నా 400 రన్స్ రికార్డ్ అధిగమించేది ఆ భారత ఆటగాడే అన్న లారా
భారత క్రికెట్లో నయా సంచలనం యశస్వి జైస్వాల్‌కు తన 400 పరుగుల రికార్డును అధిగమించే సత్తా ఉందని లారా అభిప్రాయపడ్డాడు.
క్రికెట్‌లో బ్యాట్స్‌మన్ దూకుడు పెరిగాక ఎన్నో రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. టీ20 స్టైల్ బ్యాటింగ్‌తో టెస్ట్ క్రికెట్‌లోనూ ధనాధన్ ఆటతీరు ప్రదర్శిస్తూ 200, 300 అలవోకగా కొట్టేస్తున్నారు. కానీ టెస్ట్‌ల్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 400 నాటౌట్. వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ బ్రయాన్ లారా 2004లో ఇంగ్లాండ్‌పై 400 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 20 ఏళ్లయినా ఎవరూ ఆ రికార్డును టచ్ చేయలేకపోతున్నారు. అయితే ఆ రికార్డును చెరిపేసే సత్తా భారత యువ బ్యాట్స్‌మన్ ఒకరికి ఉందని స్వయంగా లారానే చెప్పడం ఆసక్తికరంగా మారింది.
ఎస్.. యశస్వీ జైస్వాల్‌కే ఆ సత్తా
భారత క్రికెట్లో నయా సంచలనం యశస్వి జైస్వాల్‌కు తన 400 పరుగుల రికార్డును అధిగమించే సత్తా ఉందని లారా అభిప్రాయపడ్డాడు. ఇదొక్కటే కాదు ఇంకా చాలా రికార్డులను కొట్టగల సామర్థ్యం అతడికి ఉందన్నాడు. పోయిన సంవత్సరం నుంచి యశస్వి ఆటను గమనిస్తే చాలా మార్పులు వచ్చాయని, మెరుగ్గా ఆడుతున్నాడని లారా అభినందించాడు. నా రికార్డులకు ముప్పు ఉందని భావిస్తున్నా. చాలా మందికి అవకాశం ఉన్నా అందులో యశస్వి జైస్వాల్‌కు అందరికంటే ఎక్కువ ఛాన్స్ ఉందన్నాడు. ఇప్పటికే అతను రెండుసార్లు డబుల్ సెంచరీలు బాదాడని గుర్తు చేశాడు.
నేర్చుకోవడానికి సన్నద్ధంగా ఉంటాడు
గతేడాది ఓ మ్యాచ్ సందర్భంగా యశస్వి తనతో మాట్లాడాడన్న లారా తమ మధ్య చాలా విషయాలు చర్చకు వచ్చాయని చెప్పాడు. సీనియర్ల నుంచి నేర్చుకోవడానికి అతను ఎప్పుడూ రెడీగా ఉంటాడు. ఈ ఐపీఎల్‌లో హైదరాబాద్, రాజస్థాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత జైస్వాల్ నా హోటల్ రూమ్‌కు వచ్చాడు. మేం తెల్లవారుజామున 4 గంటల వరకు మాట్లాడుకుంటూనే ఉన్నామని వెస్టిండీస్ దిగ్గజం చెప్పాడు.