నేటినుంచే రెండోటెస్టు, స్పిన్ అస్త్ర్రాలతో భారత్ రెడీ!

నేటినుంచి ఐదురోజులపాటు జరిగే ఆ పోరు భారత స్పిన్నర్లకు చెలగాటం, కంగారూ బ్యాటర్లకు సిరీస్ సంకటంగా మారింది.

Advertisement
Update:2023-02-17 11:14 IST

టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియా, రెండోర్యాంకర్ భారతజట్ల నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో మరో హాట్ హాట్ ఫైట్ కి న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నిలిచింది. నేటినుంచి ఐదురోజులపాటు జరిగే ఆ పోరు భారత స్పిన్నర్లకు చెలగాటం, కంగారూ బ్యాటర్లకు సిరీస్ సంకటంగా మారింది...

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ నాలుగుమ్యాచ్ ల సిరీస్ లో వరుసగా రెండో విజయానికి రెండోర్యాంకర్ భారత్ ఉరకలేస్తోంది. నాగపూర్ టెస్టు మూడురోజుల ఆటలోనే టాప్ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియాను చిత్తు చేసిన ఆత్మవిశ్వాసంతో కీలక రెండోటెస్టుకు సిద్ధమయ్యింది.

స్లోబౌలర్ల అడ్డా ఢిల్లీ స్టేడియం...

న్యూఢిల్లీ ఫిరోజ్ షా కమ్ అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ స్లోబౌలర్లకు అనుకూలంగా ఉంటూ రావడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుత సిరీస్ లోని రెండోటెస్టుకు ఆతిథ్యమిస్తున్న

ఢిల్లీ స్టేడియం వికెట్ పైన సైతం స్పిన్ బౌలర్ల జోరే కొనసాగనుంది.

ప్రస్తుత సిరీస్ లోని తొలిటెస్టులో భారత స్పిన్నర్ల ముప్పేట దాడిలో గల్లంతైన కంగారూ బ్యాటర్లు తీవ్రఒత్తిడి నడుమ రెండోటెస్టు బరిలోకి దిగబోతున్నారు. ఇన్నింగ్స్ ఓటమితో సిరీస్ ను మొదలుపెట్టిన కంగారూజట్టు..తుదిజట్టులోకి మెరుపు ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ లేదా..పేస్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ లలో ఎవరో ఒకరిని తుదిజట్టులోకి తీసుకొనే అవకాశాలున్నాయి. లెఫ్టామ్ స్పిన్ ఆల్ రౌండర్ అగర్ ను తుదిజట్టులోకి తీసుకొన్నా ఆశ్చర్యపోనక్కరలేదు.

సూర్య స్థానంలో అయ్యర్...

భారతజట్టు సైతం బ్యాటింగ్ ఆర్డర్లో ఒకటి రెండుమార్పులు చేసే ఆలోచనలో ఉంది. ఓపెనర్ గా శుభ్ మన్ గిల్ ను, మిడిలార్డర్లో సూర్యకుమార్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ ను చేర్చుకొనే అవకాశాలున్నాయి. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వైపు సైతం మొగ్గు చూపే అవకాశం ఉంది.

మ్యాచ్ ఐదురోజులూ ఉదయం వేళల్లో శీతల వాతావరణం పేస్ బౌలర్లకు లంచ్ విరామం తర్వాత నుంచి ఎండవేడిమి వాతావరణం స్లోబౌలర్ల పాలిట వరంగా మారనుంది.

ఢిల్లీ పిచ్ కు తగ్గట్టుగా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో రాణించినజట్టుకే విజయావకాశాలున్నాయి.

అందరి కళ్లూ పూజారా పైనే...

భారత క్రికెట్ నయావాల్ చతేశ్వర్ పూజారాకు ఢిల్లీటెస్టు వందో మ్యాచ్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఈ వన్ డౌన్ బ్యాటర్ పైనే కేంద్రీకృతమై ఉంది. గత 13 సంవత్సరాలలో 99 టెస్టులు ఆడేసిన పూజారా..వందో టెస్టును మూడంకెల స్కోరుతో చిరస్మరణీయం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. పైగా ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా పూజారాకు కళ్లు చెదిరే రికార్డే ఉంది.

అప్పుడూ..ఇప్పుడూ ఆస్ట్ర్రేలియానే...

