ప్రత్యర్థుల నుంచి ప్రధానుల వరకు.. విరాట్ కోహ్లీ క్రేజ్ మామూలుగా లేదుగా!
దీపావళి సందర్భంగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను కలిసిన మన విదేశాంగ మంత్రి జైశంకర్ ఆయనకు రెండు గిఫ్ట్‌లు ఇచ్చారు. అందులో ఒకటి వినాయకుడి ప్రతిమ కాగా మరొకటి విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ చేసిన క్రికెట్ బ్యాట్.
విరాట్ కోహ్లి.. పరిచయం అక్కర్లేని పేరు. ఇండియన్ క్రికెట్ అభిమానులకే కాదు అతనాడే ప్రత్యర్థి జట్ల ప్లేయర్లు కూడా కోహ్లి ఫ్యాన్సే. అంతెందుకు బద్ధవిరోధిగా భావించే పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా అతనంటే చాలా అభిమానిస్తాడు. ఈ ప్రపంచకప్‌లో ఇండియాతో మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయినప్పటికీ పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కోహ్లి జెర్సీని అడిగి తీసుకున్నాడు. దీనిపై అక్రమ్ లాంటి పాక్ మాజీ ఆటగాళ్లు విమర్శించినా బాబర్ వెనక్కి తగ్గలేదు.
కన్నీళ్లు పెట్టుకున్న నెదర్లాండ్స్ ఆల్‌రౌండర్
నిన్న జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై నెగ్గిన తర్వాత కూడా ఆ జట్టు ఆటగాళ్లను మనవాళ్లు కౌగిలించుకుని శుభాకాంక్షలు తెలిపారు. వారు కూడా భావోద్వేగానికి గురయ్యారు. వెటరన్ ఆల్‌రౌండర్ వాండర్ మెర్వ్‌కి కోహ్లి తన జెర్సీ గిఫ్ట్‌గా ఇవ్వగానే అతను కోహ్లిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు.
బ్రిటన్ ప్రధానికి కోహ్లి బ్యాట్ గిఫ్ట్
ఇకపోతే దీపావళి సందర్భంగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను కలిసిన మన విదేశాంగ మంత్రి జైశంకర్ ఆయనకు రెండు గిఫ్ట్‌లు ఇచ్చారు. అందులో ఒకటి వినాయకుడి ప్రతిమ కాగా మరొకటి విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ చేసిన క్రికెట్ బ్యాట్. ఆ గిఫ్ట్ చేతికివ్వగానే సునాక్ దాన్ని అందుకుని పక్కన పెట్టేయకుండా చేతితో పట్టుకుని చాలాసేపు జైశంకర్‌తో ముచ్చటించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరలవుతున్నాయి. ఎంతైనా మన కోహ్లీ ప్రత్యర్థి ఆటగాళ్లకే కాదు ప్రైమ్ మినిస్టర్లకు కూడా ఇష్టమే అని విరాట్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.