వెదురు బొంగులతో హైవే బ్యారియర్లు.. ఎంత గట్టిగా ఉంటాయో తెలుసా..?
క్రియోసోట్ ఆయిల్ తో వెదురుకి పూతపూసి ఆ తర్వాత అధిక సాంద్రత ఉన్న పాలీ ఇథిలీన్ లను వాటికి రక్షణ కవచంగా వాడతారు. అప్పుడు ఆ వెదురుబొంగు ఉక్కుతో సమానంగా దృఢత్వాన్ని కలిగి ఉంటుంది.
జాతీయ రహదారుల పక్కన మలుపుల వద్ద ప్రమాదాల తీవ్రత తగ్గించేందుకు ఉక్కుతో చేసిన బ్యారియర్లు అమరుస్తారు. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే అత్యవసరమైన చోట్ల మాత్రమే వీటిని ఏర్పాటు చేస్తారు. ఆ ఖర్చుని తగ్గించి, రహదారుల పక్కన విరివిగా బ్యారియర్లు వినియోగించేందుకు జాతీయ రహదారుల శాఖ ఓ ప్రత్యామ్నాయాన్ని తెరపైకి తెచ్చింది. ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ అంటూ దీనికి ప్రచారం కల్పిస్తోంది. ఉక్కు బ్యారియర్లకు బదులు వెదురు బొంగులను వినియోగిస్తుంది.
ప్రమాదాలు జరిగినప్పుడు మలుపుల వద్ద వాహనాలు వెళ్లి లోయల్లో పడకుండా, లేదా పల్టీలు కొట్టి ప్రమాద తీవ్రత జరగకుండా ఉండేందుకు ఉక్కుబ్యారియర్లు వినియోగిస్తారు. వీటిని ఢీకొని వాహనాలు అక్కడే ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి వెదురుబొంగులు ఉక్కుకి ప్రత్యామ్నాయం అవుతాయా అనేదే ఇక్కడ ప్రశ్న. అయితే నేరుగా వెదురు బొంగులను ఇక్కడ పాతేయరు. ‘బాంబూసా బాల్కోవా’ వెదురు జాతితో వీటిని తయారు చేస్తారు. క్రియోసోట్ ఆయిల్ తో వెదురుకి పూతపూసి ఆ తర్వాత అధిక సాంద్రత ఉన్న పాలీ ఇథిలీన్ లను వాటికి రక్షణ కవచంగా వాడతారు. అప్పుడు ఆ వెదురుబొంగు ఉక్కుతో సమానంగా దృఢత్వాన్ని కలిగి ఉంటుంది. నేషనల్ ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్స్, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చి ఇన్ స్టిట్యూట్ వంటి సంస్థల్లో కఠిన పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత వీటిని వినియోగంలోకి తెచ్చారు.
ప్రపంచంలోనే మొట్టమొదటి వెదురు బారియర్ ను మహారాష్ట్ర లోని చంద్రాపూర్, యావత్మాల్ జిల్లాలను కలిపే హైవేపై వణి- వరోరా పట్టణాల మధ్య ఏర్పాటు చేశారు. 200 మీటర్ల మేర ఈ వెదురు క్రాష్ బారియర్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ప్రపంచంలోనే ఇది మొట్టమొదటిది అని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల తీవ్ర తగ్గించేందుకు ఇది ఓ వినూత్న ఐడియా అని అన్నారాయన.