భారత కోటలో కంగారూల పాగా!
స్వదేశంలో తిరుగులేని భారతజట్టును కంగుతినిపించాలన్న లక్ష్యంతో ఆస్ట్ర్రేలియా టెస్టుజట్టు భారత్ లో పాగావేసింది. యాండీ కమిన్స్ నాయకత్వంలోని 18మంది సభ్యులు కంగారూజట్టు భారత్ చేరుకొని సాధన మొదలు పెట్టింది.
స్వదేశంలో తిరుగులేని భారతజట్టును కంగుతినిపించాలన్న లక్ష్యంతో ఆస్ట్ర్రేలియా టెస్టుజట్టు భారత్ లో పాగావేసింది. యాండీ కమిన్స్ నాయకత్వంలోని 18మంది సభ్యులు కంగారూజట్టు భారత్ చేరుకొని సాధన మొదలు పెట్టింది.
భారత్ ను భారతగడ్డపై ఓడించడం ఏ విదేశీజట్టుకైనా ఓ బంగారు కల. స్వదేశంలో ఆడిన గత 25 సిరీస్ ల్లో ఓటమి అంటే ఏమిటో తెలియని భారతజట్టును కంగు తినిపించాలన్న లక్ష్యంతో ఫాస్ట్ బౌలర్ యాండీ కమిన్స్ నాయకత్వంలోని ఆస్ట్ర్రేలియాజట్టు 2023 సిరీస్ కోసం భారత్ లో అడుగుపెట్టింది.
ఆస్ట్ర్రేలియాజట్టు తన పర్యటన కాలంలో నాలుగుమ్యాచ్ ల ఐసీసీ టెస్ట్ లీగ్ సిరీస్ తో పాటు..ప్రపంచకప్ కు సన్నాహకంగా మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ ల్లో సైతం భారత్ తో తలపడనుంది.
నలుగురు స్పిన్నర్ల జట్టుతో దాడికి రెడీ..
ముల్లును ముల్లుతోనే తీయాలన్న వ్యూహాంలో భాగంగా స్పిన్నర్ల అడ్డా భారత పిచ్ లపై రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్ ను దెబ్బతీయటానికి ఆస్ట్ర్రేలియా నలుగురు స్పిన్ బౌలర్ల దళంతో బరిలోకి దిగనుంది.
ఫిబ్రవరి 9 నుంచి మార్చి 13 వరకూ జరుగనున్న నాలుగు టెస్టుల సిరీస్ కు నాగపూర్, ఢిల్లీ, ధర్మశాల, అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనున్నాయి. ఫాస్ట్ బౌలర్ల బలానికి మరో పేరైన ఆస్ట్ర్రేలియా తొలిసారిగా జట్టులో నలుగురు ( ఆష్టన్ అగర్, నేథన్ లయన్, లాన్స్ మోరిస్, మిషెల్ స్వెప్ సన్ ) స్పిన్నర్లకు తుదిజట్టులో చోటు కల్పించింది.
తొలిటెస్టుకు స్టార్క్ దూరం..
ఆస్ట్ర్రేలియా తురుపుముక్క, మెరుపు ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోడంతో సిరీస్ లోని తొలిటెస్టుకు దూరం కానున్నాడు.
న్యూఢిల్లీ వేదికగా జరిగే రెండోటెస్టుకు స్టార్క్ అందుబాటులో ఉంటాడని టీమ్ మేనేజ్ మెంట్ ప్రకటించింది.
పేస్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ సైతం ఫిట్ నెస్ సమస్యలతో అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది.
హ్యాండ్స్ కోంబ్ కు జట్టులో చోటు..
మొత్తం 18 మంది సభ్యుల ఆస్ట్ర్రేలియాజట్టులో వెటరన్ బ్యాటర్ పీటర్ హ్యాండ్స్ కోంబ్, యువఫాస్ట్ బౌలర్ ల్యాన్స్ మోరిస్, స్పిన్నర్ టోడ్ మర్ఫీలకు చోటు కల్పించారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన స్వదేశీ సిరీస్ లో అలవోక విజయం సాధించిన తమజట్టుకు భారత పర్యటన ఓ సవాలని, భారత్ లోని వాతావరణం, పిచ్ లకు అనుగుణంగా ఉండే ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు క్రికెట్ ఆస్ట్ర్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జి బెయిలీ ప్రకటించారు.
18 మంది సభ్యుల భారీజట్టులో ఆరుగురు ఫాస్ట్ బౌలర్లు, నలుగురు స్పిన్ బౌలర్లున్నారు. సీనియర్ లెగ్ స్పిన్నర్ ఆడం జంపాను పక్కన పెట్టి 22 సంవత్సరాల యువ లెగ్ స్పిన్నర్ టాడ్ మర్ఫీకి చోటు కల్పించారు.
2019 తర్వాత తిరిగి జట్టులో చోటు సంపాదించిన స్పెషలిస్ట్ బ్యాటర్ పీటర్ హ్యాండ్స్ కోంబ్ కు 16 టెస్టులు ఆడిన అనుభవంతో పాటు..స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొనగల సామర్థ్యం సైతం ఉంది.
పాట్ కమిన్స్ నాయకత్వంలోని కంగారూ జట్టు సభ్యుల్లో ఆస్టన్ అగర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరూన్ గ్రీన్, పీటర్ హ్యాండ్స్ కోంబ్, జోష్ హేజిల్ వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ క్వాజా, మార్నుస్ లబుషేన్, నేథన్ లయన్, లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫీ, మాథ్యూ రెన్ షా, స్టీవ్ స్మిత్, మిషెల్ స్టార్క్, మిషెల్ స్వేప్ సన్, డేవిడ్ వార్నర్.
తొలిటెస్టు వేదిక నాగపూర్..
నాలుగుమ్యాచ్ ల టెస్ట్ లీగ్ సిరీస్ లో భాగంగా ఫిబ్రవరి 9 నుంచి ఐదురోజులపాటు జరిగే తొలిటెస్టుకు నాగపూర్ విదర్భ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.
సిరీస్ లోని రెండోటెస్టుమ్యాచ్ న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 17 నుంచి 21 వరకూ జరుగుతుంది. మార్చి 1 నుంచి 5 వరకూ జరిగే మూడోటెస్టుకు ధర్మశాల ఆతిథ్యమివ్వనుంది.
సిరీస్ లోని ఆఖరిటెస్టు మార్చి 9 నుంచి 13 వరకూ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగనుంది.
మార్చి 17 నుంచి వన్డే సిరీస్ ...
ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా జరిగే తీన్మార్ వన్డే సిరీస్ లో ఆస్ట్ర్రేలియాతో భారత్ తలపడనుంది. మార్చి 17న ముంబై వాంఖడే స్టేడియం వేదికగా తొలివన్డేని, మార్చి 19న విశాఖలోని డాక్టర్ రాజశేఖర రెడ్డి స్టేడియం వేదికగా రెండో వన్డే, మార్చి 22న చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా ఆఖరి వన్డే నిర్వహిస్తారు.