వ‌ద‌ల జ‌గ‌న్.. నిన్ను వ‌ద‌ల‌.. అంటున్న ప‌వ‌న్‌!

పవన్ ప్రచారంలో రెండు అంశాలు స్పష్టంగా కనిపించాయి. మొదటిదేమో కేసీఆర్ పేరు ఎత్తడానికి కూడా పవన్ భయపడిపోతున్నారు. రెండో అంశం ఏమిటంటే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కూడా జగన్‌పైన ఆరోపణలు, విమర్శలు వదిలిపెట్టలేదు.

Advertisement
Update:2023-11-23 11:39 IST

కలలో కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు జగన్మోహన్ రెడ్డే కనబడుతున్నట్లున్నారు. అందుకనే ఎక్కడికి వెళ్ళినా జగన్‌ను వదల్లేకపోతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే వరంగల్ జిల్లాల్లో బీజేపీ అభ్యర్థులు రావు పద్మ, ఎర్రబెల్లి ప్రదీప్ రావు తరపున పవన్ ప్రచారం చేశారు. పవన్ ప్రచారంలో రెండు అంశాలు స్పష్టంగా కనిపించాయి. మొదటిదేమో కేసీఆర్ పేరు ఎత్తడానికి కూడా పవన్ భయపడిపోతున్నారు. రెండో అంశం ఏమిటంటే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కూడా జగన్‌పైన ఆరోపణలు, విమర్శలు వదిలిపెట్టలేదు.

తెలంగాణ ఎన్నికల్లో జగన్‌పైన ఆరోపణలు, విమర్శలు చేస్తే ఉపయోగం ఏమిటనే ఇంగితం కూడా పవన్‌కు ఉన్నట్లు లేదు. ఆవు వ్యాసం లాగ ఎక్కడ మాట్లాడినా, వేదిక ఏదైనా జగన్‌పైన ఆరోపణలు, విమర్శలు చేయాల్సిందే అన్నట్లుగా ఉంది పవన్ వ్యవహారం. వరంగల్ పోరాట స్ఫూర్తితోనే ఏపీలో తాను రౌడీ, గుండాల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారట. అసలు పవన్ చేస్తున్నపోరాటం ఏమిటో ఎవరికీ తెలియ‌దు. పార్టీ నేతలతో సమావేశం లేదా ట్విట్టర్ పోస్టుల్లో జగన్‌పైన ఆరోపణలు, విమర్శలు చేయటాన్ని పవన్ పోరాటాలని అనుకుంటున్నట్లున్నారు.

తానేం మాట్లాడుతున్నారో కూడా పవన్‌కు అర్థ‌మవుతున్నట్లు లేదు. 2009లో ఏర్పాటు చేసిన జనసేన ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడటానికి రైతాంగ సాయుధ పోరాటమే కారణమని చెప్పారు. తెలంగాణలో జరిగిన రైతాంగ పోరాటానికి జనసేన ఆటుపోట్లకు ఏమిటి సంబంధం? అసలు జనసేన ఆటుపోట్లను ఎదుర్కొన్నదెక్కడ? జనసేన పార్టీని నడుపుతున్నదే చంద్రబాబు అని కదా మంత్రులు ఎకసెక్కాలాడుతున్నది. చంద్రబాబు ప్రయోజనాల రక్షణ కోసమే పవన్ జనసేన పెట్టినట్లు మంత్రులు పదేపదే సెటైర్లు వేస్తున్నారు. దాన్ని నిజం చేసేట్లు పవన్ వ్యవహరిస్తున్నారు.

ఇక పార్టీ ఆటుపోట్లను ఎదుర్కొన్నది లేదు, పార్టీ కోసం పవన్ చేసిన పోరాటాలూ లేదు. తెలంగాణ కోరుకున్నవాళ్ళల్లో తాను ఒకడినని ఇప్పుడు చెప్పింది కూడా అబద్ధమే. ఎలాగంటే ఇదే పవన్ చాలాకాలం క్రితం తెలంగాణ ఏర్పడినప్పుడు బాధతో 11 రోజులు అన్నం కూడా తినలేదని చెప్పారు. పవన్ సమస్యేమిటంటే ఈ రోజు ఏమి మాట్లాడారు, నిన్న, మొన్న ఏమి మాట్లాడారో గుర్తుంచుకోరు. మొత్తానికి తెలంగాణ ఎన్నికల్లో కూడా జగన్ గురించి మాట్లాడటమే హైలైట్.

Tags:    
Advertisement

Similar News