నాన్నదే ఈ ఘనత ...హార్థిక్ పాండ్యా భావోద్వేగం!

టీ-20 క్రికెట్లో 1000 పరుగులు, 50 వికెట్ల అరుదైన రికార్డు సాధించిన భారత తొలి క్రికెటర్ హార్థిక్ పాండ్యా కన్నీరుమున్నీరయ్యాడు.

Advertisement
Update:2022-10-24 13:33 IST

టీ-20 క్రికెట్లో 1000 పరుగులు, 50 వికెట్ల అరుదైన రికార్డు సాధించిన భారత తొలి క్రికెటర్ హార్థిక్ పాండ్యా కన్నీరుమున్నీరయ్యాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై భారత సంచలన విజయంలో పాండ్యా తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో కీలకపాత్ర పోషించాడు...

క్రీడలు ఏవైనా భారత్- పాకిస్థాన్ జట్ల పోరాటం అంటేనే ఓ భావోద్వేగాల సమరం. రెండుజట్ల ఆటగాళ్ళు మాత్రమేకాదు...అభిమానులు సైతం తీవ్రఒత్తిడికి గురికావడం సహజం. పాక్ తో మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం వేదికగా ముగిసిన టీ-20 ప్రపంచకప్ మ్యాచ్ లో భారత సంచలన విజయంలో ప్రధానపాత్ర వహించిన విరాట్ కొహ్లీతో కలసి కీలక భాగస్వామ్యం నమోదు చేసిన హార్థిక్ పాండ్యా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు.

ఒకేఒక్కడు హార్థిక్ పాండ్యా....

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఆఖరి ఓవర్ చివరి బంతి వరకూ సాగిన ఉత్కంఠభరిత పోరులో హార్థిక్ పాండ్యా బౌలర్ గానూ, బ్యాటర్ గాను రాణించాడు. తన కోటా 4 ఓవర్లలో 30 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ అత్యుత్తమంగా రాణించాడు. 160 పరుగుల విజయలక్ష్యంతో చేజింగ్ కు దిగిన భారత్ 6.1 ఓవర్లలోనే 31 పరుగులకే 4 వికెట్లు నష్టపోయి ఓటమి అంచుల్లో కూరుకుపోయింది. ఆ దశలో విరాట్ కొహ్లీతో జంటగా హార్థిక్ పాండ్యా భారత పోరాటం కొనసాగించాడు. 5వ వికెట్ కు 113 పరుగుల కీలక భాగస్వామ్యంతో మ్యాచ్ ను మలుపు తిప్పాడు.

హార్థిక్ పాండ్యా 37 బంతులు ఎదుర్కొని ఓ బౌండ్రీ, 2 సిక్సర్లతో 40 పరుగులు సాధించి..20వ ఓవర్ తొలిబంతికి అవుటయ్యాడు. భారత 4 వికెట్ల విజయంలో తనవంతు పాత్ర నిర్వర్తించాడు.

ఈ క్రమంలో టీ-20 క్రికెట్లో 1000 పరుగులు, 50 వికెట్ల రికార్డు సాధించిన భారత తొలి క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.

నాన్నకే ఈ రికార్డు అంకితం...

మ్యాచ్ ముగిసిన అనంతరం తన అరుదైన రికార్డును తలచుకొని హార్థిక్ పాండ్యా కన్నీరుమున్నీరయ్యాడు. తన తండ్రిని గుర్తు చేసుకొని ఆనందభాష్పాలు రాల్చాడు.

తన ఉన్నతి కోసం తన తండ్రి ఎంతో త్యాగం చేశారని, ఎన్నో కష్టాలు పడ్డారని చెప్పాడు. తాను ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడే తమ ఉన్నతి కోసం కుటుంబంతో పాటు తన వ్యాపారాన్ని సైతం పట్టణానికి తరలించారని, తన తండ్రి ఆ త్యాగం చేయకుంటే తాను ఈ స్థితిలో ఉండేవాడిని కానని, ఈ రికార్డు సైతం సాధ్యమయ్యేది కాదని భావోద్వేగంతో చెప్పాడు. తన తండ్రికి సదా రుణపడి ఉంటానని తెలిపాడు.

విరాట్ కు పాండ్యా హ్యాట్సాఫ్...

ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్ ఓటమి అంచుల నుంచి బయటపడి సంచలన విజయం సాధించడంలో కీలకపాత్ర వహించిన విరాట్ కొహ్లీకి హార్థిక్ పాండ్యా హ్యాట్సాఫ్ చెప్పాడు.

ఆట 18వ ఓవర్లో పాక్ తురుపుముక్క రవూఫ్ ను విరాట్ ఎదుర్కొన్న తీరు, వరుసగా రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాదిన విధానం అపూర్వమని కితాబిచ్చాడు.

క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ ఎన్నో సిక్సర్లు బాదిన అనుభం తనకు ఉందని, అయితే ..తీవ్రఒత్తిడి నడుమ రవూఫ్ బౌలింగ్ లో విరాట్ కొట్టిన సిక్సర్లు అసాధారణమైనవని, అలాంటి అసాధారణ షాట్లు ఆడటం కేవలం విరాట్ కు మాత్రమే సాధ్యమని ప్రశంసించాడు.

Tags:    
Advertisement

Similar News