నేడే రెండో టీ-20..పొంచిఉన్న వానముప్పు!

భారత్- దక్షిణాఫ్రికాజట్ల రెండో టీ-20కి వానగండం పొంచి ఉంది. గౌహతీలోని డాక్టర్ భూపేన్ హజారికా స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం నిర్వాహక అసోం క్రికెట్ సంఘం భారీస్థాయిలో ఏర్పాట్లు చేసింది.

Advertisement
Update:2022-10-02 08:15 IST

భారత్- దక్షిణాఫ్రికాజట్ల రెండో టీ-20కి వానగండం పొంచి ఉంది. గౌహతీలోని డాక్టర్ భూపేన్ హజారికా స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం నిర్వాహక అసోం క్రికెట్ సంఘం భారీస్థాయిలో ఏర్పాట్లు చేసింది...

ఈశాన్య భారత రాష్ట్ర్రాల ప్రధాన క్రికెట్ కేంద్రం అసోంలోని గౌహతి అనగానే వరుణదేవుడు పిలవకుండానే పలకడం ఓ ఆనవాయితీగా వస్తోంది. 2020 సీజన్లో శ్రీలంకతో జరగాల్సిన టీ-20 మ్యాచ్ కుండపోతగా కురిసిన వానతో రద్దుల పద్దుల్లో చేరిపోయిన జ్ఞాపకాన్ని మరచిపోక ముందే..ఈ రోజు రాత్రి దక్షిణాఫ్రికాతో జరగాల్సిన టీ-20 మ్యాచ్ కు సైతం వానగండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ముందుజాగ్రత్త చర్యలు...

గాంధీజయంతి, దుర్గాష్టమి వేడుకలు ఒకరోజున కలసి రావడం, పైగా ఆదివారం రోజునే ఓ టీ-20 మ్యాచ్ నిర్వహించే అవకాశం దక్కడంతో గౌహతీ టీ-20 మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మ్యాచ్ సమయానికి 39వేలమంది అభిమానులతో స్టేడియం కిటకిటలాడటం ఖాయమని ఆతిథ్య అసోం క్రికెట్ సంఘం భావిస్తోంది.

కుండపోతగా వర్షం కురిసినా గ్రౌండ్ లోకి, పిచ్ లోకి చుక్కనీరు పోకుండా ఉండేలా పటిష్టమైన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది.

అవుట్ ఫీల్డ్ తో పాటు..వికెట్ ను సైతం కప్పిఉంచడానికి వీలుగా అమెరికానుంచి దిగుమతి చేసుకొన్న రెండు భారీకవర్లతో సహా..మొత్తం 22 కవర్లతో పకడ్బంధీ ఏర్పాట్లు చేసింది.

గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని మ్యాచ్ నిర్వహణ కోసం విస్త్ర్రుత స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు అసోం క్రికెట్ సంఘం కార్యదర్శి సైకియా ప్రకటించారు.


సఫారీలకు డూ ఆర్ డై...

మూడుమ్యాచ్ ల ఈ సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోవాలంటే...మూడోర్యాంకర్ దక్షిణాఫ్రికాజట్టు..ఆరునూరైనా ఈ మ్యాచ్ లో నెగ్గితీరాల్సి ఉంది. తిరువనంతపురం వేదికగా ముగిసిన తొలి టీ-20లో భారత్ 8 వికెట్ల అలవోక విజయంతో 1-0 తో ఆధిక్యం సాధించడంతో..ఇప్పుడు ఒత్తిడి సఫారీజట్టుపైనే పడింది.

మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో అత్యంత పటిష్టంగా ఉన్న టాప్ ర్యాంకర్ భారత్ బ్యాక్ టు బ్యాక్ విజయాలతో సిరీస్ కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది.

ప్రపంచకప్ కు సన్నాహకంగా ఆడుతున్న ఈ ఆఖరి సిరీస్ ద్వారా భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చహాల్ లాంటి కీలక ఆటగాళ్లు పూర్తిస్థాయిలో గాడిలో పడాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది.

సూర్యవైపే అందరిచూపు...

గత కొద్దిమ్యాచ్ లుగా తన విలక్షణమైన బ్యాటింగ్ తో చెలరేగిపోతున్న మిస్టర్ 360 స్ట్ర్రోక్ మేకర్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ కు సైతం ప్రధాన ఆకర్షణకానున్నాడు.

తిరువనంతపురం మ్యాచ్ లో సఫారీబౌలర్లను ఓ ఆటాడుకొన్న సూర్యకుమార్ కు పగ్గాలు వేయాలన్న పట్టుదలతో దక్షిణాఫ్రికా ఉంది. రబడ, నోర్జే, వెయిన్ పార్నెల్ లాంటి ప్రపంచ మేటి ఫాస్ట్ బౌలింగ్ త్రయంతో సఫారీటీమ్..భారత టాపార్డర్ కు సమస్యలు సృష్టించడానికి తగిన వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. దీనికితోడు దక్షిణాఫ్రికా బ్యాటర్లు పూర్తిస్థాయిలో రాణించగలిగితేనే భారత్ కు గట్టిపోటీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి.

బౌలింగ్ విభాగంలో బుమ్రా, భువీ లాంటి సీనియర్ బౌలర్లు లేని లోటును యువపేసర్ల జోడీ అర్షదీప్ సింగ్, దీపక్ చహార్, హర్షల్ పటేల్ ల త్రయం పూడ్చగలగడంతో భారత టీమ్ మేనేజ్ మెంట్ ఊపిరిపీల్చుకొంటోంది.

రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో సైతం టాస్ కీలకం కానుంది. టాస్ నెగ్గినజట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే..ఇప్పటి వరకూ 21 మ్యాచ్ ల్లో తలపడితే..భారత్ 11 విజయాలు, దక్షిణాఫ్రికా 9 విజయాల రికార్డుతో ఉన్నాయి.

దక్షిణాఫ్రికాజట్టు పూర్తిస్థాయిలో రాణించగలిగితే ఆతిథ్య భారత్ కు గట్టిపోటీ తప్పదు.

Tags:    
Advertisement

Similar News