11 బంతుల్లో 50 పరుగులు, యువరాజ్ రికార్డు తెరమరుగు!

భారత టీ-20 క్రికెట్లో సరికొత్త రికార్డు నమోదయ్యింది. యువరాజ్ సింగ్ పేరుతో ఉన్న మెరుపు హాఫ్ సెంచరీ రికార్డు తెరమరుగయ్యింది...

Advertisement
Update:2023-10-18 08:48 IST

భారత టీ-20 క్రికెట్లో సరికొత్త రికార్డు నమోదయ్యింది. యువరాజ్ సింగ్ పేరుతో ఉన్న మెరుపు హాఫ్ సెంచరీ రికార్డు తెరమరుగయ్యింది...

భారత టీ-20 క్రికెట్ చరిత్రలో గత 16 సంవత్సరాలుగా సిక్సర్లకింగ్ యువరాజ్ సింగ్ పేరుతో ఉంటూ వచ్చిన' ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ' రికార్డు తెరమరుగయ్యింది.

ఇండియన్ రైల్వేస్ ప్లేయర్ అశుతోష్ శర్మ కేవలం 11 బంతుల్లోనే సునామీ అర్థశతకం సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నమోదు చేశాడు.

2007లో యువరాజ్, 2023లో అశుతోష్...

దేశవాళీ టీ-20 ( సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ) క్రికెట్ టోర్నీ గ్రూప్ - సీ లీగ్ పోటీలలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో రైల్వేస్ జట్టులోని మిడిలార్డర్ బ్యాటర్ అశుతోష్ శర్మ శివమెత్తిపోయాడు. పూనకం వచ్చినవాడిలా ఆడి కేవలం 11 బంతుల్లోనే 50 పరుగులు సాధించాడు. 2007 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో ఇంగ్లండ్ పై యువరాజ్ 12 బంతుల్లో సాధించిన అర్థశతకమే ఇప్పటి వరకూ ఓ భారత బ్యాటర్ సాధించిన ఫాస్టెస్ట్ టీ-20 హాఫ్ సెంచరీ రికార్డుగా ఉంది.

రాంచీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన ఈ పోరులో రైల్వేస్ జట్టు 4 వికెట్లకు 131 పరుగులు చేసిన సమయంలో క్రీజులోకి వచ్చిన అశుతోష్ 8 సిక్సర్లు, ఓ ఫోర్ తో 11 బంతుల్లో 50, 12 బంతుల్లో 53 పరుగులు సాధించాడు. 441.66 స్ట్ర్రయిక్ రేట్ తో సరికొత్త రికార్డు నమోదు చేశాడు. అశుతోష్ కొట్టిన సిక్సర్లు లాంగ్ ఆన్, లాంగ్ ఆఫ్ ల మీదుగా బౌండ్రీలైన్ వెలుపలకు వెళ్లి పడ్డాయి.

అశుతోష్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీతో రైల్వేస్ ఆఖరి 5 ఓవర్లలో 115 పరుగులు దండుకోగలిగింది. చివరకు 5 వికెట్లకు 246 పరుగులు చేయగలిగింది. సమాధానంగా అరుణాచల్ ప్రదేశ్ 119 పరుగులకే కుప్పకూలి 127 పరుగుల ఓటమి చవిచూసింది.

టీ-20 క్రికెట్ చరిత్రలోనే అతితక్కువ (9) బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన ప్రపంచ రికార్డు నెపాల్ మిడిలార్డర్ బ్యాటర్ దీపిందర్ అయిరీ పేరుతో ఉంది. ఆసియాక్రీడల టీ-20 టోర్నీలో భాగంగా మంగోలియాతో జరిగిన పోరులో దీపందర్ ప్రపంచ రికార్డు హాఫ్ సెంచరీ సాధించాడు.

Tags:    
Advertisement

Similar News