ధర్మశాల పోరులో రికార్డుల జోరు!

ధర్మశాల వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ పోరులో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, పేస్ బౌలర్ మహ్మద్ షమీ అరుదైన రికార్డులు నెలకొల్పారు.

Advertisement
Update:2023-10-23 15:40 IST

ధర్మశాల వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ పోరులో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, పేస్ బౌలర్ మహ్మద్ షమీ అరుదైన రికార్డులు నెలకొల్పారు...

భారత్ వేదికగా జరుగుతున్న 2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో ప్రపంచ నంబర్ వన్ టీమ్ భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఐదో విజయంతో సెమీఫైనల్స్ నాకౌట్ కు మరింత చేరువయ్యింది.

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు 20 సంవత్సరాల తరువాత న్యూజిలాండ్ పై ఓ ప్రపంచకప్ మ్యాచ్ నెగ్గడం ద్వారా సత్తాచాటు కొంది.

ముగ్గురు..మూడు రికార్డులు...

భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య నువ్వానేనా అన్నట్లుగా సాగిన 5వ రౌండ్ పోరులో భారత పేస్ బౌలర్ మహ్మద్ షమీ, ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ మూడు వేర్వేరు రికార్డులు నెలకొల్పారు.

తుదివరకూ పోరాడే నేర్పుకలిగిన న్యూజిలాండ్ పై భారత్ 4 వికెట్ల విజయం సాధించడం లో ప్రధానపాత్ర వహించడం ద్వారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొన్న సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు.

ఏకైక ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ..

న్యూజిలాండ్ ను 273 పరుగుల స్కోరుకే కట్టడి చేయడంలో భారత బౌలర్లు ప్రధానపాత్ర పోషిస్తే..అందులో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ 5 వికెట్లతో కీలకంగా నిలిచాడు.

కివీ ఓపెనర్ యంగ్, వన్ డౌన్ రచిన్ రవీంద్ర, రెండోడౌన్ డారిల్ మిచెల్, లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు సాంట్నర్, మాట్ హెన్రీలను పడగొట్టడం ద్వారా షమీ మ్యాచ్ ను మలుపు తిప్పాడు. 54 పరుగులకే 5 వికెట్లు సాధించాడు.

వన్డే ప్రపంచకప్ చరిత్రలో రెండుసార్లు 5 వికెట్లు పడగొట్టిన భారత తొలి, ఏకైక బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. 33 సంవత్సరాల షమీ తనకు అందివచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొన్నాడు.

మొదటి నాలుగురౌండ్ల మ్యాచ్ ల్లో తుదిజట్టులో చోటు లేక బెంచ్ కే పరిమితమైన షమీ..ధర్మశాల వేదికగా జరిగిన 5వ రౌండ్ మ్యాచ్ తుదిజట్టులో చోటు దక్కించుకొన్నాడు.

2015 వన్డే ప్రపంచకప్ ద్వారా అరంగేట్రం చేసిన మహ్మద్ షమీకి ఇది మూడో ప్రపంచకప్ కాగా..2019 ప్రపంచకప్ లో ఇంగ్లండ్ పై తొలిసారిగా 5 వికెట్లు పడగొట్టాడు.

ప్రస్తుత ప్రపంచకప్ లో సైతం 5 వికెట్ల ఘనతను అందుకోడం ద్వారా పలువురు భారత దిగ్గజాలను అధిగమించాడు.

హేమాహేమీలను మించిన షమీ..

వన్డే ప్రపంచకప్ చరిత్రలో 5 వికెట్లు పడగొట్టిన భారత దిగ్గజ బౌలర్లలో కపిల్ దేవ్, వెంకటేశ్ ప్రసాద్, రాబిన్ సింగ్, అశీశ్ నెహ్ర, యువరాజ్ సింగ్ మాత్రమే ఉన్నారు.

వీరంతా ఒక్కోసారి 5 వికెట్లు పడగొడితే..మహ్మద్ షమీ మాత్రం రెండుసార్లు పడగొట్టడం ద్వారా అరుదైన రికార్డు సొంతం చేసుకోగలిగాడు.

