ఐపీఎల్-16లో గుజరాత్‌ బోణీ, నేడు డబుల్ షో!

ఐపీఎల్ 16వ సీజన్ ను డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ కళ్లు చెదిరే విజయంతో మొదలు పెట్టింది

Advertisement
Update:2023-04-01 07:05 IST

ఐపీఎల్ 16వ సీజన్ ను డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ కళ్లు చెదిరే విజయంతో మొదలు పెట్టింది. లీగ్ ప్రారంభ మ్యాచ్ లో చెన్నైను 5 వికెట్లతో అధిగమించింది..

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో 2023 సీజన్ ఐపీఎల్ టోర్నీ అట్టహాసంగా ప్రారంభమయ్యింది. లక్షమంది అభిమానుల సమక్షంలో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ 5 వికెట్లతో నాలుగుసార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్ పై నెగ్గి శుభారంభం చేసింది.

సూపర్ కింగ్స్ కు రషీద్ ఖాన్ చెక్...

70 మ్యాచ్ ల ఐపీఎల్ లీగ్ కు ప్రస్తుత చాంపియన్ గుజరాత్ టైటాన్స్, మాజీ చాంపియన్ Chennai Super Kings అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాయి. 10 జట్లతో మే 28 వరకూ సాగే లీగ్ డబుల్ రౌండ్ రాబిన్ ప్రారంభమ్యాచ్ కు..భారీసంఖ్యలో లక్షమంది అభిమానులు తరలి వచ్చారు.

ఈ మ్యాచ్ లో ఆతిథ్య గుజరాత్ టైటాన్స్ టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా..చెన్నైజట్టు అయిష్టంగానే బ్యాటింగ్ కు దిగాల్సి వచ్చింది.

డేవిడ్ కాన్వే, బెన్ స్టోక్స్ , మోయిన్ అలీ లాంటి పలువురు సూపర్ స్టార్లున్న చెన్నై నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది.

ఒకదశలో ఆట మొదటి 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికే 121 పరుగులతో 200 స్కోరు దిశగా సాగుతున్న చెన్నైని గుజరాత్ బౌలర్లు మిడిల్ ఓవర్లలో సమర్థవంతంగా కట్టడి చేయగలిగారు.

రితురాజ్ మెరుపు బ్యాటింగ్...

చెన్నై ఓపెనర్ రితురాజ్ గయక్వాడ్ కేవలం 50 బంతుల్లోనే 9 సిక్సర్లు, 4 బౌండ్రీలతో సుడిగాలి హాఫ్ సెంచరీ సాధించాడు. 92 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

సెంచరీకి 8 పరుగుల దూరంలో అవుటయ్యాడు. చెన్నై టాపార్డర్ లోని మిగిలిన బ్యాటర్లు స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయారు.

భారీ అంచనాల మధ్య క్రీజులోకి అడుగుపెట్టిన ఇంగ్లండ్‌ సూపర్ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ (7)తో పాటు..కివీ మెరుపు ఓపెనర్ డ్వేన్‌ కాన్వే (1), రవీంద్ర జడేజా (1) , అంబటి రాయుడు (12 ) విఫలమయ్యారు. సెంచరీకి 8 పరుగుల దూరంలో రుతురాజ్‌ వెనుదిరగగా..శివమ్‌ దూబే తడబడినా (19)... చివర్లో ధోనీ బ్యాటు ఝళిపించాడు.

7 బంతుల్లో ఓ సిక్సర్, బౌండ్రీలతో 14 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు. ఆఖరి 5 ఓవర్లలో చెన్నై 45 పరుగులు మాత్రమే సాధించగలిగింది.

గుజరాత్‌ బౌలర్లలో పేసర్ మహమ్మద్‌ షమీ, స్పిన్నర్ రషీద్‌ ఖాన్‌, ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

200 సిక్సర్ల క్లబ్ లో మహీ...

