యమునా అప్ డేట్.. వరదనీటిలో సుప్రీంకోర్ట్, రాజ్ ఘాట్
ఢిల్లీలో మంచినీటి సరఫరా వ్యవస్థ కూడా స్తంభించింది. నీటికోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసరాలు అందక మరికొంతమంది అల్లాడిపోతున్నారు.
యమునా నది మహోగ్ర రూపం ఢిల్లీని వణికించేసింది. వానలు లేకపోయినా వరదనీరు మాత్రం ఢిల్లీని వదిలిపెట్టడంలేదు. వారం రోజులుగా యమునా ప్రవాహం అంతకంతకూ పెరిగి ఈరోజు ఉదయం 208.46 మీటర్లకు చేరింది. గతంలో ఎప్పుడూ వరదనీరు రాని ప్రాంతాలు కూడా ఈసారి నీట మునిగాయి. ఎర్రకోట చుట్టూ వరదనీరు చేరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేజ్రీవాల్ ఇంటిని కూడా వరదనీరు చుట్టుముట్టింది. తాజాగా సుప్రీంకోర్ట్, రాజ్ ఘాట్ ని కూడా వరదనీరు ముంచెత్తింది.
యమునా ప్రవాహం పరివాహక ప్రాంతాలపై ప్రభావం చూపించగా, ఢిల్లీలో డ్రైనేజీలు ఉప్పొంగి పరిస్థితి గందరగోళంగా మారింది. నీరు బయటకుపోయే మార్గాలే కనిపించట్లేదు. ఎక్కడికక్కడ రోడ్లపై వరదనీరు వచ్చి చేరింది. భైరాన్ రోడ్డు, వికాస్ మార్గ్ లో రాకపోకలు నిలిపివేశారు. యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్ మూసివేశారు. జులై 16 వరకు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు ప్రకటించారు. నిత్యావసరాలు మినహా భారీగా సరకు తరలించే వాహనాలు ఢిల్లీలోకి రాకూడదని అధికారులు ఆంక్షలు విధించారు.
మంచి నీటికి కటకట..
ఢిల్లీలో మంచినీటి సరఫరా వ్యవస్థ కూడా స్తంభించింది. నీటికోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసరాలు అందక మరికొంతమంది అల్లాడిపోతున్నారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నవారు సర్వం కోల్పోయి బాధపడుతున్నారు. గత రాత్రి నుంచి యమున కాస్త శాంతించినా ఆ ప్రభావం పెద్దకా కనపడట్లేదు. అత్యంత ప్రమాద స్థాయి కంటే ఇంకా మూడు మీటర్లు ఎక్కువగానే ప్రవాహం ఉంది. ఢిల్లీలో రెండు రోజులపాటు తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని, శనివారం వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.