ప్రపంచకప్ లో అత్యధికంగా మూడుసార్లు 5 వికెట్లు పడగొట్టిన రికార్డు కంగారూ ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ పేరుతో ఉంది. గత మూడు ప్రపంచకప్ టోర్నీలలో పాల్గొంటూ వచ్చిన మహ్మద్ షమీ ఇప్పటి వరకూ 36 వికెట్లు సాధించాడు.

సిక్సర్ల హాఫ్ సెంచరీతో రోహిత్ రికార్డు...

న్యూజిలాండ్ పై భారత్ నెగ్గాలంటే 50 ఓవర్లలో 274 పరుగుల స్కోరు చేయాల్సి ఉండగా..యువఓపెనర్ శుభ్ మన్ గిల్ తో కలసి ఇన్నింగ్స్ ప్రారంభించిన కెప్టెన్ రోహిత్ శర్మకేవలం 40 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులు చేయడంతో పాటు మొదటివికెట్ కు 71 పరుగుల భాగస్వామ్యం అందించాడు.

న్యూజిలాండ్ బౌలర్లను అలవోకగా ఎదుర్కనడం ద్వారా 4 సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో క్యాలెండర్ ఇయర్ లో 50 సిక్సర్లు సాధించిన భారత తొలి బ్యాటర్ గా రికార్డు నెలకొల్పాడు.

2023 సీజన్లో గత 10 మాసాల కాలంలో ఆడిన మ్యాచ్ ల్లో రోహిత్ మొత్తం 53 సిక్సర్లు బాదాడు. ప్రస్తుత ప్రపంచకప్ లో ఆడిన ఐదు మ్యాచ్ లు, 4 ఇన్నింగ్స్ లో రోహిత్ సగటున నాలుగు సిక్సర్ల చొప్పున సాధించాడు.

ఓ క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ ప్రపంచ రికార్డు...ఏబీ డివిలియర్స్ పేరుతో ఉంది. 2015 సీజన్లో డివిలియర్స్ 18 ఇన్నింగ్స్ లో 58 సిక్సర్లు బాదడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

2019 సీజన్లో క్రిస్ గేల్ 15 ఇన్నింగ్స్ లో 56 సిక్సర్లు సాధించడం ద్వారా రెండోస్థానంలో నిలిస్తే..రోహిత్ ఇప్పటికే 53 సిక్సర్లు బాదడం ద్వారా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

ప్రపంచకప్ మిగిలిన నాలుగు రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ ల్లో రోహిత్ మరో ఆరు సిక్సర్లు సాధించగలిగితే...డివిలియర్స్ పేరుతో ఉన్న 58 సిక్సర్ల ప్రపంచ రికార్డును అధిగమించడం ఏమంత కష్టంకాబోదు.

శుభ్ మన్ గిల్ 2 వేల పరుగుల ప్రపంచ రికార్డు...

భారత యువఓపెనర్ శుభ్ మన్ గిల్ సైతం ఓ ప్రపంచ రికార్డును తన పేరుతో లిఖించుకొన్నాడు. వన్డే క్రికెట్లో అత్యంతవేగంగా 2 వేల పరుగుల మైలురాయిని చేరిన మొనగాడుగా నిలిచాడు.

ఇప్పటి వరకూ దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హషీం ఆమ్లా పేరుతో ఉన్న 40 ఇన్నింగ్స్ లో 2వేల పరుగుల రికార్డును శుభ్ మన్ కేవలం 38 ఇన్నింగ్స్ లోనే సాధించడం ద్వారా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పగలిగాడు.

మొత్తం మీద..న్యూజిలాండ్ ప్రత్యర్థిగా ప్రపంచకప్ టోర్నీలలో 20 సంవత్సరాల తర్వాత భారత్ కు తొలి గెలుపుతో పాటు..మూడు అరుదైన రికార్డులు సొంతమయ్యాయి.

Tags:    
Advertisement

Similar News