ఈ 20 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరమేనా ?

ఉక్రెయిన్ లో యుద్దం వల్ల భారత్ కు తిరిగి వచ్చిన 20 వేల మంది మెడిసిన్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకమైంది. వాళ్ళను ఇక్కడి మెడికల్ కాలేజీల్లో చేర్చుకోవాలన్న డిమాండ్ ను ప్రభుత్వం తిరస్కరించింది.

Advertisement
Update:2022-07-30 12:01 IST

రష్యా ఉక్రెయిన్ పై చేస్తున్న యుద్దం 20 వేల మంది భారత విద్యార్థుల జీవితాలను అగమ్యగోచరం చేసేసింది. ఉక్రెయిన్ లో చదువు కోసం వెళ్ళిన 20 వేల మంది విద్యార్థులు యుద్దం కారణంగా అష్టకష్టాలు పడి వెనక్కి వచ్చేశారు. అయితే వాళ్ళ చదువు మాత్రం ఇప్పుడు సందిగ్దంలో పడింది.

వాళ్ళలో మెజారిటీ విద్యార్థులు మెడిసిన్ చదవడానికి అక్కడికి వెళ్ళినవారే.

చదువు మధ్యలో అక్కడి నుంచి వచ్చేసిన విద్యార్థులను భారత్ లోని వివిధ మెడికల్ కాలేజీల్లో చదవడానికి అనుమతించాలని విద్యార్థులు, వాళ్ళ తల్లితండ్రులు ప్రభుత్వాన్ని బతిమిలాడుకుంటున్నారు. కొంత కాలంగా వీళ్ళంతా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ప్రదర్శన కూడా నిర్వహిస్తున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం కరగడం లేదు.

ఉక్రెయిన్ నుంచి చదువు మధ్యలో వచ్చేసిన విద్యార్థులెవ్వరికీ ఇక్కడ కాలేజీల్లో అవకాశం కల్పించే ప్రసక్తే లేదని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ పార్లమెంటులో ప్రకటించారు.

ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956 , నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019 లో ఇతర దేశాల్లో చదివి వచ్చిన వైద్య విద్యార్థులను చేర్చుకోవడానికి ఎలాంటి నిబంధనలు లేవని ఆయన తెలిపారు.

కాబట్టి ఏ భారతీయ వైద్య సంస్థలో గానీ యూనివర్శిటీలో గానీ ఉక్రెయిన్ నుండి వచ్చిన‌ వైద్య విద్యార్థులను చేర్చుకోవడానికి అవకాశమే లేదని పవార్ రాజ్య‌ సభకు తెలియజేశారు.

అయితే ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ కోర్సు చివరి సంవత్సరం విద్యార్థులకు మాత్రం ఒక అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మెడిసిన్ చివరి సంవత్సరం చదువుతూ యుద్దం కారణంగా ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చేసిన విద్యార్థులకు ఈ సంవత్సరం 'ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్' (FMGE)కి హాజరు కావడానికి అనుమతిస్తామని మంత్రి తెలిపారు.

అయితే మిగతా విద్యార్థుల భవిష్యత్తు మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడంలేదనే విమర్షలు వస్తున్నాయి. మరో వైపు ఈ విద్యార్థులకు మెడికల్ కాలేజీల్లో చేరేందుకు కేంద్రం అనుమతిస్తే విద్యార్థులకు అన్ని రకాల సహాయం చేసేందుకు తాము సిద్దమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లు ప్రకటించారు. విద్యార్థులను కాలేజీల్లో చేర్చుకోవాలని వారిద్దరూ ప్రధాని మోడీని కోరారు.

Tags:    
Advertisement

Similar News