మరింత ఉధృతంగా యమున.. ఇంకా డేంజర్ జోన్ లోనే ఢిల్లీ
హర్యాణా నుంచి వస్తున్న వరద ప్రవాహం ఢిల్లీవద్ద ఆందోళనకు కారణం అవుతోంది. హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి నీటిని కిందకు వదులుతూనే ఉన్నారు.
యమునా నది ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి 206.38 మీటర్ల మేర ప్రవాహం నమోదైంది. ఈరోజు ఉదయానికి అది 207.25 మీటర్లకు పెరిగింది. యమునా నదికి తీవ్ర వరదలు వచ్చినప్పుడు 207.49 మీటర్ల అత్యథిక ప్రవాహం ఇప్పటి వరకూ ఉన్న రికార్డ్. దీన్ని ఈసారి వరదలు అధిగమించే అవకాశముంది.
హర్యాణా నుంచి వస్తున్న వరద ప్రవాహం ఢిల్లీవద్ద ఆందోళనకు కారణం అవుతోంది. హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి నీటిని కిందకు వదులుతూనే ఉన్నారు. దీంతో ఢిల్లీ వద్ద యమునా ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. పాత రైల్వే బ్రిడ్జ్ వద్ద ఈ ఉదయం 207.25 మీటర్లకు ప్రవాహం చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెండురోజుల క్రితమే లోతట్టు ప్రాంతాలనుంచి ప్రజల్ని తరలించడం మొదలు పెట్టారు. ముంపు ప్రాంతాల్లోని వేలాది కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
బాధితుల పునరావాసం కోసం తాత్కాలికంగా టెంట్ లు వేసి ఏర్పాట్లు చేశారు. తూర్పు, ఈశాన్య, ఆగ్నేయ, మధ్య, షాదార్ జిల్లాల్లో టెంట్ లు వేసి పునరావాస శిబిరాల్లోకి బాధితుల్ని తరలిస్తున్నారు. శిబిరాల్లో ఆహారం, తాగునీరు, ఇతర వసతులు సిద్ధంచేశారు.