ఆ ఇద్దరి సమక్షంలో శతకం..ఆనందడోలికల్లో విరాట్ !
తన క్రికెట్ హీరో సచిన్ పేరుతో ఉన్న వన్డే శతకాల ప్రపంచరికార్డును అధిగమించడంతో విరాట్ కొహ్లీ గాల్లో తేలిపోతున్నాడు.
తన క్రికెట్ హీరో సచిన్ పేరుతో ఉన్న వన్డే శతకాల ప్రపంచరికార్డును అధిగమించడంతో విరాట్ కొహ్లీ గాల్లో తేలిపోతున్నాడు. తన క్రికెట్ జీవితంలో ఇదో చిరస్మరణీయ ఘట్టమని మురిసిపోతున్నాడు.
భారత క్రికెట్ నయామాస్టర్ విరాట్ కొహ్లీ మరో అరుదైన ప్రపంచ రికార్డు సాధించాడు. తన ఆరాధ్య క్రికెటర్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న 49 వన్డే శతకాల ప్రపంచ రికార్డును విరాట్ ఎట్టకేలకు అధిగమించడం ద్వారా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పగలిగాడు.
ముంబైలోనే..సచిన్, అనుష్కల సమక్షంలోనే...
మాస్టర్ సచిన్ హోంగ్రౌండ్ ముంబై వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్ పోరులో విరాట్ 113 బంతుల్లో 117 పరుగుల స్కోరు సాధించడం ద్వారా మాస్టర్ సచిన్ పేరుతో ఉన్న 49 సెంచరీల రికార్డును అధిగమించడం ద్వారా 50వ శతకాన్ని నమోదు చేశాడు. ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్ గా ప్రపంచ రికార్డుల్లో చేరాడు.
మొత్తం 33వేల మంది అభిమానులతో కిటకిటలాడిన ముంబై వాంఖడే స్టేడియంలో విరాట్ ప్రపంచ రికార్డు శతకం సాధించిన సమయంలో పలువురు ప్రపంచ మేటి ప్రముఖులు, సెలెబ్రిటీలతో పాటు మాస్టర్ సచిన్, కరీబియన్ క్రికెట్ గ్రేట్ సర్ వివియన్ రిచర్డ్స్, బ్రిటీష్ సాకర్ గ్రేట్ డేవిడ్ బెకామ్ తో పాటు కొహ్లీ జీవిత భాగస్వామి అనుష్క సైతం ఉన్నారు.
వన్డే క్రికెట్లో 50 శతకం సాధించిన వెంటనే విరాట్...అతిథుల స్టాండ్స్ లో ఉన్న మాస్టర్ సచిన్ కు ముందుగా అభివాదం చేశాడు,. ఆ తరువాత తన భార్య అనుష్కకు గాల్లో ముద్దులు విసురుతూ ఆనందం పంచుకొన్నాడు.
ఇదో చిరస్మరణీయ శతకం...
గత 14 సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెట్లో 75కు పైగా శతకాలు బాదుతూ వచ్చినా...ప్రస్తుత వన్డే ప్రపంచకప్ లో..అదీ న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్లో సాధించిన సెంచరీ తన జీవితంలో కలకాలం గుర్తుండి పోతుందని, తనకు అన్నీ కలసి వచ్చాయని, తన క్రికెట్ హీరో సచిన్ టెండుల్కర్, జీవన సహచరి అనుష్కల సమక్షంలో ఈ ఘనత, ప్రపంచ రికార్డు శతకం సాధించడాన్ని మించింది మరేదీలేదంటూ విరాట్ మురిసిపోయాడు.
విరాట్ కు మాస్టర్ సచిన్ హ్యాట్సాఫ్...
గత రెండు దశాబ్దాలుగా తన పేరుతో ఉన్న అత్యధిక వన్డే సెంచరీల ప్రపంచ రికార్డును విరాట్ కొహ్లీనే అధిగమించడం అపూర్వమని, తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, మరో భారత క్రికెటర్ మాత్రమే తన రికార్డును తెరమరుగు చేయటం గర్వకారణంగా అనిపించిందని సచిన్ చెప్పాడు. విరాట్ కొహ్లీని ఆలింగనం చేసుకొని మరీ అభినందించాడు.
దీనికితోడు సాకర్ సూపర్ స్టార్ డేవిడ్ బెకామ్ సైతం విరాట్ ను కొనియాడాడు. సచిన్ 49 శతకాల ప్రపంచ రికార్డు గురించి తనకు తెలుసునని..అయితే విరాట్ నెలకొల్పిన సరికొత్త ప్రపంచ రికార్డును ప్రత్యక్షంగా చూడటం తనకు లభించిన అరుదైన అవకాశమని బెకామ్ చెప్పాడు.
సచిన్ ను మించిన విరాట్...
ప్రపంచకప్ చరిత్రలో..ఓ సింగిల్ టోర్నీలో సచిన్ సాధించిన 673 పరుగుల రికార్డును సైతం విరాట్ అధిగమించాడు. 2003 ప్రపంచకప్ లో సచిన్ అత్యధికంగా 673 పరుగులు సాధిస్తే..ప్రస్తుత ప్రపంచకప్ సెమీఫైనల్స్ వరకూ 3 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలతో సహా విరాట్ 711 పరుగులతో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
♦