హైదరాబాద్ క్రికెట్ దర్జాయే వేరు!

హైదరాబాద్ అంటే నోరూరించే బిర్యానీ, గాల్లో తేలిపోయేలా చేసే ఇరానీ చాయ్ మాత్రమే కాదు, మణికట్టుమాయతో అభిమానులను ఓలలాడించే క్రికెటర్ల అడ్డా కూడా. ఇక్కడి క్రికెట్ ప్రధానవేదిక రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం దర్జాయే వేరు.

Advertisement
Update:2022-09-25 09:00 IST

హైదరాబాద్ అంటే నోరూరించే బిర్యానీ, గాల్లో తేలిపోయేలా చేసే ఇరానీ చాయ్ మాత్రమే కాదు, మణికట్టుమాయతో అభిమానులను ఓలలాడించే క్రికెటర్ల అడ్డా కూడా. ఇక్కడి క్రికెట్ ప్రధానవేదిక రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం దర్జాయే వేరు.....

దేశంలో ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్ కతా, వడోదర లాంటి అరడజనుకు పైగా క్రికెట్ కేంద్రాలున్నా హైదరాబాద్ ఘనత, దర్జాయే వేరు. మన్సూర్ అలీఖాన్ పటౌడీ, జయసింహా, అబీద్ అలీ, అజర్, లక్ష్మణ్, వెంకటపతి రాజు, రాయుడు, మిథాలీ రాజ్ లాంటి ఎందరో గొప్పగొప్ప క్రికెటర్లను అందించిన చరిత్ర హైదరాబాద్ కు ఉంది. హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ మ్యాచ్ అంటే స్టేడియం కిటకిటలాడాల్సిందే.

లాల్ బహదూర్ స్టేడియం టు రాజీవ్ స్టేడియం...

హైదరాబాద్ క్రికెట్ కు ఒకప్పుడు నగరం నడిబొడ్డునే ఉన్న లాల్ బహదూర్ స్టేడియం ( ఫతేమైదాన్ ) చిరునామాగా ఉండేది. అయితే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యమా అంటూ హైదరాబాద్ క్రికెట్ సంఘం తనకంటూ ఓ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని ఏర్పాటు చేసుకోగలిగింది.

2004లో ఉప్పల్ ప్రాంతంలో 15 ఎకరాల విస్తీర్ణంలో 50కోట్ల రూపాయల వ్యయంతో రాజీవ్ స్టేడియాన్ని నిర్మించారు. స్టేడియం నిర్మాణానికి అవసరమైన నిధులను బీసీసీఐ సమకూర్చింది. సబ్సిడీ ధరపై స్టేడియానికి అవసరమైన భూమిని అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ మంజూరు చేశారు.


2005లో తొలి అంతర్జాతీయ మ్యాచ్...

2005 లో తొలి అంతర్జాతీయమ్యాచ్ కు ఆతిథ్యమిచ్చిన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియానికి బ్యాటర్ల స్వర్గధామం, స్పిన్నర్ల అడ్డాగా పేరుంది. 2005 నుంచి 2019 వరకూ..ఐదు టెస్టులు, ఆరు వన్డే మ్యాచ్ లతో పాటు...రెండు టీ-20 అంతర్జాతీయ మ్యాచ్ లతో పాటు డజన్లకొద్దీ ఐపీఎల్, ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చింది.

2017 లో భారత్- ఆస్ట్ర్రేలియా జట్ల మధ్య జరగాల్సిన టీ-20 మ్యాచ్ కుండపోత వర్షంతో రద్దుల పద్దులో చేరిపోయింది.

విరాట్ కొహ్లీ రికార్డుల మోత...

రాజీవ్ స్టేడియం వేదికగా 2019లో వెస్టిండీస్ తో ముగిసిన హైస్కోరింగ్ టీ-20 మ్యాచ్ లో విరాట్ కొహ్లీ చెలరేగిపోయాడు. 2019 డిసెంబర్ 6న జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 205 పరుగుల భారీలక్ష్యాన్ని అలవోకగా చేదించింది. కెప్టెన్ విరాట్ కొహ్లీ 50 బాల్స్ లో 94 పరుగుల స్కోరు సాధించడంతో భారత్ 6 వికెట్ల విజయం సాధించింది.

రాజీవ్ స్టేడియం వేదికగా అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డు విరాట్ కొహ్లీ పేరుతోనే ఉంది. విరాట్ 6 సిక్సర్లు, 6 ఫోర్లతో 94 పరుగులు సాధించాడు. అంతేకాదు..రాహుల్ తో కలసి 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం కూడా ఓ రికార్డే.

ఇక బౌలర్లలో...లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ 4 ఓవర్లలో 36 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టడం ద్వారా అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేయగలిగాడు.

టాస్ నెగ్గటమే కీలకం....

హైదరాబాద్ వేదికగా సైతం టాస్ కీలకం కానుంది. చేజింగ్ కు దిగిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజీవ్ స్టేడియం వేదికగా ముగిసిన గత ఐదుమ్యాచ్ ల్లో

ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్లు రెండుసార్లు, చేజింగ్ కు దిగిన జట్లు రెండుసార్లు విజయాలు సాధించాయి.

మూడేళ్ల సుదీర్ఘవిరామం తర్వాత హైదరాబాద్ వేదికగా ఈరోజు జరుగుతున్న కీలకపోరుకు రాజీవ్ స్టేడియం కిటకిటలాడనుంది. మొత్తం 55వేల సీటింగ్ సామర్థ్యం కలిగిన ఈ వేదిక నిండుకుండలా మారిపోనుంది.

ఆతిథ్య భారత్ విజేతగా నిలవడం ద్వారా సిరీస్ కైవసం చేసుకోగలిగితే...వేదికగా హైదరాబాద్ చిరస్మరణీయం కాగలుగుతుంది.

Tags:    
Advertisement

Similar News