ఐపీఎల్ 16వ సీజన్ తొలిమ్యాచ్ లోనే ధోనీ సిక్సర్ బాదడం ద్వారా..తన భారీషాట్ల సంఖ్యను 200కు చేర్చుకోగలిగాడు. స్వింగ్ బౌలర్ జోషువా లిటిల్ బౌలింగ్ లో సిక్సర్ బాదడం ద్వారా..ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టు తరపున 200 సిక్సర్లు సాధించిన ఐదో క్రికెటర్ గా ధోనీ రికార్డుల్లో చేరాడు.

గతంలో ఇదే ఘనత సాధించిన దిగ్గజ బ్యాటర్లలో క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, విరాట్ కొహ్లీ, కిరాన్ పోలార్డ్ ఉన్నారు.

శుభ్ మన్ గిల్ అదేజోరు....

అనంతరం 179 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన గుజరాత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే .. 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. యువ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌ 36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో మెరుపు హాఫ్ సెంచరీతో (63 ) తనజట్టు విజయంలో ప్రధానపాత్ర వహించాడు.

ఓపెనర్ కమ్ వెటరన్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా (16 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు)తో పాటు.. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా జట్టులోకి వచ్చిన సాయి సుదర్శన్‌ (22), ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ (21 బంతుల్లో 27; 2 ఫోర్లు, ఒక సిక్సర్‌)తో తమవంతు పాత్ర నిర్వర్తించారు.

చెన్నై బౌలర్లలో రాజ్‌వర్ధన్‌ 3 వికెట్లు సాధించాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో రాణించిన స్పిన్ ఆల్ రౌండర్ రషీద్‌ ఖాన్ కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

తొలి ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా తుషార్‌

ఐపీఎల్ లో తొలిసారిగా ప్రవేశ పెట్టిన ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ నిబంధనను మొదటి మ్యాచ్‌లోనే రెండుజట్లూ ఉపయోగించుకొన్నాయి. చెన్నైజట్టు బ్యాటింగ్‌లో అంబటి రాయుడు సేవలను వినియోగించుకుని‌.. బౌలింగ్‌కు దిగిన సమయంలో జట్టు నుంచి రాయుడును తప్పించి పేస్‌ బౌలర్‌ తుషార్‌ దేశ్‌పాండేను ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ప్రకారం బరిలోకి దించింది.

దీంతో ..ఐపీఎల్ చరిత్రలో తొలి ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా తుషార్‌ రికార్డుల్లో చేరాడు. మరోవైపు గుజరాత్‌ టైటాన్స్‌ సైతం ఈ నిబంధనను వినియోగించుకొంది. ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో గాయపడ్డ న్యూజిలాండ్‌ స్టార్‌ కేన్‌ విలియమ్సన్‌ స్థానంలో.. సాయి సుదర్శన్‌ను ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గా తీసుకుంది.

రెండుజట్లు ..ఐదుగురు ఆటగాళ్లతో ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితాను సమర్పించాయి.

చేజింగ్ లో గుజరాత్ కు 9వ గెలుపు..

ఐపీఎల్ లో కేవలం తన రెండోసీజన్ మాత్రమే ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ ప్రస్తుత మ్యాచ్ తో సహా చేజింగ్ లో 9వ విజయం నమోదు చేసింది. మొత్తం 10 మ్యాచ్ ల్లో చేజింగ్ కు దిగి ఒక్క ఓటమి మాత్రమే చవిచూసింది. ఇందులో 8 విజయాలు ఆఖరి ఓవర్లో సాధించడం విశేషం.

ఇక..2008 సీజన్ ప్రారంభం రౌండ్లోనే రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ ..ప్రస్తుత 2023 సీజన్ ప్రారంభమ్యాచ్ లో సైతం గుజరాత్ టైటాన్స్ చేతిలో

కంగు తినడం మరో రికార్డు.

లీగ్ రెండోరోజు పోటీలలో భాగంగా ..ఈ రోజు జరిగే డబుల్ ధమాకా లో మొహాలీ వేదికగా జరిగే తొలిమ్యాచ్ లో శిఖర్ ధావన్ నాయకత్వంలోని

పంజాబ్‌ కింగ్స్త్ తో నితీష్ రాణా కెప్టెన్సీలోని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌.. రెండో పోరులో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఢీ కొంటాయి.


Tags:    
Advertisement

Similar News