కేకేఆర్ మెంటార్‌గా బ్రావో
అన్నిరకాల క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన డ్వేన్ బ్రావో... కొన్ని గంటల్లోనే విండీస్ స్టార్ ను వెతుక్కుంటూ వచ్చిన మెంటార్ పదవి
డ్వేన్ బ్రావో క్రికెట్‌కు వీడ్కోలు పలికి గంటలు కాకముందే మెంటార్ పదవి అతడిని వెతుక్కుంటూ వచ్చింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతూ గాయపడిన విండీస్ దిగ్గజం క్రికెట్‌కు గుడ్ చెప్పిన సంగతి తెలిసిందే. కొద్ది సమయంలోనే కోల్‌కతా నైట్‌రైడర్స్ 2024 సీజన్‌కు మెంటార్‌గా నియమిస్తున్నట్లు ఆ ఫ్రాంచైజీ ప్రకటించింది. గత సీజన్‌లో గౌతమ్ గంభీర్ మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తించి ఛాంపియన్‌గా నిలిపాడు. అతడు భారత్ జట్టు ప్రధాన కోచ్‌గా రావడంతో ఖాళీ ఏర్పడింది. ఆ లోటును డ్వేన్ బ్రావోతో పూడ్చుతున్నట్లు కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ వెల్లడించారు. మరోవైపు తన నియామకంపై బ్రావో స్పందించాడు.
కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: డ్వేన్ బ్రావో
ట్రినిడాడ్ నైట్ రైడర్స్‌కు సుమారు ఐదేళ్ల పాటు ఆడాను. కేకేఆర్‌పై ఎన్నో మ్యాచ్‌ల్లో పోరాడాను. ఆ ఫ్రాంచైజీపై నాకు ఎంతో గౌరవం ఉన్నది. ఆటపై మేనేజ్‌మెంట్‌కు ఉన్న అభిరుచి అద్భుతం. కుటుంబం లాంటి వాతావరణం ఉండటం కలిసొచ్చే అంశం. క్రికెటర్ పాత్ర నుంచి మెంటార్‌గా మారడానికి కేకేఆర్ చక్కని వేదికగా అనుకుంటున్నాను. ఫ్రాంచైజీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని డ్వేన్ బ్రావో వెల్లడించారు.
అన్నిరకాల క్రికెట్ కు గుడ్‌బై చెప్పిన బ్రావో
అంతర్జాతీయ క్రికెట్‌కు ఇప్పటికే వీడ్కోలు పలికిన విండీస్ స్టార్ డ్వేన్ బ్రావో మరో కీలక ప్రకటన చేశారు. అన్నిరకాల క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు.