పరుగుల యుద్ధంలో విజేత భారత్!
ప్రపంచకప్ ప్రారంభానికి ముందే టీ-20 టాప్ ర్యాంకర్ భారత్ మరో సిరీస్ ఖాయం చేసుకొంది. మూడోర్యాంకర్ దక్షిణాఫ్రికాతో రెండో టీ-20లో నెగ్గడం ద్వారా మూడుమ్యాచ్ ల సిరీస్ లో 2-0తో పైచేయి సాధించింది. గౌహతీవన్డేలో 16 పరుగుల తేడాతో సఫారీలను అధిగమించింది.
ప్రపంచకప్ ప్రారంభానికి ముందే టీ-20 టాప్ ర్యాంకర్ భారత్ మరో సిరీస్ ఖాయం చేసుకొంది. మూడోర్యాంకర్ దక్షిణాఫ్రికాతో రెండో టీ-20లో నెగ్గడం ద్వారా మూడుమ్యాచ్ ల సిరీస్ లో 2-0తో పైచేయి సాధించింది. గౌహతీవన్డేలో 16 పరుగుల తేడాతో సఫారీలను అధిగమించింది....
ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో ప్రపంచ నంబర్ వన్ భారత విజయపరంపర కొనసాగుతోంది. ఈనెల 16న ఆస్ట్ర్రేలియా వేదికగా ప్రారంభంకానున్న టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా దక్షిణాఫ్రికాతో ఆడుతున్న తీన్మార్ సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ లు ముగిసే సమయానికే భారత్ 2-0 ఆధిక్యం సంపాదించింది.
తిరువనంతపురం వేదికగా జరిగిన తొలిపోరులో 8 వికెట్ల అలవోక విజయం సాధించిన భారత్..గౌహతీలోని డాక్టర్ భూపేన్ హజారికా స్టేడియం వేదికగా ముగిసిన హైస్కోరింగ్ రెండో పోరులో 16 పరుగులతో విజేతగా నిలిచింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 237 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. సమాధానంగా దక్షిణాఫ్రికా 3 వికెట్లకు 221 పరుగులు మాత్రమే చేయగలిగింది.
తన స్ట్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీతో భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన ఓపెనర్ రాహుల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
బార్సపారాలో పరుగుల తుపాను....
భారత్ లో అత్యధిక వర్షపాతానికి మరో పేరైన రాష్ట్ర్రాలలో ఒకటైన అసోం వేదికగా జరిగిన రెండో టీ-20పోరులో వానకు బదులుగా కుండపోతగా పరుగుల వర్షం కురిసింది.
20 ఓవర్ల ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 3 వికెట్లు మాత్రమే నష్టపోయి 237 పరుగుల భారీస్కోరు సాధిస్తే..దక్షిణాఫ్రికాజట్టు తన కోటా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికే 221 పరుగులు నమోదు చేసింది. రెండుజట్లు కలసి 458 పరుగులు నమోదు చేయటం విశేషం.
టాప్ గేర్ లో భారత టాపార్డర్...
సిరీస్ కే నిర్ణయాత్మకంగా మారిన ఈమ్యాచ్ లో కీలక టాస్ ఓడి..ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత టాపార్డర్ చెలరేగిపోయింది. ఓపెనర్లు రోహిత్- రాహుల్ మొదటి వికెట్ కు 96 పరుగుల భాగస్వామ్యంతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు.
రాహుల్ 28 బాల్స్ లోనే 5 సిక్సర్లు, 4 ఫోర్లతో 57 పరుగులు, కెప్టెన్ రోహిత్ 37 బాల్స్ లో 7 ఫోర్లు, ఓ సిక్సర్ తో 43 పరుగులు, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ 28 బాల్స్ లో 7 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 49 పరుగుల నాటౌట్ స్కోరు సాధిస్తే...మిస్టర్ 360 షాట్ మేకర్ సూర్యకుమార్ యాదవ్ 5 బౌండ్రీలు 5 సిక్సర్లతో 18 బాల్స్ హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు.
సూర్యకుమార్ కేవలం 22 బాల్స్ లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. దినేశ్ కార్తీక్ 7 బాల్స్ లో 1 బౌండ్రీ, 2సిక్సర్లతో 17 పరుగుల తో నాటౌట్ గా నిలవడంతో భారత్...ప్రత్యర్థి ఎదుట 238 పరుగుల భారీలక్ష్యాన్ని ఉంచగలిగింది. సఫారీ బౌలర్లలో పార్నెల్, ఎంగిడి చెరో వికెట్ పడగొట్టారు.
సఫారీలను ఆదుకోని మిల్లర్ సెంచరీ...
మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 238 పరుగుల భారీలక్ష్యం సాధించాల్సిన దక్షిణాఫ్రికాజట్టు...పవర్ ప్లే ఓవర్లలోనే మూడు టాపార్డర్ వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది.
కెప్టెన్ బవుమా, వన్ డౌన్ రూసో డకౌట్లు కాగా...మర్కరమ్ 33 పరుగుల స్కోరుకు వెనుదిరిగారు. అయితే ..డాషింగ్ ఓపెనర్ క్వింటన్ డి కాక్, సూపర్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ ..4వ వికెట్ కు ప్రపంచ రికార్డు భాగస్వామ్యంతో భారత గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. కిల్లర్ మిల్లర్ కేవలం 47 బాల్స్ లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 106 పరుగుల మెరుపు శతకం సాధించాడు.
మిడిలార్డర్ లో బ్యాటింగ్ కు దిగే డేవిడ్ మిల్లర్ కు టీ-20 ఫార్మాట్లో ఇది రెండో శతకం కావడం విశేషం. క్వింటన్ డి కాక్ 69 పరుగులతో అజేయంగా నిలిచాడు. సఫారీ టీమ్ 20 ఓవర్లలో 221 పరుగులు మాత్రమే చేయడంతో భారత్ 16 పరుగుల తేడాతో మ్యాచ్ నెగ్గి సిరీస్ ను 2-0తో ఖాయం చేసుకోగలిగింది.
భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్ పడగొట్టారు. సిరీస్ లోని ఆఖరి టీ-20మ్యాచ్ ఇండోర్ లోని హోల్కార్ స్టేడియం వేదికగా అక్టోబర్ 4న జరుగుతుంది.