గురుద్వారాలో మద్యం సేవించిన మహిళ.. కాల్చి చంపిన భక్తుడు

మహిళపై కాల్పులు జరిపిన నిర్మల్ జిత్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికుడైన అతడు ఒక ప్రాపర్టీ డీలర్ అని, తరచూ గురుద్వారాకు వస్తుంటాడని పాటియాలా ఎస్పీ వరుణ్ శర్మ తెలిపారు.

Advertisement
Update:2023-05-15 14:14 IST

పంజాబ్ రాష్ట్రం పాటియాలాలో సిక్కుల పవిత్రమైన గురుద్వారాలో మద్యం సేవిస్తున్న మహిళను ఓ భక్తుడు కాల్చి చంపాడు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. గురుద్వారాలో మద్యం సేవించి అపవిత్రం చేసిందన్న కోపంతోనే భక్తుడు ఆమెను కాల్చి చంపాడు. పాటియాలా పట్టణం అర్బన్ ఎస్టేట్ ఫేజ్ వన్ కు చెందిన పర్మీందర్ కౌర్(32) ఆదివారం సాయంత్రం దుక్నీవార్న్ సాహిబ్ గురుద్వారాకు వెళ్ళింది. కాసేపటి తర్వాత ఆమె గురుద్వారాలోని సరోవర్ వద్దకు వెళ్లి మద్యం సేవించడం మొదలుపెట్టింది.

దీనిని నిర్మల్ జిత్ అనే భక్తుడు గ‌మ‌నించాడు. అలాగే గురుద్వారా సిబ్బంది కూడా మహిళ మద్యం సేవించడం చూశారు. వారు ఈ విషయం గురించి గురుద్వారా బోర్డుకు ఫిర్యాదు చేసే లోపే నిర్మల్ జిత్ తన వద్ద వున్న గన్ తో పర్మీందర్ కౌర్ పై ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన ఆలయ సిబ్బంది ఆమెను వెంటనే స్థానికంగా ఉన్న ఒక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో గాయపడ్డ మరో వ్యక్తిని కూడా ఆసుపత్రిలో చేర్పించారు.

మహిళపై కాల్పులు జరిపిన నిర్మల్ జిత్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికుడైన అతడు ఒక ప్రాపర్టీ డీలర్ అని, తరచూ గురుద్వారాకు వస్తుంటాడని పాటియాలా ఎస్పీ వరుణ్ శర్మ తెలిపారు. అతడికి ఎటువంటి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ లేదని ఆయన చెప్పారు.

కాగా, గురుద్వారాలో మద్యం సేవించి అపవిత్రం చేసినందుకే మహిళపై భక్తుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురుద్వారాలో ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. రెండేళ్ల కిందట గురుద్వారాని అపవిత్రం చేసిన ఒక వ్యక్తిని భక్తులు అక్కడే కొట్టి చంపారు.

Tags:    
Advertisement

Similar News