యమునకు మళ్లీ వరద.. ఢిల్లీ దడదడ

ఈ నెల 13న యమునా నది ప్రవాహం ఢిల్లీ వద్ద గరిష్టంగా 208.66 మీటర్ల ఎత్తుకి చేరింది. ఆ తర్వాత తగ్గుతూ వచ్చింది. మళ్లీ ఇప్పుడు వరద పోటెత్తడంతో యమున ఉధృతి పెరిగింది. ఢిల్లీ లోతట్టు ప్రాంతాల వాసులు గజగజ వణుకుతున్నారు.

Advertisement
Update:2023-07-23 10:43 IST

యమునా నది పూర్తిగా శాంతించలేదు. తగ్గినట్టే తగ్గి వరద ఉధృతి మళ్లీ పెరిగింది. దీంతో ఢిల్లీ వద్ద యమున ప్రవాహం మళ్లీ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ఢిల్లీలోని పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది ప్రవాహం 205.75 మీటర్లకు చేరింది. ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్‌ లో వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. ఈ భారీ వర్షాలతో యమునకు ప్రవాహం పెరిగింది. హర్యానాలోని హత్నికుండ్‌ బ్యారేజ్ కు వరదనీరు పోటెత్తింది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్టు హత్నికుండ్ బ్యారేజ్ నుంచి కిందకు విడుదల చేస్తున్నారు. 2 లక్షలకుపైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసింది హర్యానా ప్రభుత్వం. దీంతో ఢిల్లీ గజగజ వణికిపోతోంది.

ఈ నెల 13న యమునా నది ప్రవాహం ఢిల్లీ వద్ద గరిష్టంగా 208.66 మీటర్ల ఎత్తుకి చేరింది. ఆ తర్వాత తగ్గుతూ వచ్చింది. కొన్నిరోజులుగా యమున ప్రవాహం 205 అడుగులకు చేరింది. దీంతో ఢిల్లీ వాసులు కాస్త తెరిపిన పడ్డారు. మళ్లీ ఇప్పుడు వరద పోటెత్తడంతో యమున ఉధృతి పెరిగింది. ఢిల్లీ లోతట్టు ప్రాంతాల వాసులు గజగజ వణుకుతున్నారు.

ముంపు ప్రాంతాల్లో అప్రమత్తం..

ఢిల్లీలో వరద కాస్త తగ్గడంతో పరివాహక ప్రాంతాల ప్రజలు వెంటనే తమ ఇళ్లకు చేరుకున్నారు. ఇప్పుడు వారిని తిరిగి ఖాళీ చేయిస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నామని కేజ్రీవాల్ ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. మరో రెండురోజులపాటు హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతవరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఢిల్లీకి మరింత వరద ముప్పు పొంచిఉన్నట్లయింది.

Tags:    
Advertisement

Similar News