పార్లమెంట్‌లో మాట్లాడటానికి జంకు ఎందుకు..?
మణిపూర్ మంటల్లో ధ్వంసమవుతుండగానే అనేక దేశాలు పర్యటించిన ప్రధాని మోదీ.. మణిపూర్ అల్లర్లపై మొన్నటివరకు స్పందించలేదు.
మణిపూర్‌లో మహిళల మీద జరిగిన అత్యాచార పర్వంపై యావత్ జాతి ఇప్పటికీ చర్చిస్తున్నది, కేంద్ర ప్రభుత్వ ఉదాసీనతపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టని దిగజార్చిన ఈ దుర్మార్గం మీద దేశదేశాలలో చర్చలు జరుగుతున్నా.. మన పార్లమెంట్‌లో చర్చించేందుకు బీజేపీ ప్రభుత్వానికి మనసు రావడం లేదు. ‘విశ్వగురు’గా తన ఇమేజ్‌ని పెంచుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ, మణిపూర్ అంశంపై పార్లమెంటులో ఒక ప్రకటన చేయడానికి కూడా ముందుకు రాలేకపోతున్నారు.
ప్రజాస్వామ్య దేవాలయంగా పార్లమెంటును అభివర్ణించే బీజేపీ పెద్దలు, అదే పార్లమెంటులో మణిపూర్ ఘటనపై సుదీర్ఘంగా చర్చించాలంటే జంకుతున్నారు. అరగంట చర్చతో సరిపెట్టేందుకు రకరకాల సాకులు చెబుతున్నారు. మణిపూర్ నడివీధుల్లో మహిళల్ని నగ్నంగా ఊరేగించడం గురించి ప్రశ్నిస్తే పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల హింసని లేవనెత్తుతున్నారు. ప్రధాని పార్లమెంటుకు వచ్చి ప్రకటన చేయాలన్న విపక్షాల డిమాండ్‌ను అంగీకరించలేకపోతున్నారు. ప్రధాని ప్రకటన కోసం పట్టుబట్టడమే నేరమన్నట్టుగా ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు సంజయ్‌కుమార్‌ను వర్షాకాల సమావేశాల వరకు సభలో అడుగు పెట్టకుండా సస్పెండ్ చేశారు.
యావత్ దేశచరిత్రను మంటగలిపిన మణిపూర్ ఘటనపై పార్లమెంటులో పెదవి విప్పేందుకు మోదీ సిద్ధపడకపోవటం దేశాన్ని నివ్వెర పరుస్తున్నది. కనుకనే పార్లమెంటులో మణిపూర్ పరిణామాల మీద తమ వైఫల్యాన్ని అంగీకరించడానికి కాషాయ పరివారం సిద్ధంగా లేదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రెండు నెలల తరబడి మణిపూర్‌లో హింసాకాండ కొనసాగడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యం ఫలితమేనని బీజేపీ నాయకులు కూడా చెబుతున్నారు. అక్కడ సమస్య పరిష్కారానికి తక్షణం మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని స్వయంగా బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి డిమాండ్ చేశారు.
కొన్నాళ్ళ కిందట హోంమంత్రి అమిత్‌షా పర్యటించి వచ్చిన తరువాత కూడా మణిపూర్‌లో హింసాకాండ ఆగకపోగా మరింత చేలరేగింది. మణిపూర్‌లోని రెండు తెగల మధ్య సమస్య పరిష్కారానికి మొదట్లోనే కేంద్రం చొరవ చూపి నిర్దిష్ట చర్యలు తీసుకుని వుంటే మహిళల మీద అంత దుర్మార్గం జరిగి వుండకపోయేది. మణిపూర్ మంటల్లో ధ్వంసమవుతుండగానే అనేక దేశాలు పర్యటించిన ప్రధాని మోదీ.. మణిపూర్ అల్లర్లపై మొన్నటివరకు స్పందించలేదు. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా బయట ఒకటీ రెండు మాటలతో విచారం వ్యక్తం చేస్తే సరిపోతుందా అని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు.
ఈరోజుకీ మణిపూర్‌లో ఆందోళనలు, ఆగ్రహ జ్వాలలు చల్లారలేదు. అక్కడి సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటామో చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నది కేంద్ర ప్రభుత్వం. కనుకనే మణిపూర్ మీద ఒక ప్రకటన చేయడానికి గానీ, సుదీర్ఘమైన చర్చను అనుమతించేందుకు గానీ బీజేపీ అంగీకరించలేకపోతుంది.
మణిపూర్‌లో జాతుల మధ్య వివాదాలు పరస్పర దాడులకీ, హననానికీ పాల్పడేంత తీవ్రస్థాయికి చేరడంలో బీజేపీ వైఫల్యం వుంది. కానీ తన ప్రభుత్వ వైఫల్యాలనీ, తప్పులనీ అంగీకరించే నైజం ప్రధాని మోదీకి లేదు. అయితే మణిపూర్‌లో జరిగింది చిన్న సంఘటన కాదు, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో పోలీసుల సమక్షంలోనే ఇద్దరు మహిళల్ని నగ్నంగా వీధుల్లో ఊరేగించడం అత్యంత హేయమైన చర్య. 75 ఏళ్ళ స్వతంత్ర భారత చరిత్రలో పాలకులు సిగ్గుతో తలదించుకోవాల్సిన దుర్మార్గం.
ఈ అమానుష ఘటన చెలరేగేంతగా పరిస్థితులు పరిణమించడానికి కేంద్రానిదే అసలు బాధ్యత. ప్రతిపక్షాలే గాక దేశంలోని ప్రజాస్వామ్య వాదులు, మానవ హక్కుల సంఘాలు మణిపూర్ పరిణామాల మీద కేంద్రాన్ని అభిశంసించాయి. పౌరుల రక్షణ కోసం నిలబడాల్సిన ప్రభుత్వ కర్తవ్య నిర్వహణలో విఫలం చెందిన దుష్ఫలితమే ఈ దారుణ ఘటన. కనుక తమ వైపు ఉన్న వైఫల్యాన్ని గుర్తించి పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేస్తూ చర్చను ఆరంభించడం సముచితం, గౌరవప్రదం. ఇందుకు సమ్మతించకపోతే మోదీ చరిత్రలో, బీజేపీ పాలనా చరిత్రలో ఎప్పటికీ మాసిపోని అవమానకర ఘట్టంగా మిగిలిపోతుంది మణిపూర్ దురంతం. గౌరవమా? అవమానమా? తేల్చుకోవాల్సింది వారే!