ట్విట్టర్‌లో కొత్త బ్యాడ్జీలు!
Twitter Badges: బ్యాడ్జీలు, వెరిఫైడ్ అకౌంట్స్ లేబుల్స్‌కు సంబంధించి ట్విట్టర్ రీసెంట్‌గా కొన్ని వివరాలు వెల్లడించింది.
బ్యాడ్జీలు, వెరిఫైడ్ అకౌంట్స్ లేబుల్స్‌కు సంబంధించి ట్విట్టర్ రీసెంట్‌గా కొన్ని వివరాలు వెల్లడించింది. బిజినెస్, ప్రభుత్వ అకౌంట్లను సులువుగా గుర్తించేందుకు వేర్వేరు బ్యాడ్జ్‌లు, లేబుల్స్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇవి ఎలా ఉంటాయంటే..
ట్విట్టర్‌లో బ్యా్డ్జీలపై గత కొంతకాలంగా చర్చ నడుస్తోంది. అయితే ఇప్పుడు వాటి విషయంలో కొంత క్లారిటీ ఇచ్చింది ట్విట్టర్. ముందుగా ప్రభుత్వ అకౌంట్స్‌ను ఈజీగా గుర్తించేందుకు వాటికి గ్రే కలర్ బ్యాడ్జ్ ఇస్తామని ప్రకటించింది. అలాగే బిజినెస్ అకౌంట్స్‌కు గుండ్రటి ఆకారంలో కాకుండా చతురస్రాకారంలో ఉండే గోల్డ్ కలర్ బ్యాడ్జీ ఇస్తామని తెలిపింది. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ పొందిన అకౌంట్స్‌ను వెరిఫై చేసి బ్లూ బ్యాడ్జ్ ఇవ్వనున్నట్లు పేర్కొంది.
ఇక వీటితో పాటు ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ పొందిన సంస్థలు తమ ఖాతాలకు సంబంధించిన ఉద్యోగుల, అనుబంధ సంస్థల అకౌంట్స్‌ను మెయిన్ అకౌంట్‌కు లింక్ చేసుకోవచ్చు. ఇలా లింక్ చేసిన అకౌంట్ల పేరు కింది భాగంలో మెయిన్ అకౌంట్‌కు సంబంధించిన వివరాల లేబుల్ కనిపిస్తుంది. యూజర్లు ఈ లేబుల్‌పై క్లిక్ చేస్తే మెయిన్ అకౌంట్ ట్విట్టర్ పేజీకి రీడైరెక్ట్ అవుతుంది.
ఇదిలా ఉండగా ఎలన్ మస్క్.. ట్విట్టర్ సీఈవోగా ఉండాలా? వద్దా? అనే దానిపై నిర్వహించిన పోల్‌లో 57.5 శాతం మంది యూజర్లు మస్క్ వైదొలగాలని.. 42.5 శాతం మంది మస్క్ కొనసాగాలని ఓటు వేశారు. దీనికి మస్క్ స్పందిస్తూ.. ''ఈ బాధ్యతల్ని తీసుకునే తెలివితక్కువ వ్యక్తి దొరగ్గానే నేను సీఈఓగా రాజీనామా చేస్తాను. తర్వాత నేను సాఫ్ట్‌వేర్, సర్వర్‌ల బృందాలను చూసుకుంటాను'' అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం మస్క్ కొత్త సీఈఓ అన్వేషణ మొదలుపెట్టాడట.