బ్యాంకుల బాకీలు ఎగ్గొట్టే బడా బాబులు, కంపెనీలపై క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు చేయరు?: సుప్రీంకోర్టు

ఏదైనా బ్యాంకులో లోన్ మోసాలు జరిగితే.. తప్పకుండా వెంటనే దర్యాప్తు సంస్థలకు తెలియజేయాలని అందులో పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు ఈ నిబంధన అమలు చేయడం లేదని సదరు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొని వచ్చారు.

Advertisement
Update:2022-12-08 13:40 IST

సామాన్య ప్రజలు ఐదు, పది వేల రూపాయల రూణాన్ని కట్టలేకపోతే నానా హంగామా చేసే బ్యాంకులు.. బడా బాబులు, కార్పొరేట్ కంపెనీలు కావాలని ఎగ్గొట్టే కోట్లాది రూపాయలను మాత్రం చూసీ చూడనట్లు వదిలేస్తున్నాయి. పైగా వారి రుణాలను మాఫీ చేస్తున్నట్లు తమ లెడ్జర్ బుక్కులో రాసుకుంటున్నాయి. గత ఐదేళ్లలో బ్యాంకులు దాదాపు రూ. 10 లక్షల కోట్ల మేర బాకీలను రైటాఫ్ చేసినట్లు ఏకంగా పార్లమెంటులోనే ప్రభుత్వం చెప్పింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాకీల మాఫీలు మరింతగా పెరిగిపోయాయి. బడాబాబుల రుణ మాఫీలపై ఓ ఎన్జీవో సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

బ్యాంకు రుణాలను ఎగ్గొడుతున్న పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ కంపెనీలపై క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించింది. కోట్లాది రూపాయల రుణాలు బాకీ పడినా వారిపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో చెప్పాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ని ఆదేశించింది. జస్టిస్ సంజయ్ కిషన్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ విక్రమ్ నాథ్‌ల త్రిసభ్య బెంచి ఈ మేరకు కేంద్రం, ఆర్బీఐకి నోటీసులు పంపింది. ఈ విషయంలో మీ వైఖరి ఏమిటో తెలియజేయాలని కోరింది.

ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, ప్రణవ్ సచ్‌దేవ ఓ ఎన్జీవో తరపున వాదిస్తూ.. 2016లో ఆర్బీఐ విడుదల చేసిన సర్క్యులర్‌ను ప్రస్తావించారు. ఏదైనా బ్యాంకులో లోన్ మోసాలు జరిగితే.. తప్పకుండా వెంటనే దర్యాప్తు సంస్థలకు తెలియజేయాలని అందులో పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు ఈ నిబంధన అమలు చేయడం లేదని సదరు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొని వచ్చారు. ఆ సర్క్యులర్‌లో ఉన్న విషయాలు పూర్తిగా అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేశారు.

'బ్యాంకులో ఏదైనా ఫ్రాడ్ జరిగినట్లు తెలిసిన వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేయాలి. ఫిర్యాదు చేయడంలో ఎలాంటి ఆలస్యం చేయకూడదు. కంప్లైంట్ చేయడంలో ఆలస్యం అయితే అవసరమైన డాక్యుమెంట్లు, సాక్ష్యులు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మోసానికి పాల్పడిన వ్యక్తులు పారిపోయే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల బ్యాంకు చాలా నష్టపోతుంది. అంతే కాకుండా అప్పు తీసుకున్న వ్యక్తులు తమ ఆస్తులను కాపాడుకునే ప్రయత్నం కూడా చేస్తారు. అందుకే వెంటనే కేసు నమోదు చేయాలి' అని ఆర్బీఐ అన్ని బ్యాంకులను 2016లో సర్క్యులర్ పంపించింది.

కాగా, బ్యాంకులు ఆర్బీఐ జారీ చేసిన ఈ సర్క్యులర్‌ను అసలు అమలు చేయడం లేదని.. భారీగా అప్పులు ఎగ్గొట్టిన వారిపై క్రిమినల్ కేసులు కూడా పెట్టలేదని సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఆర్బీఐ మాత్రమే కాకుండా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా 2018లో అన్ని బ్యాంకులకు మరో సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ ఆర్థిక మోసాలు, నేరాలకు సంబంధించిన విషయాలు తెలిసిన వెంటనే స్థానిక పోలీసులకు కానీ, రాష్ట్ర పోలీస్ శాఖకు కానీ, సీబీఐకి కానీ కంప్లైంట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇంత వరకు ఈ ఆదేశాలు కూడా అమలు కావడం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకొని వచ్చారు.

కేసు పూర్వాపరాలు పరిశీలించిన త్రిసభ్య బెంచ్.. నెలలోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐని కోరింది. జనవరి 25న ఈ కేసు తదుపరి విచారణ జరుగుతుందని వాయిదా వేసింది. కాగా, 2016లోనే సుప్రీంకోర్టు కూడా ఇలాంటి మోసాలపై క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పిందని.. కానీ ఆ ఆదేశాలు కూడా ఇంత వరకు అమలు కాలేదని న్యాయవాది ప్రశాంత్ భూషన్ చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News