సరికొత్త సైబర్ కిడ్నాప్ క్రైమ్.. జాగ్రత్త పడండిలా!
రోజురోజుకీ సైబర్ నేరాలు పెరగడమేకాకుండా కొత్తకొత్త రూపాలు సంతరించుకుంటున్నాయి. తాజాగా అమెరికాలో జరిగిన సైబర్ కిడ్నాప్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
రోజురోజుకీ సైబర్ నేరాలు పెరగడమేకాకుండా కొత్తకొత్త రూపాలు సంతరించుకుంటున్నాయి. తాజాగా అమెరికాలో జరిగిన సైబర్ కిడ్నాప్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. మనుషుల అవసరం లేకుండా జరిగే సరికొత్త కిడ్నాప్ ఇది. ఇదెలా ఉంటుందంటే..
క్రెడిట్ కార్డులు, బ్యాంక్ డీటెయిల్స్ కొట్టేయడం వంటి సైబర్ నేరాలే మనకు తెలుసు. అయితే ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించి మనుషులను మాయం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. దీన్నే సైబర్ కిడ్నాప్/ డిజిటల్ అరెస్ట్ అంటున్నారు. రీసెంట్‌గా మనదేశంలో ఒక మహిళను అలాగే అమెరికాలో ఒక విద్యార్థిని ఈ తరహాలో కిడ్నాప్ చేసిన వార్తలు ప్రస్తుతం సంచలనంగా మారుతున్నాయి.
సైబర్ కిడ్నాప్‌లో కిడ్నాపర్లు ఉండరు. ఎవరికి వారే స్వయంగా కిడ్నాప్ అయ్యేలా సైబర్ నేరగాళ్లు ప్లాన్ చేస్తారు. కిడ్నాపర్లు ఆన్‌లైన్ ద్వారా పర్సనల్ సమాచారాన్ని దొంగిలించి లేదా ఇతర పద్ధతుల ద్వారా బాధితులను బెదిరించి తమకు తాము ఒక ప్రదేశానికి వెళ్లేలా చేస్తారు. అలా ఎవరికీ తెలియని చోట దాక్కునేలా చేసి ఆ వీడియోలను బాధితుల కుటుంబాలకు పంపి డబ్బు పంపమని బెదిరిస్తారు. తాజాగా అమెరికాలో ఒక స్టూడెంట్‌ను ఇలాగే బెదిరించి అతడుండే గ్రామానికి దూరంగా ఒక టెంట్‌లో దాక్కునేలా చేశారు. ఆ ఫొటోలు కుటుంబ సభ్యులకు పంపి డబ్బు వసూలు చేశారు. కిడ్నాపర్లు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవ్వకుండా ఆన్‌లైన్ ద్వారానే ఈ కిడ్నాప్‌ను ప్లాన్ చేశారన్న సంగతి తెలిసిన తర్వాత పోలీసులు అవాక్కయ్యారు.
ఇదొక్కటే కాదు. ‘మీ పిల్లలు కిడ్నాప్ అయ్యారు’ అంటూ కాల్ చేసి ఫేక్ వాయిస్‌తో పిల్లలు నిజంగా ఇబ్బందిలో ఉన్నట్టు నమ్మించి కూడా డబ్బు వసూలు చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. కాబట్టి ఈ తరహా మోసాల పట్ల జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. సోషల్ మీడియాల్లో షేర్ చేసే వ్యక్తిగత వివరాలను ఆసరాగా చేసుకుని నేరగాళ్లు భయపెట్టాలని చూస్తారు. కాబట్టి సోషల్ మీడియాల్లో పర్సనల్ విషయాలు షేర్ చేయకుండా జాగ్రత్త పడాలి. బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు భయపడకుండా వెంటనే ఫ్యామిలీ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
వీటితోపాటు ఇన్‌కమ్ ట్యాక్స్ లేదా కస్టమ్స్ అధికారులమంటూ కాల్స్ చేయడం లేదా నేరుగా ఇంటికి రావడం వంటి స్కామ్స్ కూడా ఇటీవల వెలుగులోకి వచ్చాయి. కాబట్టి డబ్బు పేరుతో బెదిరించే వ్యక్తుల పట్ల భయం లేకుండా జాగ్రత్తగా మెసులుకోవాలి. వీలైనంత త్వరగా సమాచారాన్ని పోలీసులకు చేరవేయడం ముఖ్యం. దీనికై సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబరు‘1930’ లేదా నేషనల్ పోలీస్ హెల్ప్‌లైన్ నంబరు ‘112’ కు కాల్ చేయొచ్చు.
పర్సనల్ వివరాలను చూపకుండా లేకుండా సైబర్ నేరాలకు పాల్పడడం కష్టమైన పని. కాబట్టి ఎవరికి వారు ఆధార్, ఫొటోలు, ఇతర వివరాలను వీలైనంత సేఫ్‌గా ఉంచుకోవాలి. సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి పర్సనల్ వివరాలను వెంటనే తొలగిస్తే మంచిది.