వాట్సప్‌లో రానున్న ట్రాన్స్‌లేషన్ ఆప్షన్
త్వరలో మరో కొత్త ఫీచర్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్‌లో మరో అద్భుతమైన ఫీచర్ రాబోతున్నది. ఇతర భాషల్లో వచ్చే మెసేజ్‌లను చాట్ బాక్సుల్లోనే మీకు నచ్చిన భాషలో అనువాదం చేసుకునే సౌకర్యం రానున్నది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.24.26.9లో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు వాట్సప్‌నకు సంబంధించిన అప్‌డేట్స్ అందించే వాబీటా ఇన్ఫో వెల్లడించింది. చాట్స్‌తో పాటు, వాట్సప్ ఛానల్‌లోనూ ఈ సదుపాయం రాబోతున్నది.
వేర్వేరు వాట్సప్ గ్రూపుల్లో ఉండేటప్పుడు వివిధ భాషల్లో కొందరు చాట్ చేస్తుంటారు. కొన్నిసార్లు వేరే భాషల్లో ఉండే సుదీర్ఘ పోస్టులు వచ్చి పడుతుంటాయ. ఆ భాష రానివారు దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. టెక్ట్స్‌ను కాపీ చేసి వేరే ట్రాన్స్‌లేషన్ టూల్‌లో వేస్తుంటారు. ఆ విషయం అర్థం అయ్యాక రిప్లై ఇస్తుంటారు. ఇన్ని ఇబ్బందులు పడకుండా ఈజీగా చాట్‌ను ట్రాన్స్‌లేట్ చేసుకునే సదుపాయం వాట్సప్‌లో రానున్నది.
అయితే ఈ ఫీచర్ పూర్తిగా యూజర్ డివైజ్‌లోనే జరుగుతుందని వాబీటా ఇన్ఫో తెలిపింది. అన్ని చాట్స్‌లానే వీటికి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుందని పేర్కొన్నది. సాధారణ ట్రాన్స్‌లేషన్ టూల్స్‌లా క్లౌడ్ సర్వర్‌ఖు సమాచారం పంపకుండా.. ఫ్రీ డౌన్ లోడెడ్ లాంగ్వేజీ పాక్స్ ఆధారంగా ఈ ఫీచర్ పనిచేస్తుంది. కాబట్టి థర్డ్ పార్టీ సర్వర్లకు గాని, వాట్సప్ సర్వర్లకు గాని డేటా షేర్ చేయాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు, ఈ లాంగ్వేజ్ ప్యాక్‌ను ఆఫ్‌లైన్‌లోనూ ఉపయోగించుకునే వీలు ఉంటుందని వాబీటా ఇన్ఫో పేర్కొన్నది. అయితే వచ్చిన ప్రతి మెసేజ్‌ను ట్రాన్స్‌లేట్ చేయాలా? లేక ఎంపిక చేసుకున్నవి మాత్రమే ట్రాన్స్‌లేట్ చేయాలా? అనే ఆప్షన్ యూజర్ చేతుల్లోనే ఉంటుంది. ఇది ఎప్పుడు అందుబాటులోకి తెచ్చేది మాత్రం ఇంకా స్పష్టత లేదు.