కృష్ణా నీటి పంపకాలపై 27న వాదనలు వింటాం
ఏపీ పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నీటి పంపకాలపై ఈనెల 27న వాదనలు వింటామని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్‌లోని సెక్షన్ 89 ప్రకారం నీటి పంపకాలతో దశాబ్దాల తరబడి తెలంగాణకు జరిగిన అన్యాయం సరి చేయలేరని.. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ -1956లోని సెక్షన్ 3 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు చేయాలని తెలంగాణ 2014 నుంచి కేంద్రాన్ని కోరుతూ వస్తోంది. రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తర్వాత 2023 అక్టోబర్ లో కేంద్ర ప్రభుత్వం నీటి పంపకాలను బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కు అప్పగిస్తూ టీవోఆర్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అదే నెల 17న ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్ చేసింది. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ప్రకారం నీటి పంపకాల అంశాన్ని ట్రిబ్యునల్ కు అప్పగించే అధికారం కేంద్రానికి లేదని ఏపీ పిటిషన్ లో పేర్కొన్నది. ఇప్పటికే ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్‌లోని సెక్షన్ 89ఏ, బీ ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులపై వాదనలు జరుగుతోన్న సమయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేయాలని కోరుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు నీటి వాటాల్లో అన్యాయం జరిగింది కాబట్టి సెక్షన్ 3 ప్రకారమే వాదనలు వినాలని తెలంగాణ వాదిస్తోంది. సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ ఈనెల 19 నుంచి విచారణ జరుపుతోందని.. ఈ పరిస్థితుల్లో తమ వాదనలు వినాలని గురువారం విచారణ సందర్భంగా ఏపీ పట్టుబట్టింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ లతో కూడిన ధర్మాసనం పూర్తి స్థాయి వాదనలు వినిపించడానికి ఎంత సమయం పడుతుందని ప్రశ్నించారు. ఏపీ అడ్వొకేట్ స్పందిస్తూ రెండు గంటలకు పైగా సమయం పడుతుందని బదులిచ్చారు. ప్రస్తుతానికి అంత సమయం లేనందున ఈనెల 27న వాదనలు వింటామన్న ధర్మాసనం విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది.