టీ20 వరల్డ్‌కప్.. ఇండియాలో ఎప్పుడూ లేనంత హైప్ ఎందుకంటే..?
గత ఏడాది ఇండియాలో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ను మన దేశమే గెలుస్తుందని ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రోహిత్ సేన ఫైనల్‌కు వెళ్లడంతో మనం మూడోసారి కప్ గెలవడం ఖాయమనుకున్నారు.
వచ్చే నెలలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు అన్ని దేశాలూ తమ టీమ్‌లను ప్రకటిస్తున్నాయి. ఇండియా కూడా తన జట్టును ప్రకటించింది. రింకూ సింగ్‌ను తీసుకోలేదని, గిల్ బదులు రుతురాజ్‌ను తీసుకోవాల్సిందని, రవి బిష్ణోయ్‌ను ఎందుకు తీసుకోలేదని మాజీలు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నారు. మరోవైపు అమితాబ్ బచ్చన్ లాంటి ప్రముఖులు ఇది మహాయుద్ధం అంటూ హైప్ పెంచేస్తున్నారు. ఎప్పుడూ లేనిది టీ20 వరల్డ్‌కప్‌కు ఇంత హైపేమిటని కారణాలు వెతికితే రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీల కెరీర్ చరమాంకంలో ఉండటమే అందుకు ప్రధాన కారణమని అర్థమవుతోంది.
వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయినప్పటి నుంచే మొదలు
గత ఏడాది ఇండియాలో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ను మన దేశమే గెలుస్తుందని ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రోహిత్ సేన ఫైనల్‌కు వెళ్లడంతో మనం మూడోసారి కప్ గెలవడం ఖాయమనుకున్నారు. ఫైనల్లో ఆస్ట్రేలియా మన ఆశల మీద నీళ్లు చల్లి కప్ ఎగరేసుకుపోయింది. అప్పటి నుంచి రాబోయే టీ20 ప్రపంచకప్ గెలవాలని ఆశలు పెరిగిపోయాయి.
2027 వరల్డ్‌కప్ వరకు ఉంటానని రోహిత్ సంకేతాలు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటి వరకు వన్డే ప్రపంచకప్ గెలిచింది లేదు. కనీసం వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్‌లో కూడా లేడు. టీ20 ప్రపంచకప్ 2007లో గెలిచిన యువజట్టులో మాత్రం రోహిత్ సభ్యుడు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడాలని ఉందని రోహిత్ సంకేతాలిచ్చినా అప్పటికి 40ల్లోకి వచ్చేసే హిట్ మ్యాన్‌కు జట్టులో స్థానం ఉంటుందన్న నమ్మకం లేదు. ఈ నేపథ్యంలో అతను టీ20 వరల్డ్ కప్ గెలిచి, సగర్వంగా వీడ్కోలు పలకాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
విరాట్ కోహ్లీ కూడా..
మరోవైపు ఆల్ టైమ్ గ్రేట్‌ల్లో ఒకడిగా నిలవనున్న విరాట్ కోహ్లీ కూడా 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు జట్టులో ఉంటాడన్న గ్యారంటీ లేదు. ఫిట్‌నెస్, ఫామ్ పరంగా కోహ్లీకి ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ దీన్ని మరో మూడేళ్లు ఇలాగే కొనసాగించగలడా అనేది అనుమానమే. అందుకే కోహ్లి, రోహిత్‌లు ఉండగానే టీ20 ప్రపంచకప్ గెలవడం వారికి సరైన వీడ్కోలు అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ అంశాలన్నీ కలిసి టీ20 ప్రపంచకప్‌మీద ఇండియాలో విపరీతమైన ఆశలు పెంచేస్తున్నాయి. 2007లో తొలి టీ20 ప్రపంచకప్ ఇండియానే గెలిచింది. అప్పటి నుంచి మళ్లీ మనకు కప్ అందలేదు. కానీ ఏనాడూ ఇంత హైప్ లేదు. టీ20 ప్రపంచకప్ సెలక్షన్ మీద కూడా ఇంత చర్చ ఎప్పుడూ జరగలేదు. ఈసారి అందుకు భిన్నంగా పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ ప్రపంచకప్‌ను రోహిత్ సగర్వంగా పైకెత్తితే అదే పదివేలు!