రెండోటెస్టుకు రెండుమార్పులతో భారత్!

దక్షిణాఫ్రికాతో నెగ్గితీరాల్సిన ఆఖరి టెస్టులో భారత్ రెండుమార్పులతో బరిలోకి దిగనుంది.

Advertisement
Update:2024-01-02 10:19 IST

దక్షిణాఫ్రికాతో నెగ్గితీరాల్సిన ఆఖరి టెస్టులో భారత్ రెండుమార్పులతో బరిలోకి దిగనుంది. కేప్ టౌన్ న్యూలాండ్స్ వేదికగా గురువారం నుంచి సిరీస్ లోని ఈ ఆఖరిటెస్టు ప్రారంభంకానుంది....

టెస్టు క్రికెట్ టాప్ ర్యాంకర్, టెస్టు లీగ్ రన్నరప్ భారత్...దక్షిణాఫ్రికా గడ్డపై అతిపెద్ద పరీక్షకు సిద్ధమయ్యింది. సెంచూరియన్ పార్క్ వేదికగా జరిగిన తొలిటెస్టు మూడురోజుల ఆటలోనే ఇన్నింగ్స్ 32 పరుగుల ఘోరపరాజయంతో కంగుతిన్న భారత్...ఆఖరి టెస్టులో ఆరునూరైనా నెగ్గితీరాలన్న పట్టుదలతో ఉంది. తుదిజట్టులో రెండుమార్పులతో బరిలోకి దిగనుంది.

గెలుపేలేని గ్రౌండ్లో రియల్ టెస్ట్.....

బ్యాటింగ్ కు అనువుగా ఉండే న్యూలాండ్స్ స్టేడియంలో ఇప్పటి వరకూ ఆరుటెస్టులు మాత్రమే ఆడిన భారత్ కనీసం ఒక్క విజయమూ సాధించలేకపోయింది. 4 పరాజయాలు, రెండు డ్రాల రికార్డుతో ఉంది.

ప్రస్తుత సిరీస్ లో భాగంగా తన ఆఖరిటెస్టుమ్యాచ్ ను న్యూలాండ్స్ వేదికగానే భారత్ ఆడటానికి సర్వశక్తులూ కూడదీసుకొని సిద్ధమయ్యింది. సెంచూరియన్ వేదికగా ముగిసిన తొలిటెస్టులో విరాట్ కొహ్లీ, కెఎల్ రాహుల్ మినహా మిగిలిన భారత బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. సఫారీ ఫాస్ట్ బౌలర్లు రబడ, బర్గర్, జెన్సన్ లను దీటుగా ఎదుర్కొనలేకపోయారు. ఫాస్ట్ - బౌన్సీ పిచ్ పైన పేలవమైన షాట్లతో తేలిపోయారు.

అయితే..తొలిటెస్టులో చేసిన పొరపాట్లను..న్యూలాండ్స్ వేదికగా జరిగే రెండోటెస్టులో పునరావృతం కానివ్వరాదన్న పట్టుదలతో చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఉన్నారు.

తుదిజట్టులో జడేజా, ముకేశ్ కుమార్....

గాయంతో తొలిటెస్టుకు దూరమైన రవీంద్ర జడేజా, మీడియం పేసర్ ముకేశ్ కుమార్ లకు సిరీస్ లోని ఆఖరిటెస్టు తుదిజట్టులో చోటు కల్పించడం అనివార్యంగా కనిపిస్తోంది.

తొలిటెస్టులో 19 ఓవర్లలో 41 పరుగులు మాత్రమే ఇచ్చి ఒకే ఒక్క వికెట్ పడగొట్టిన అశ్విన్ ను పక్కన పెట్టి..లెఫ్టామ్ స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు అవకాశమివ్వాలని టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది. 7వ నంబర్ స్థానాన్ని జడేజా భర్తీ చేయనున్నాడు.

గతి తప్పిన ప్రసిద్ధ కృష్ణ స్థానంలోముకేశ్..

సెంచూరియన్ టెస్టుతో అరంగేట్రం చేసిన యువఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణ 19 ఓవర్లలో 93 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టడం ద్వారా విఫలమయ్యాడు. ఆత్మవిశ్వాసం కొరవడిన ప్రసిద్ధ కృష్ణకు బదులుగా ముకేశ్ కుమార్ కు చోటు కల్పించాలని భారత మాజీ కెప్టెన్, విఖ్యాత కామెంటీటర్ సునీల్ గవాస్కర్, భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ గట్టిగా చెబుతున్నారు.

రోహిత్ సత్తాకు సవాల్.....

భారత కెప్టెన్ కమ్ ఓపెనర్ రోహిత్ శర్మ ప్రస్తుత సిరీస్ ఆఖరి టెస్టులో అసలుసిసలు పరీక్ష ఎదుర్కొనబోతున్నాడు. తొలిటెస్టు తొలి ఇన్నింగ్స్ లో 5 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో డకౌట్ గా విఫలమైన రోహిత్ సత్తా కు న్యూలాండ్స్ టెస్టు.. ఓపెనర్ గాను, కెప్టెన్ గాను సవాలు విసురుతోంది.

ప్రస్తుత సిరీస్ లోని తొలిటెస్ట్ వరకూ దక్షిణాఫ్రికాతో 10 టెస్టులు ఆడి 683 పరుగులు సాధించిన రోహిత్ కు 42.37 సగటు నమోదు చేసిన రికార్డు ఉంది. రోహిత్ భారీస్కోరుతో తనజట్టుకు అండగా నిలవాలంటే ముందుగా ఫాస్ట్ బౌలర్ రబడ గండం నుంచి బయటపడాల్సి ఉంది.

రోహిత్ ను అత్యధికసార్లు పడగొట్టిన ఘనత రబడకు ఉంది. పైగా సెంచూరియన్ టెస్టు రెండుఇన్నింగ్స్ లోనూ రోహిత్ ను రబడానే అవుట్ చేయటం విశేషం.

Tags:    
Advertisement

Similar News