ట్విట్టర్ యూజర్లకు మళ్లీ షాకిచ్చిన మస్క్..
సెల్ ఫోన్లు వచ్చిన కొత్తల్లో ఇన్ కమింగ్ కాల్స్ కి కూడా డబ్బులు ఖర్చయ్యేవి. ఇప్పుడు ట్విట్టర్లో కూడా అలాంటి నిబంధనలు తీసుకొచ్చారు మస్క్.
మస్క్ చేతిలో పడ్డాక ట్విట్టర్ వ్యవహారం పూర్తిగా కమర్షియల్ గా మారిపోతోంది. వెరిఫైడ్ యూజర్లు అంటూ బ్లూ టిక్కులకు డబ్బులు వసూలు చేసిన మస్క్.. ఇప్పుడు ట్వీట్లకు కూడా పరిమితి విధించారు. మనకి ఇష్టం వచ్చినప్పుడు, ఇష్టం వచ్చినన్ని ట్వీట్లు చూడటానికి ఇకపై కుదరదు. ట్వీట్లు చూసే విషయంలో కూడా కోత పెట్టారు మస్క్.
సెల్ ఫోన్లు వచ్చిన కొత్తల్లో ఇన్ కమింగ్ కాల్స్ కి కూడా డబ్బులు ఖర్చయ్యేవి. ఇప్పుడు ట్విట్టర్లో కూడా అలాంటి నిబంధనలు తీసుకొచ్చారు మస్క్. రోజుకి 600 పోస్ట్ లు మాత్రమే చూసేలా కొత్త నిబంధనలు అమలులోకి వస్తున్నాయని ప్రకటించారు. బ్లూ టిక్ ఉన్న వెరిఫైడ్ యూజర్లు మాత్రం రోజుకి 6వేల పోస్ట్ లు చూడగలరు. ఇక కొత్తగా ట్విట్టర్లోకి వచ్చిన అన్ వెరిఫైడ్ యూజర్లు రోజుకి కేవలం 300 పోస్ట్ లు మాత్రమే చూడగలరు. త్వరలో ఈ సంఖ్యను పెంచుతామని చెబుతున్న మస్క్, త్వరలో ట్వీట్లు వేయడానికి కూడా డబ్బులు డిమాండ్ చేస్తే చేసేదేం లేదని నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.
గతంలో ట్విట్టర్ అకౌంట్ లేకపోయినా ఆన్ లైన్ లో ట్వీట్లు చూడగలిగే వెసులుబాటు ఉంది. కానీ ఇప్పుడు అది కూడా లేదు. ఇక ట్వీట్ల విషయంలో కూడా రేషన్ విధించడంతో యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. అప్పుడే దీనిపై జోకులు పేలుతున్నాయి. ట్విట్టర్ కి అందరూ అలవాటు పడ్డారని, దాన్ని మాన్పించడానికే ఈ వ్యూస్ లిమిట్ పెట్టామని మస్క్ పేరడీ అకౌంట్ లో పోస్టింగ్ పెట్టారు. మొత్తమ్మీద మస్క్ నిర్ణయాలు ఊహకు అందనివిగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో మస్క్ మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.