ ర‌స్సెల్(3)ను మార్కండే ఔట్ చేశాడు. ఆ త‌ర్వాత నితీశ్‌, రింకూ సింగ్(58)తో క‌లిసి స్కోర్ 150 దాటించాడు.

కెప్టెన్‌ నితీశ్‌ రాణా (41 బంతుల్లో 75; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), గత మ్యాచ్‌ విన్నింగ్‌ హీరో రింకూ సింగ్‌ (31 బంతుల్లో 58 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది.

హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో లెగ్ స్పిన్నర్ మయాంక్‌ మార్కండే, మార్కో జాన్సెన్‌ చెరో రెండు వికెట్లు ,న‌ట‌రాజ‌న్, ఉమ్రాన్ మాలిక్, భువ‌నేశ్వ‌ర్‌కు ఒక్కో వికెట్ పడగొట్టారు.

సెంచరీహీరో బ్రూక్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

ప్రస్తుత సీజన్ మొదటి నాలుగురౌండ్ల పోరులో కోల్ కతాకు ఇది రెండో ఓటమి కాగా...హైదరాబాద్ కు వరుసగా రెండో గెలుపు.

లీగ్‌లో భాగంగా ఈరోజు జరిగే డబుల్‌ హెడర్‌లో బెంగళూరుతో ఢిల్లీ, లక్నో సూపర్‌ జెయింట్స్‌తో పంజాబ్‌ కింగ్స్‌ తలపడనున్నాయి.

Tags:    
Advertisement

Similar News