ఒకేజట్టు ప్రత్యర్థిగా మొదటి టెస్టు, వందోటెస్టు ఆడిన బ్యాటర్ గా పూజారా అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నాడు. 2010లో ఆస్ట్ర్రేలియాతో టెస్టు సిరీస్ లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన పోరు ద్వారా టెస్టు అరంగేట్రం చేసిన పూజారా..గత 13 సంవత్సరాల కాలంలో వెనుదిరిగి చూసింది లేదు.

ప్రస్తుత 2023 బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో భాగంగా ఆస్ట్ర్లేలియాతో న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక జరిగే రెండోటెస్టుతో పూజారా తన కెరియర్ లో వందో టెస్టు మ్యాచ్ ను ఆడనున్నాడు.

ప్రస్తుత సిరీస్ లోని నాగపూర్ టెస్టు వరకూ ఆడిన మొత్తం 99 టెస్టుల్లో పూజారా 7వేల 21 పరుగులు సాధించాడు. మొత్తం 19 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలతో 44.39 సగటు నమోదు చేశాడు. ప్రస్తుత సిరీస్ లోని రెండోటెస్టు ద్వారా 100 టెస్టుల క్లబ్ లో చేరిన 13వ భారత క్రికెటర్ గా చరిత్ర సృష్టించనున్నాడు.

ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా పూజారాకు కళ్లు చెదిరే రికార్డే ఉంది. మొత్తం 38 ఇన్నింగ్స్ లో 54 సగటుతో 1900పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 42 స్ట్ర్రయిక్ రేటుతో, 204 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డులతో వందో టెస్టుకు ఉరకలేస్తున్నాడు.

పూజారాకు ముందే వందటెస్టులు ఆడిన 12 మంది భారత క్రికెట్ దిగ్గజాలలో సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, కపిల్ దేవ్, సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రావిడ్ , వీవీఎస్ లక్ష్మణ్, అనీల్ కుంబ్లే, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఇశాంత్ శర్మ, విరాట్ కొహ్లీ ఉన్నారు.

ఢిల్లీ వేదికగా కంగారూలకు ఒక్కటే గెలుపు..

ఢిల్లీ వేదికగా భారత్ పై ఎనిమిది టెస్టులు ఆడిన ఆస్ట్ర్రేలియా 1959- 60 సిరీస్ లో మాత్రమే విజయం సాధించగలిగింది. మిగిలిన ఏడుటెస్టుల్లో సఫలం కాలేకపోయింది.

ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా ప్రస్తుత సిరీస్ లోని నాగపూర్ టెస్టు వరకూ 97 వికెట్లు పడగొట్టిన స్పిన్ జాదూ అశ్విన్ ప్రస్తుత ఢిల్లీ టెస్టులో మరో మూడు వికెట్లు పడగొడితే వికెట్ల సెంచరీ పూర్తి చేయగలుగుతాడు. గతంలోనే అనిల్ కుంబ్లే ఆస్ట్ర్రేలియాపైన 111 వికెట్లతో ఓ అరుదైన రికార్డు సాధించాడు. కుంబ్లే తర్వాత ఆఘనత దక్కించుకొన్న భారత రెండో బౌలర్ గా అశ్విన్ నిలువనున్నాడు.

భారత ప్రత్యర్థిగా అత్యధిక వికెట్లు పడగొట్టిన షేన్ వార్న్ రికార్డును ప్రస్తుత ఢిల్లీ టెస్టు ద్వారా కంగారూ ఆఫ్ స్పిన్నర్ నేథన్ లయన్ అధిగమించే అవకాశాలున్నాయి.

తొలిటెస్టులో ఏడు వికెట్లు పడగొట్టిన ఆస్ట్ర్రేలియా యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీకి ఢిల్లీటెస్టులోనూ భారత బ్యాటర్లు దాసోహమంటారా? వేచిచూడాల్సిందే.

ఢిల్లీటెస్టులో భారత్ కు ఆస్ట్ర్రేలియా ఐదురోజులపాటు పోటీ ఇవ్వటం కూడా అనుమానమే. ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్స్ చేరాలంటే..ప్రస్తుత సిరీస్ ను 3-0తో నెగ్గాల్సిన భారత్..వరుసగా రెండో విజయం సాధించగలిగితే..ఫైనల్స్ బెర్త్ దాదాపుగా ఖాయం చేసుకొన్నట్లే.

Tags:    
Advertisement

Similar News