రోడ్డెక్కిన రెజ్లర్లు.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
బ్రిజ్ భూషణ్ రాజీనామా చేయడంతోపాటు జాతీయ సమాఖ్యను కూడా రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బ్రిజ్ భూషణ్ పై కేసు పెట్టి జైల్లో పెట్టిస్తామంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారంతా ఆషామాషీ క్రీడాకారులు కాదు. వారిలో ఒలింపిక్ పతక విజేతలున్నారు, అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో బంగారు పతకాలు సాధించినవారు కూడా ఉన్నారు. అంతా ఒక్కసారిగా రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు కూర్చున్నారు. మద్దతుగా ప్రతిపక్షాలు వచ్చినా, వెనక్కు వెళ్లిపోవాలని, ఇది రాజకీయం కాదని మర్యాదగా చెప్పి పంపించేశారు. కడుపు మండి, ఆటల్లో రాజకీయాలు తట్టుకోలేక, లైంగిక వేధింపులు భరించలేక క్రీడాకారులు ఒక్కటిగా కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. బహుశా భారత్ లోనే ఇలాంటి దారుణాలు జరుగుతాయేమోనంటూ అంతర్జాతీయ మీడియా కూడా కథనాలు ఇచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకో వచ్చు.
అసలేం జరిగింది..?
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కి వ్యతిరేకంగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. మహిళా రెజ్లర్లపై ఆయన లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి. ఒకరిద్దరు కాదు, ప్రస్తుతం ఐదుగురు తమ బాధను బయటపెట్టారు, లోలోపల కుమిలిపోతున్నవారు ఇంకా చాలామందే ఉన్నారంటూ రెజ్లర్లంతా ఒక్కతాటిపైకి వచ్చారు. బ్రిజ్ భూషణ్ రాజీనామా చేయడంతోపాటు జాతీయ సమాఖ్యను కూడా రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బ్రిజ్ భూషణ్ రాజీనామాతో తాము సంతృప్తి చెందే ప్రసక్తే లేదని, అతనిపై కేసు పెట్టి జైల్లో పెట్టిస్తామంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రం వాదన ఏంటి..?
క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తో రెజ్లర్లు సమావేశమయ్యారు. బ్రిజ్ భూషణ్ పై వేటు వేయాలని డిమాండ్ చేశారు. అయితే ఆయన రెజ్లర్ల ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ WFIకి 72 గంటల సమయం ఇచ్చారు. సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. కానీ రెజ్లర్లు వెనక్కు తగ్గలేదు. సమస్య పరిష్కారమవుతుందని తమకు తెలుసని, కానీ వెంటనే WFIని మాత్రం రద్దు చేయాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. బల్గేరియాలో జరిగిన ప్రపంచ జూనియర్ ఛాంపియన్ షిప్ సందర్భంగా ప్లేయర్ల హోటల్‌లో బ్రిజ్ భూషణ్ ఉన్నారని, మహిళా క్రీడాకారుల్ని ఆయన వేధింపులకు గురి చేశారని ఆరోపించారు.
మహిళా కమిషన్ ఏం చేస్తోంది..?
ప్రస్తుతానికి మహిళా కమిషన్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేదు. రెజ్లర్లు తమకు ఫిర్యాదు చేయవచ్చని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది. వారు ఫిర్యాదు చేస్తే ఈ విషయంపై దృష్టిసారిస్తామని చెప్పింది. వెటరన్ అథ్లెట్, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష కూడా రెజ్లర్ల ఆందోళనపై స్పందించారు. ఈ ఆందోళనలపై భారత ప్రభుత్వం సరైన దిశలో సరైన నిర్ణయం తీసుకుంటుందని నమ్ముతున్నామని అన్నారామె. ఎలాంటి పరిస్థితుల్లో కూడా అథ్లెట్ల హక్కులను కాలరాయకూడదని ఆమె చెప్పారు. మహిళా అథ్లెట్ల భద్రత కోసం ఐఓఏ అన్ని చర్యలు తీసుకుంటుందని ఆమె భరోసా ఇచ్చారు.