ఇండియా తొలి ప్రైవేట్ రాకెట్.. 18న నింగిలోకి..

'విక్రమ్-ఎస్' కోసం డెవలప్ చేసిన రాకెట్ ప్రొపల్యూషన్ సిస్టమ్‌కు కలామ్-80 అనే పేరు పెట్టారు. ఈ ఏడాది మార్చి 15న దాన్ని విజయవంతంగా పరీక్షించారు.

Advertisement
Update:2022-11-16 08:49 IST

భారత అంతరిక్ష చరిత్రలో సరి కొత్త అధ్యాయం ప్రారంభం కానున్నది. ఇండియా నుంచి తొలి సారిగా ఓ ప్రైవేట్ రాకెట్ నింగిలోకి ఈ నెల 18న దూసుకొని పోనున్నది. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ స్కైరూట్ ఏరో స్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన 'విక్రమ్-ఎస్' ప్రైవేట్ రాకెట్‌ను ఈ నెల 18 ఉదయం 11.30 గంటలకు శ్రీహరికోట రాకెట్ లాంఛ్ స్టేషన్ నుంచి ప్రయోగించనున్నది. తొలుత బుధవారమే (నవంబర్ 15) రాకెట్‌ను నింగిలోకి పంపాలని భావించారు. కానీ వాతావరణం అనుకూలించక పోవడంతో ప్రయోగాన్ని 18కి వాయిదా వేసినట్లు స్కైరూట్ ప్రతినిధులు తెలిపారు.

ఈ 'విక్రమ్-ఎస్' కోసం డెవలప్ చేసిన రాకెట్ ప్రొపల్యూషన్ సిస్టమ్‌కు కలామ్-80 అనే పేరు పెట్టారు. ఈ ఏడాది మార్చి 15న దాన్ని విజయవంతంగా పరీక్షించారు. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరో స్పేస్ 'విక్రమ్-ఎస్' రాకెట్‌ ప్రయోగాన్ని ఒక సబ్-ఆర్బిటల్ మిషన్‌గా చేపట్టనున్నది. ఈ మిషన్‌కు 'ప్రారంభ్' అని పేరు పెట్టింది. ఈ ప్రయోగంలో మూడు పేలోడ్స్ అంతరిక్షంలోకి తీసుకొని వెళ్లనున్నారు.

ఇస్రోతో ఒప్పందం చేసుకున్న తొలి స్టార్టప్ కంపెనీ స్కై రూట్. ఇది ఇండియాలోని తొలి ప్రైవేట్ రాకెట్‌ను ప్రయోగించడం కోసం సొంతగా క్రయోజనిక్, హైపర్ లాజిక్ లిక్విడ్, సాలిడ్ ఫ్యూయల్ బేస్డ్ ఇంజన్లను అభివృద్ధి చేసింది. ఇందు కోసం త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించడం గమనార్హం.ఇక 'విక్రమ్-ఎస్' మూడు చిన్న శాటిలైట్లను తీసుకెళ్తుంది. చెన్నైకి చెందిన స్టార్టప్ కంపెనీ స్పేస్ కిడ్జ్‌ రూపొందించిన 2.5 కిలోలు ఉన్న ఫన్‌శాట్‌తో పాటు మరో రెండు శాటిలైట్లు నింగిలోకి వెళ్లనున్నాయి. ఫన్‌శాట్ శాటిలైట్‌ను ఇండియా, యూఎస్ఏ, సింగపూర్, ఇండోనేషియాకు చెందిన విద్యార్థులు రూపొందించడం గమనార్హం.

ఈ ప్రయోగం కనుక విజయవంతం అయితే.. ఇండియాలో తొలి ప్రైవేట్ రాకెట్ రూపొందించిన సంస్థగా హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ చరిత్ర సృష్టించనున్నది. భారత ప్రైవేట్ రాకెట్ రంగంలో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుందని ఇస్రో భావిస్తోంది. ఎన్నో ఏళ్లుగా ప్రైవేట్ రాకెట్ల ప్రయోగాలను ప్రోత్సహించాలని ఇస్రో ప్రణాళిక రూపొందించింది. అయితే 2020లో తొలి సారి స్కై రూట్‌తో ఒప్పందం కుదిరింది.ఇది విజయవంతం అయితే అంతరిక్ష ప్రయోగాలు తక్కువ ఖర్చుతో రూపొందించడానికి ప్రైవేట్ కంపెనీలు ముందుకు వస్తాయని ఇస్రో భావిస్తోంది.

Tags:    
Advertisement

Similar News