తెలుగు రాజకీయమంతా అయోమయమేనా?

ఏ పార్టీ ఏ రాష్ట్రంలో పోటీ చేయబోతోంది? దాని వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనే విశ్లేషణలతో జనాల్లో అయోమయం పెరిగిపోతోంది.

Advertisement
Update:2022-12-12 11:36 IST

తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా రాజకీయ అయోమయం పెరిగిపోతోంది. ఏపీలో పార్టీలు తెలంగాణలో పోటీ చేయాలని డిసైడ్ అవటం ఒక కారణం. ఇదే సమయంలో తెలంగాణలో పార్టీ ఏపీలో ఎంట్రీ ఇవ్వటానికి రెడీ అవటం మరో కారణం. ఇది సరిపోదన్నట్లుగా ఏపీ అధికార పార్టీ కర్నాటక ఎన్నికల్లో ఎంట్రీ ఇవ్వటానికి రెడీ అవుతోందనే ప్రచారం మరో ఎత్తు. దీంతో ఏ పార్టీ ఏ రాష్ట్రంలో పోటీ చేయబోతోంది? దాని వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనే విశ్లేషణలతో జనాల్లో అయోమయం పెరిగిపోతోంది.

మొదటగా గమనించాల్సిందేమంటే జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ ఏపీలో కూడా ఎంటర్ అవబోతోంది. ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయబోతోందనే విషయంలో క్లారిటి లేదు కానీ దీని వల్ల ఓట్లలో చీలిక అయితే ఖాయమని అనుకుంటున్నారు. ఓట్ల చీలిక వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టమనే విషయంలో విశ్లేషణలు మొదలైపోయాయి. సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే తెలంగాణా ఎన్నికలో 32 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని జనసేన డిసైడ్ అయ్యింది. జనసేనకు ఉన్న ఓట్లెంతో తెలీదు కాబట్టి ఇతర పార్టీలపై పడా ప్రభావాన్ని ఇప్పుడే చెప్పలేం.

ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా యాక్టివ్ అవ్వాలని నిర్ణయించుకుంది. వచ్చేఎన్నికల్లో పోటీ చేయటానికి రెడీ అవుతోంది. నిజానికి ఒక‌ప్పుడు తెలంగాణాలో చాలా బలంగా ఉన్నపార్టీ ఇప్పుడు నేలమట్టమైపోయింది. పార్టీకి నేతలు లేకపోయినా క్యాడర్ ఇంకా ఉంది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయటమే నిజమైతే.. అప్పుడు దాని ప్రభావం ఏ పార్టీపై పడుతుందో చూడాలి. ఇక వైఎస్సార్టీపీపై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు.

ఇదంతా ఒకఎత్తు అయితే వచ్చే ఏడాది జరగబోయే కర్నాటక ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయబోతోందనే ప్రచారం మొదలైంది. కర్నాటకలో స్ధిరపడిన తెలుగువాళ్ళుండే చిక్ బళాపూర్, కోలార్, రాయచూర్, బళ్ళారి జిల్లాల్లోని సుమారు 25 నియోజకవర్గాల్లో పోటీకి వైసీపీ రెడీ అవుతోందట. పక్కనున్న తెలంగాణలో రాజకీయాలనే జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవటం లేదు. అలాంటిది కర్నాటక ఎన్నికల్లో పోటీ చేస్తుందంటే నమ్మేట్లు లేదు. అయితే ప్రచారం మాత్రం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పుడు జరుగుతున్న ప్రచారాలు, నిర్ణయాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో బాగా అయోమయం తప్పేట్లు లేదు.

Tags:    
Advertisement

Similar News