నేడే రైతు, కార్మిక గర్జన... లక్షలాదిగా ఢిల్లీకి చేరుకుంటున్న జనం
దాదాపు 300 మంది విద్యావేత్తలు, నటులు, రచయితలు, జర్నలిస్టులు, రక్షణ రంగ మాజీ అధికారులు ఈ నిరసనకు తమ మద్దతును ప్రకటించారు. ప్రభుత్వం ఒక క్రమపద్ధతిలో కుదించిన సంక్షేమ పథకాల వల్ల ప్రజలు మరింత పేదరికంలోకి కూరుకుపోతున్నారని వీరు ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.
బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ కార్మిక ,రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా వేలాది మంది రైతులు , కార్మికులు బుధవారం ఢిల్లీ రాంలీలా మైదానంలో మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీని నిర్వహించనున్నారు. ఆల్ ఇండియా అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ (AIAWU), సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (CITU) , ఆల్ ఇండియా కిసాన్ సభ (AIKS) ఈప్రదర్శనకు పిలుపునిచ్చాయి.
ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం, కనీస మద్దతు ధర (MSP)కి చట్టపరమైన హామీ, కార్మికులందరికీ నెలకు రూ. 26,000 కనీస వేతనం, రుణమాఫీ, 60 ఏళ్లు పైబడిన రైతులందరికీ పెన్షన్, నాలుగు కార్మిక వ్యతిరేక చట్టాలు ఉపసంహరణ, విద్యుత్ సవరణ బిల్లు 2020 రద్దు వంటి డిమాండ్లతో ఈ ప్రదర్శన జరగనుంది.
దాదాపు 300 మంది విద్యావేత్తలు, నటులు, రచయితలు,జర్నలిస్టులు, రక్షణ రంగ మాజీ అధికారులు ఈ నిరసనకు తమ మద్దతును ప్రకటించారు. ప్రభుత్వం ఒక క్రమపద్ధతిలో కుదించిన సంక్షేమ పథకాల వల్ల ప్రజలు మరింత పేదరికంలోకి కూరుకుపోతున్నారని వీరు ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రకటన విడుదల చేసిన వారిలో ప్రభాత్ పట్నాయక్, ఇర్ఫాన్ హబీబ్, ఇషితా ముఖోపాధ్యాయ్, మనోరంజన్ మొహంతి, జయతీ ఘోష్, సీపీ చంద్రశేఖర్, హర్ష్ మందర్, నసీరుద్దీన్‌షా, తీస్తా సీతల్వాడ్, రామకృష్ణ చటర్జీ, విజయ వెంకటరామన్, విశ్వమోహన్ ఝా, అభిషేక్ మహాపాత్ర, మాలిని భాట్టాచార్య, న్యాయవాది అశోక్ అగర్వాల్, మోహన్ సోజ్, సుభాష్ రాయ్, రజిని అరోరా తదితరులు ఉన్నారు.
కార్పొరేట్ పన్నుల తగ్గింపు, చౌకగా ప్రభుత్వ రంగ సంస్థలను కట్టబెట్టడం, కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయడం, లక్షల కోట్ల కార్పొరేట్ రుణాల రైటాఫ్, కీలకమైన దేశ వ్యూహాత్మక రంగాల్లో విదేశీ పెట్టుబడులకు అవకాశం ఇవ్వడం వంటి కేంద్రం విధానాల వల్ల విపరీత పరిణామాలు సంభవించే ప్రమాదం ఉన్నదని మేదావులు హెచ్చరించారు.
మరో వైపు, ఒక్క హర్యానా నుంచే దాదాపు 40,000-50,000 మంది ప్రజలు ఢిల్లీకి చేరుకుంటున్నారని ది హిందు తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున రైతులు, కూలీలు, కార్మికులు ఢిల్లీకి చేఉకుంటున్నారు.
మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీ చేస్తున్న ప్రధాన డిమాండ్లు:
1. అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలి.
2. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి.
3. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి.
4. విద్యుత్తు సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి.
5. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి.
6. రోజుకు రూ.600 కూలీతో ఉపాధి హమీ పథకాన్ని 200 రోజులకు విస్తరించాలి.
7. పేద రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలి.
8. అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేయాలి.
9. నెలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి.
10. కార్మికులందరికీ రూ.10 వేల పింఛను ఇవ్వాలి.
11. కాంట్రాక్ట్ లేబర్ వ్యవస్థకు స్వస్తి పలకాలి.
12. కార్పొరేట్ పన్ను పెంచడంతో పాటు సంపద పన్నును ప్రవేశపెట్టాలి.
13. పట్టణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలి.
సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్, హర్యానా వైస్ ప్రెసిడెంట్ సత్వీర్ సింగ్ ది హిందూతో మాట్లాడుతూ ప్రస్తుత పాలనపై ప్రజల్లో ఆగ్రహం ఉందని, ధరల పెరుగుదల, నిరుద్యోగం నుండి ఉపశమనం పొందేందుకు ప్రజలు రాజకీయ ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని అన్నారు.