సెంచరీతో హర్మన్ జోరు..భారత్ దెబ్బకు ఇంగ్లండ్ బేజారు!

భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ రికార్డు సెంచరీ సాధించడంతో ఇంగ్లండ్ తో మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ మొదటి రెండుమ్యాచ్ లు ముగిసే సమయానికి భారత్ 2-0తో సిరీస్ ఖాయం చేసుకొంది....

Advertisement
Update:2022-09-22 10:36 IST

Harmanpreet Kaur

భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ రికార్డు సెంచరీ సాధించడంతో ఇంగ్లండ్ తో మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ మొదటి రెండుమ్యాచ్ లు ముగిసే సమయానికి భారత్ 2-0తో సిరీస్ ఖాయం చేసుకొంది....

ఇంగ్లండ్ గడ్డపై భారత మహిళాజట్టు వన్డే సిరీస్ ను అలవోకగా గెలుచుకొంది. హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టు ..ఇంగ్లండ్ ను ఇంగ్లండ్ గడ్డపై చిత్తు చేయడం ద్వారా ఈ ఘనతను సాధించింది.

వెటరన్ ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామికి వీడ్కోలు సిరీస్ గా జరుగుతున్న ఈ వన్డే సిరీస్ లోని రెండోమ్యాచ్ ను సైతం భారత్ భారీతేడాతో గెలుచుకొంది. కాంటర్ బరీలోని సెయింట్ లారెన్స్ గ్రౌండ్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన రెండో వన్డేలో భారత్ 88 పరుగుల విజయం నమోదు చేసి మూడుమ్యాచ్ ల సిరీస్ లో 2-0తో పైచేయి సాధించింది.

హర్మన్ ధూమ్ ధామ్ శతకం..

సిరీస్ కే నిర్ణయాత్మకంగా మారిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 333 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. సమాధానంగా ఇంగ్లండ్ 245 పరుగులకే కుప్పకూలింది.

భారత కెప్టెన్ కమ్ స్టార్ బ్యాటర్ హర్మన్ ప్రీత్ కౌర్ 100 బంతుల్లో వంద పరుగులు సాధించడంతో పాటు మొత్తం 111 బాల్స్ లో 143 పరుగుల నాటౌట్ స్కోరుతో సరికొత్త రికార్డు నమోదు చేసింది.

ఓపెనర్ షఫాలీవర్మ తక్కువ స్కోరుకే అవుట్ కాగా...స్టార్ ఓపెనర్ స్మృతి మంధానా 40 పరుగులు, యాస్టిక భట్ 26, డియోల్ 58 పరుగుల స్కోర్లు సాధించారు.

ఆఖరి మూడు ఓవర్లలో హర్మన్ 62 పరుగులు సాధించడం విశేషం. అంతేకాదు..ఇంగ్లండ్ ప్రత్యర్థిగా అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత మహిళా బ్యాటర్ గా హర్మన్ రికార్డుల్లో చేరింది.

111 బాల్స్ లోనే 143 నాటౌట్...

తన కెరియర్ లో 123వ వన్డే మ్యాచ్ ఆడిన హర్మన్ 4 సిక్సర్లు, 18 ఫోర్లతో 143 పరుగుల అజేయస్కోరుతో తన రికార్డును తానే అధిగమించింది. వన్డే క్రికెట్ లో హర్మన్ కు ఇది 5వ శతకం. అత్యధికంగా 7 శతకాలు సాధించిన రికార్డు మిథాలీ పేరుతో ఉంది. స్మృతి మంధానా, హర్మన్ ప్రీత్ కౌర్ చెరో ఐదు సెంచరీలు చొప్పున సాధించి..మిథాలీ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు.

సిరీస్ లోని తొలివన్డేలో 7 వికెట్ల విజయం సాధించిన భారత్ రెండో వన్డేలో 88 పరుగుల విజయంతో సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించింది. సిరీస్ లోని ఆఖరి వన్డే సెప్టెంబర్ 24న జరుగనుంది. ఈ సిరీస్ తో 39 సంవత్సరాల వెటరన్ ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి క్రికెట్ నుంచి రిటైర్ కానుంది.

Tags:    
Advertisement

Similar News