'మేం గెలిస్తే ఆ నగరం పేరును నాథురాంగాడ్సే నగర్ గా మారుస్తాం'
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నగరం పేరును నాథురాంగాడ్సే నగర్ గా మారుస్తామని హిందూ మహాసభ ప్రకటించింది. దేశాన్ని హిందూ దేశంగా మార్చడమే తమ లక్ష్యమని ఆ సంస్థ తెలిపింది.
వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తమ అభ్యర్థి మేయర్‌గా గెలిస్తే ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌ను నాథూరామ్ గాడ్సే నగర్‌గా మారుస్తామని హిందూ మహాసభ ప్రకటించింది. అంతేకాదు నగరంలోని అనేక ప్రాంతాల పేర్లను కూడా మార్చిపడేస్తామని, ముస్లిం పేర్లు ఉన్న ప్రాంతాలన్నింటికి హిందూ పురుషుల పేర్లు పెడతామని ఆ సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడు పండిట్ అశోక్ శర్మ మంగళవారం (నవంబర్ 22) తెలిపారు.
హిందూ మహాసభ ఈ మేరకు తన మానిఫెస్టో విడుదల చేసింది అందులో, భారతదేశాన్ని హిందూ దేశం గా మార్చడం తమ మొదటి ప్రాధాన్యత అని, గోమాతను రక్షించడం రెండవ ప్రాధాన్యత అని పేర్కొంది.
బీజేపీ, శివసేనలపై కూడా హిందూ మహాసభ విమర్శలు గుప్పించింది. ఈ రెండు పార్టీల్లోకి ఇతర వర్గాల ప్రజలు చేరడంతో వారు తమ హిందూ సిద్ధాంతాలకు దూరమయ్యారని పేర్కొంది.
హిందూ మహాసభ మీరట్ కొత్త చీఫ్ అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ సంస్థ అన్ని వార్డులలో పోటీ చేస్తుందని చెప్పారు.
"దేశభక్తి" గల అభ్యర్థులను, సంస్థ ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉంటామనే హామీ ఇచ్చేవాళ్ళనే నిలబెడతామని ఆయన అన్నారు.
''భారతదేశాన్ని 'హిందూ దేశం'గా మార్చడం, ప్రతి హిందువు గోమాతను గౌరవించేలా చూడటం మా ప్రధాన బాధ్యతలు. మత మార్పిడులను ఆపడానికి, "ఇస్లామిక్ బుజ్జగింపు రాజకీయాలను" నాశనం చేయడానికి కూడా మా సంస్థ కృషి చేస్తుంది.'' అని అభిషేక్ అగర్వాల్ అన్నారు.
ఉత్తరప్రదేశ్ అంతటా ఈ ఏడాది డిసెంబర్‌లో పట్టణ సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.