తాకాడు.. ప్రలోభపెట్టబోయాడు -ఎఫ్‌ఐఆర్‌లో బ్రిజ్‌ భూషణ్‌పై ఆరోపణలు

విదేశాల్లో జరిగిన పోటీల్లో తాను గాయపడగా అప్పుడు బ్రిజ్‌ భూషణ్‌ తన వద్దకు వచ్చి తనతో ఉంటే వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం ఫెడరేషనే భరిస్తుందంటూ ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారని మరో రెజ్లర్ పోలీసులకు చెప్పారు.

Advertisement
Update:2023-06-02 13:11 IST

మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కీలకమైన అంశాలు ఉన్నాయి. ఏడుగురు మహిళా రెజర్లు అతడిపై ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోని కన్నౌట్‌ప్యాలెస్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.

ఆరుగురు రెజ్లర్లు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఒక ఎఫ్‌ఐఆర్‌.. మరో మైనర్‌ రెజ్లర్‌ తరపున ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అందులో తమను బ్రిజ్‌ భూషణ్ ఎలా వేధించింది ఆ అమ్మాయి వివరించారు. అత్యంత అనుచితంగా వ్యవహరించడం, బూతులు మాట్లాడటం వంటివి చేశారని అందులో వివరించారు. అతడికి భయపడి రెజ్లర్లు ఒంటరిగా తిరగడం కూడా మానేసి.. గదుల్లో నుంచి బయటకు గుంపుగానే వచ్చేవారని వివరించారు.

తాను గుంపుగా వెళ్తున్నా సరే ఒక్కొక్కరిని పిలిచి అభ్యంతరకరమైన ప్రశ్నలు అడిగే వాడని, అనుచితంగా మాట్లాడేవారని వెల్లడించారు. అతడి ప్రశ్నలకు తాము సమాధానాలు చెప్పలేక ఇబ్బంది పడేవారమని చెప్పారు. ఒక రోజు తనను పిలిచి టీ- షర్ట్‌ లాగాడని, బ్రీతింగ్ టెస్ట్ అంటూ చాతీపైన, పొట్టపైన చేయి వేసి అభ్యంతరకరంగా వ్యవహరించారని ఒక రెజ్లర్‌ ఫిర్యాదులో వివరించారు. మరో సందర్భంలో ఏంటో తెలియని ఒక పదార్థాన్ని తెచ్చి దాన్ని తినాల్సిందిగా ఒత్తిడి చేశారని.. దాన్ని తింటే ఫిట్‌గా ఉంటారంటూ నమ్మించే ప్రయత్నం చేశారని మరో రెజ్లర్‌ ఆరోపించారు. తాకడం, నడుముపైన, చాతీపైన, ఇతర భాగాలపై చేయి వేయడం వంటి చర్యలకు బ్రిజ్ భూషణ్ పాల్పడినట్టు రెజ్లర్లు తమ ఫిర్యాదులో వివరించారు.

విదేశాల్లో జరిగిన పోటీల్లో తాను గాయపడగా అప్పుడు బ్రిజ్‌ భూషణ్‌ తన వద్దకు వచ్చి తనతో ఉంటే వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం ఫెడరేషనే భరిస్తుందంటూ ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారని మరో రెజ్లర్ పోలీసులకు చెప్పారు. ఫొటోల పేరుతో గట్టిగా కౌగిలించుకున్నారని సదరు అమ్మాయి ఆరోపించారు. రెజ్లింగ్ సమాఖ్య సెక్రటరీ వినోద్ తోమర్‌పైనా ఆరోపణలు చేశారు. ఢిల్లీలోని కార్యాలయానికి వెళ్లినప్పుడు మిగిలిన వారందరినీ బయటకు పంపించి తనను బలవంతంగా తనవైపు లాక్కున్నారని వినోద్‌పై ఒక రెజ్లర్‌ ఫిర్యాదు చేశారు.

అటు బ్రిజ్‌భూషణ్‌పై ఆరోపణలకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లోని తీవ్రమైన అంశాలు వెలుగులోకి రావడంతో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ట్విట్టర్‌లో కేంద్ర‌ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంత తీవ్రమైన నేరారోపణలు ఉన్నా నిందితుడిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో దేశానికి సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News