దంచికొట్టిన భారత్, వరుసగా రెండో గెలుపు!

ఆస్ట్ర్రేలియాతో పాంచ్ పటాకా టీ-20 సిరీస్ లో ఆతిథ్య భారత్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో విజయంతో 2-0 ఆధిక్యం సంపాదించింది...

Advertisement
Update:2023-11-27 08:45 IST

ఆస్ట్ర్రేలియాతో పాంచ్ పటాకా టీ-20 సిరీస్ లో ఆతిథ్య భారత్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో విజయంతో 2-0 ఆధిక్యం సంపాదించింది....

2024- టీ-20 ప్రపంచకప్ కు సన్నాహకంగా ఆస్ట్ర్లేలియాతో జరుగుతున్న ఐదుమ్యాచ్ ల సిరీస్ లో సూర్యకుమార్ నాయకత్వంలోని భారత్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తిరువనంతపురం వేదికగా ముగిసిన పోరులో 44 పరుగుల గెలుపుతో పైచేయి సాధించింది.

బాదుడే బాదుడు.....

స్లోబౌలర్ల అడ్డా తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ రెండో మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన టాప్ ర్యాంకర్ భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 235 పరుగుల భారీస్కోరు సాధించింది.

ఓపెనర్ యశస్వి జైశ్వాల్ నుంచి 5వ నంబర్ బ్యాటర్ రింకూ సింగ్ వరకూ బాదుడే బాదుడు బ్యాటింగ్ తో దంచి కొట్టారు. ఓపెనింగ్ జోడీ యశస్వి- రుతురాజ్ మొదటి వికెట్ కు 5.5 ఓవర్లలోనే 77 పరుగుల భాగస్వామ్యంతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. యశస్వి 25 బంతుల్లో 53, రుతురాజ్ 43 బంతుల్లో 58, వన్ డౌన్ ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 52 పరుగుల హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.

బ్యాటింగ్ ఆర్డర్లోని మొదటి ముగ్గురు బ్యాటర్లు అర్థశతకాలతో కదం తొక్కారు.

యశస్వి జైశ్వాల్ 'పవర్ ప్లే' హిట్టింగ్ రికార్డు...

వైస్ కెప్టెన్ రుతురాజ్ తో కలసి భారత ఇన్నింగ్స్ ప్రారంభించిన యంగ్ గన్ యశస్వి తొలి ఓవర్ తొలిబంతి నుంచే కంగారూ బౌలర్లపై ఎదురుదాడి మొదలు పెట్టాడు.

బౌలర్ ఎవరన్నది చూడకుండా బౌండ్రీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు.

కేవలం 23బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. పవర్ ప్లే ఓవర్లలో రుతురాజ్ తో కలసి 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఫాస్ట్ బౌలర్లు సీన్ అబ్బోట్ ఓవర్లో 24 పరుగులు దండుకొన్నాడు. వరుసగా 4, 4, 4, 6, 6 మూడు బౌండ్రీలు, రెండు సిక్సర్ షాట్లతో స్కోరుబోర్డును పరుగులెత్తించాడు.

యశస్వి 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగుల స్కోరు సాధించాడు. టీ-20 పవర్ ప్లే ఓవర్లలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన భారత మూడో క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.

గతంలో ఇదే రికార్డు నెలకొల్పిన భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ ఉన్నారు.

2020 సిరీస్ లో న్యూజిలాండ్ పై సెడ్డో వేదికగా జరిగిన పోరులో రోహిత్ పవర్ ప్లే ఓవర్లలోనే అర్థశతకం బాదిన భారత తొలి బ్యాటర్ ఘనతను సొంతం చేసుకొంటే.. 2021 టీ-20 ప్రపంచకప్ లో భాగంగా దుబాయ్ వేదికగా స్కాట్లాండ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో రాహుల్ సైతం పవర్ ప్లే ఓవర్ల హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

ఇన్నింగ్స్ మొదటి 10 ఓవర్లలోనే 101 పరుగులు చేసిన భారత్..రెండో 10 ఓవర్లలో మరింతగా చెలరేగిపోయింది.

రింకూసింగ్ ధనాధన్....

యశస్వి 53, ఇషాన్ కిషన్ 52, కెప్టెన్ సూర్యకుమార్ 19 పరుగుల స్కోర్లకు, రుతురాజ్ 58 పరుగులకు అవుట్ కావడంతో.. క్రీజులోకి దిగిన 5వ నంబర్ బ్యాటర్ రింకూ సింగ్ కేవలం 9 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు, తిలక్ వర్మ 2 బంతుల్లో ఓ సిక్సర్ తో 7 పరుగుల నాటౌట్ స్కోర్లు సాధించడంతో భారత్ 4 వికెట్లకు 235 పరుగుల భారీస్కోరు నమోదు చేయగలిగింది.

ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా టీ-20 ఫార్మాట్లో భారత్ కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. అంతేకాదు..టీ-20లో 200కు పైగా స్కోరు సాధించడం భారత్ కు ఇది 4వసారి.

కంగారూ బౌలర్లలో నేథన్ ఎలిస్ 3, స్టోయినిస్ 1 వికెట్ పడగొట్టారు.

కంగారూలకు భారత స్పిన్ ట్రాప్....

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 236 పరుగుల భారీస్కోరు చేయాల్సిన ఆస్ట్ర్రేలియాకు..ఓపెనింగ్ జోడీ షార్ట్ - స్టీవ్ స్మిత్ మొదటి 2 ఓవర్లలోనే 31 పరుగులతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చినా..లెగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్ స్పిన్ మ్యాజిక్ లో గల్లంతయ్యింది.

షార్ట్, స్మిత్ చెరో 19 పరుగుల స్కోర్లకు, తొలి టీ-20 సెంచరీ హీరో ఇంగ్లిస్ 2, సూపర్ హిట్టర్ మాక్స్ వెల్ 12 పరుగుల స్కోర్లకు అవుట్ కావడంతో ఆస్ట్ర్రేలియా 7.2 ఓవర్లలోనే 53 పరుగులకే 4 వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది.

మిడిలార్డర్ బ్యాటర్లు స్టోయినిస్ 25 బంతుల్లో 45, టిమ్ డేవిడ్ 22 బంతుల్లో 37, కెప్టెన్ వేడ్ 23 బంతుల్లో 43 పరుగుల నాటౌట్ స్కోరు సాధించినా ప్రయోజనం లేకపోయింది. చివరకు కంగారూజట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆఖరి 5 వికెట్లను ఆస్ట్ర్రేలియా కేవలం 16 పరుగుల వ్యవధిలో కోల్పోయి మరి కోలుకోలేకపోయింది.

భారత బౌలర్లలో స్పిన్నర్ రవి బిష్నోయ్ 32 పరుగులిచ్చి 3 వికెట్లు, పేసర్ ప్రసిద్ధ 41 పరుగులిచ్చి 3 వికెట్లు, అర్షదీప్, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు.

భారత విజయంలో ప్రధానపాత్రవహించిన ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 2020 తర్వాత నుంచి ఆస్ట్ర్రేలియాతో ఆడిన 8 టీ-20 మ్యాచ్ ల్లో భారత్ కు ఇది 6వ గెలుపు కావడం విశేషం.

సిరీస్ లోని కీలక మూడోమ్యాచ్ గౌహతిలోని బార్సాపారా స్టేడియం వేదికగా ఈనెల 29న జరుగనుంది.

Tags:    
Advertisement

Similar News