దామిని యాప్‌.. పిడుగులను పసిగట్టేస్తది

అరగంట ముందే అలర్ట్ చేస్తుంది

Advertisement
Update:2024-09-25 18:22 IST

ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే సమయంలో పిడుగు పడటం అత్యంత సహజం. ఎక్కడ పిడుగు పడుతుందో ముందే తెలియకపోవడంతో మన దేశంలో అత్యధిక మరణాలు పిడుగుపాట్ల కారణంగా సంభవిస్తున్నాయి. దేశంలో ఏటా 2,500 మందికిపైగా పిడుగు పాటుతో మృత్యువాత పడుతున్నారని భారత వాతావరణ శాఖ లెక్కలు చెప్తున్నాయి. పిడుగు పాటును ముందే పసిగట్టే ఒక మొబైల్‌ యాప్‌ ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. 'దామిని లైట్నింగ్‌ అలర్ట్‌' పేరుతో రూపొందించిన అప్లికేషన్‌ ను మొబైల్‌ ఫోన్‌ లో ఇన్‌ స్టాల్‌ చేసుకుంటే అరగంట ముందే ఆ మొబైల్‌ ఫోన్‌ ఉన్న ప్రాంతంలో పిడుగు పడే అవకాశం ఉంటే అలర్ట్‌ చేస్తుంది. సెంట్రల్‌ జియాలజీ డిపార్ట్‌మెంట్‌ అధీనంలో పని చేసే ''ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటియరాలజీ (ఐఐటీఎం)'' 2020లోనే ఈ అప్లికేషన్‌ ను రూపొందించింది. గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ ల నుంచి దీనిని డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు. జీపీఎస్‌ లోకేషన్‌ ట్రేజ్‌ చేసేందుకు మొబైల్‌ లో యాక్సెస్‌ ఇవ్వాలి. ఆయా మొబైల్‌ ఫోన్‌ ఉన్న జీపీఎస్‌ లొకేషన్‌ ఆధారంగా దానికి 20 నుంచి 40 కి.మీ.ల పరిధిలో ఎక్కడ పిడుగు వచ్చో దామిని యాప్‌ ముందే హెచ్చరిస్తుంది. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాపాయం నుంచి రక్షించుకోవచ్చో కూడా సూచిస్తుంది.

మొబైల్‌ ఫోన్‌ లో దామిని లైట్నింగ్‌ యాప్‌ డౌన్‌ లోడ్‌ చేసుకొని ప్రాథమిక సమాచారం ఇచ్చి, జీపీఎస్‌ లొకేషన్‌ ట్రాకింగ్‌ ఇచ్చిన తర్వాత ఆ ఫోన్‌ ఉన్న ప్రాంతానికి 40 కి.మీ.ల సర్కిల్‌ ను చూపిస్తుంది. అలాగే ఆ లొకేషన్‌ లో పిడుగు పడే అవకాశం ఉందా లేదా అని చెప్పేందుకు మూడు కలర్‌ ఇండికేషన్స్‌ చూపిస్తుంది. దామిని యాప్‌ ఉన్న ఫోన్‌ లో రెడ్‌ కలర్‌ ఇండికేషన్‌ కనిపిస్తే ఆ ప్రాంతంలో రాబోయే 7 నిమిషాల్లో పిడుగు పడే అవకాశముందని అర్థం. ఎల్లో కలర్‌ ఇండికేషన్‌ చూపిస్తే 10 నుంచి 15 నిమిషాల్లో పిడుగు పడే చాన్స్‌ ఉందని అనుకోవాలి. బ్లూ కలర్‌ ఇండికేషన్‌ కనిపిస్తే 18 నుంచి 25 నిమిషాల్లో పిడుగు పడుతుందని నిర్దారణకు రావాలి. భారతదేశంలో 1967 నుంచి 2019 వరకు పిడుగుపాటుతో లక్ష మంది మృత్యువాత పడ్డారు. ప్రకృతి వైపరీత్యాలతో సంభవించిన మరణాల్లో 33 శాతం పిడుగు పాటుతోనే అని ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు చెప్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా పిడుగులు పడుతున్నా, పిడుగుపాటుతో సంభవించే మరణాలు మధ్య భారతదేశంలోనే ఎక్కువగా ఉంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే పిడుగు పాటు మరణాలు ఎక్కువ.. 95 శాతం మరణాలు గ్రామాల్లో, పొలాల వద్దనే సంభవిస్తున్నాయి. ఈ మరణాలను నివారించడానికి దామిని యాప్‌ ఎంతగానో ఉపయోగ పడుతుంది. దురదృష్టవశాత్తు ఆ యాప్‌ గురించి ఎక్కువగా ప్రచారం చేయడం లేదు.

Tags:    
Advertisement

Similar News