పేదల ఉచితాలే క‌నిపిస్తాయా..? పెద్దల రుణమాఫీల సంగతేంటి..?

తెలంగాణలో దళితబంధు అందుకున్న కుటుంబాల ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. అప్పులు తీరిపోతున్నాయి, కొత్త ఉపాధి మార్గాలు కనపడుతున్నాయి. పేదల జీవితాలను మార్చే ఇలాంటి పథకాలపై ఇప్పుడు ఈసీ రచ్చచేయడం వింత, విచిత్రంగా తోస్తోంది.

Advertisement
Update:2022-10-06 09:13 IST

భారత్ లో ధనిక, పేద అంతరం పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. దీనికి కారణం ఏంటి..? కేంద్ర ఆర్థిక విధానాల ద్వారా పేదలు మరింత పేదరికంలో కూరుకుపోతుంటే, ధనవంతులు వివిధ రాయితీలు, రుణ మాఫీల ద్వారా మరింత బలవంతులవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచిత పథకాలతో వరాలు ప్రకటిస్తున్నాయి. ఒకరకంగా ఇది ఎన్నికల స్టంటే అనుకున్నా.. అంతిమంగా లాభపడుతోంది మాత్రం పేదలే. ఏపీ వంటి రాష్ట్రాల్లో దళారీల పాత్రే లేకుండా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోనే డబ్బులు జమ అవుతున్నాయి. తెలంగాణలో రైతు బంధు, దళితబంధు వంటి పథకాల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తెలంగాణలో దళితబంధు అందుకున్న కుటుంబాల ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. అప్పులు తీరిపోతున్నాయి, కొత్త ఉపాధి మార్గాలు కనపడుతున్నాయి. పేదల జీవితాలను మార్చే ఇలాంటి పథకాలపై ఇప్పుడు ఈసీ రచ్చచేయడం వింత, విచిత్రంగా తోస్తోంది.

ఉచితాలు సముచితమేనా..?

ఉచితాలు సముచితం కాదు అంటున్న మేధావులు.. అసలు ఉచితం అంటే ఏంటి..? ఎంతవరకు దాని పరిమితి అనేది చెప్పగలరా..? పేదలకు ఉచితంగా 10రూపాయలు ఇస్తే ఆ మేధావుల కళ్లు చల్లగా ఉంటాయి, అదే 100 రూపాయలు ఇస్తే మాత్రం వారు గొడవ చేస్తారు. ఇదే ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు రుణమాఫీల పేరుతో వందల వేల కోట్లు రాయితీలు ప్రకటించడం ఎంతవరకు న్యాయం..? అప్పు ఎగ్గొట్టే పెద్దలకోసం, పేదలు బ్యాంకులో దాచుకున్న డబ్బుని వినియోగించడం ఎంతవరకు సమంజసం. విదేశాల్లో దాచుకున్న బ్లాక్ మనీ భారత్ కి తిరిగి తెప్పిస్తానంటూ బడాయికి పోయిన మోదీ, కనీసం విదేశాలకు పారిపోయిన వ్యాపార వేత్తలను కూడా టచ్ చేయలేకపోతున్నారనేది వాస్తవం. దీనిపై ఈసీ వంటి సంస్థలు ఎందుకు నోరు మెదపవు.

ఉచితాలపై వాగ్ధానాలు చేసే రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం వివరణ కోరడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే అదే ఈసీ.. వ్యాపారవేత్తలకు రుణ మాఫీలు, రాయితీలు ఇచ్చే కేంద్రాన్ని ఎందుకు సమాచారం కోరడంలేదు. కనీసం ఆ సమాచారం కూడా బ్యాంకులు తమకు తాముగా ప్రకటిస్తేనే ప్రజలకు తెలుస్తోంది. ఫలానా వారికి అన్ని కోట్లు, ఫలానా వారికి ఇన్ని కోట్లు రుణమాఫీలు జరిగిపోయాయని ప్రజలు ఫీలవడం తప్ప చేసేదేమీ లేదు. తమకి 100 రూపాయలు సాయం ఇచ్చే రాష్ట్ర పార్టీలపై మాత్రం కేంద్రం కర్ర పెత్తనం ఏంటో వారికి అర్థం కావడంలేదు.

భారత్ ధనికదేశమే, కానీ భారతీయులంతా ధనికులు కాదు అని ఇటీవల బీజేపీ మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీలైనంత మేర పేద, ధనిక అంతరాలు తగ్గించేందుకు కృషిచేయాలి. అంటే రాబిన్ హుడ్ లాగా పెద్దల్ని కొట్టి పేదలకు పెట్టమని చెప్పడంలేదు. పెద్దలకు మేపడం కాస్త తగ్గించి, పేదల కడుపుకొట్టడం మానుకోవాలి. కేంద్రం తగుదునమ్మా అంటూ ఉచితాలపై రాద్ధాంతం చేయడం, ఆ వెంటనే ఎన్నికల కమిషన్ స్పందించడం విచిత్రంగా ఉంది. ఇటీవల కేటీఆర్ చెప్పినట్టు బీజేపీ పేరు మధ్యలో ఈడీ, ఐటీ, సీబీఐ..తోపాటు ఈసీని కూడా చేర్చడంలో ఎలాంటి సందేహం అవసరం లేదన్నమాట. ఇకనైనా కేంద్రం కార్పొరేట్ల కొమ్ముకాయడం మానుకోవాలి, పేదలకిచ్చే ఉచితాలపై కుళ్లుకోవడం ఆపేయాలి.

Tags:    
Advertisement

Similar News