Income Tax Alert | మోసపూరిత మెసేజ్‌లపట్ల అలర్ట్‌గా ఉండండి.. వేతన జీవులకు ఐటీ విభాగం హెచ్చరిక..!
Income Tax Alert | మోసపూరిత మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని వేతన జీవులకు ఆదాయం పన్ను విభాగం హెచ్చరికలు జారీ చేసింది
Income Tax Alert | మోసపూరిత మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని వేతన జీవులకు ఆదాయం పన్ను విభాగం హెచ్చరికలు జారీ చేసింది. వేతన జీవులకు ఎటువంటి మెసేజ్‌లు, యూఆర్ఎల్స్ పంపించలేదని ఆదాయం పన్ను విభాగం క్లారిఫికేషన్ ఇచ్చింది. వేతన జీవుల్ని మోసగించి సున్నితమైన సమాచారాన్ని తస్కరించేందుకు సైబర్ మోసగాళ్లు పంపే మెసేజ్‌లు పెరిగిపోతుండటంతో ఐటీ విభాగం వివరణ ఇచ్చింది. ఐటీ రీఫండ్ ప్రక్రియ పేరిట.. రిటర్న్స్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటూ లింక్‌లు పంపుతారు సైబర్ మోసగాళ్లు. టాక్స్ రీఫండ్ అప్రూవ్ అయింది, డబ్బులు రీఫండ్ చేయడానికి బ్యాంకు ఖాతా వివరాలు తెలుపాలని లింక్‌లు పంపుతారు. ఇటువంటి లింక్‌లు పంపిన మోసగాళ్ల చేతిలో చిక్కి బాధితులు కావద్దని వేతన జీవులకు ఐటీ విభాగం హెచ్చరించింది.
వేతన జీవుల వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని సేకరించే లక్ష్యంతో సైబర్ మోసగాళ్లు మెసేజ్‌లు పంపుతారని ఐటీ విభాగం తెలిపింది. వీటిని అందుకున్న వేతన జీవులు ఆర్థిక నష్టాల పాలవుతారని పేర్కొంది. సైబర్ మోసగాళ్లు పంపే అథంటికేషన్ లేని మెసేజ్‌ల పట్ల ముందు జాగ్రత్తగా ఉండాలని ట్వీట్ చేసింది.
ఆదాయం పన్ను విభాగం నుంచి వచ్చే సమాచారం కోసం అధికారిక చానెల్స్, ప్లాట్‌ఫామ్స్‌ను మాత్రమే విశ్వసించాలని సూచించింది.
ఆయాచిత సందేశాలతో కూడిన యూఆర్ఎల్స్‌ను తప్పించుకోవాలని సూచించింది. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నా కొద్దీ.. సైబర్ నేరాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్ పద్దతులను పాటించాలని వేతన జీవులకు హితవు చెప్పింది. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకుండా దూరంగా ఉండాలని, సైబర్ మోసగాళ్లు పంపే సందేశాల చట్టబద్ధతను ధృవీకరించుకోవాలని సూచించింది.
`పన్ను చెల్లింపుదారులకు ప్రలోభ పెట్టేందుకు బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్‌డేట్ చేయాలని మోసపూరిత లింక్స్ పంపుతున్నారు. అటువంటి మెసేజ్‌ల చట్టబద్ధతను ధృవీకరించుకుని అప్రమత్తంగా ఉండాలి. సైబర్ మోసగాళ్లు పంపే మెసేజ్‌లకు కొన్ని ఉదాహరణలను షేర్ చేసింది ఆదాయం పన్ను విభాగం. `డియర్ ఆదాయం పన్ను చెల్లింపుదారు.. మీ ఇన్‌కం టాక్స్ రీఫండ్ 35,425 ప్రక్రియ పూర్తయింది. డబ్బుల పంపిణీకి సిద్ధంగా ఉన్నాం. దయచేసి http://204.44.124.160/ITR ఈ యూఆర్ ఎల్ క్లిక్ చేసి సమాచారం అప్‌డేట్ చేయండి.. సాధ్యమైనంత త్వరగా పేమెంట్స్ జరుగుతుంది. ధన్యవాదాలతో రీఫండ్స్ డిపార్ట్‌మెంట్`అని ఉంటుంది` అని ఐటీ శాఖ తెలిపింది.