'ఆదిపురుష్'పై వివాదాలు ఎవరికి లాభం?
‘ఆదిపురుష్’ టీజర్ మీద నడుస్తున్న ట్రోలింగ్ వెనుక భిన్న కోణాలున్నాయి. సినిమాని హిట్ కోసం తెరవెనుక మంత్రాంగ ఫలితమే వివాదాల తతంగం అన్నది ఒక కోణం.
అధికారంలో ఉన్న వారి భావజాలమే సాహిత్యం కళల్లో చెలరేగిపోయి విశ్వరూపం ప్రదర్శించడం సహజం. బ్రహ్మాస్త్ర, కార్తికేయ, ఆదిపురుష్‌లు అంతిమంగా ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తాయో, ఎవరికి వంత పాడుతాయో తెలియంది కాదు. సరిగ్గా ఆలోచిస్తే అన్నీ అర్థమవుతాయి. ఆలోచించడం తెలియాలి. కార్యాకారణ సంబంధం లేకుండా ఏదీ ఉండదు. కొన్నిసార్లు కారణాలు వెంటనే తెలియకపోవచ్చు. దానర్థం కారణాలు లేకపోవడం కాదు, వెంటనే గ్రహించే తెలివిడి లేకపోవడం. చరిత్ర ఏదో, కల్పన ఏదో గ్రహించే కౌశలం ఆధునిక శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం అందించినప్పటికీ వివాదాలు కాని వాటిని వివాదాలు చేయడం వెనుక స్వార్థ రాజకీయ ప్రయోజనాలున్నాయి.
'ఆదిపురుష్' టీజర్ మీద నడుస్తున్న ట్రోలింగ్ వెనుక భిన్న కోణాలున్నాయి. సినిమాని హిట్ కోసం తెరవెనుక మంత్రాంగ ఫలితమే వివాదాల తతంగం అన్నది ఒక కోణం. ఎంత వివాదం సృష్టిస్తే సినిమా అంత సక్సెస్ అవుతుందా? అందుకే కొందరు ఆ పాత్రలు అలా ఉండాల్సిందీ, ఇలా ఉండాల్సిందనీ మాట్లాడుతుంటారు. ఎవరు ఎలా ఉండాలో తీర్పులు చెబుతుంటారు. వీళ్ళు టైమ్ మెషీన్ ద్వారా గత కాలానికి వెళ్ళి రాముడిని చూసి వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు.
కానీ రామాయణం చరిత్ర కాదు. వాల్మీకి రాసిన కావ్యం. రామాయణం ఇతిహాసం. కాల్పనికతను కేంద్రంగా చేసుకొని అల్లిన రమణీయ కావ్యం. దీన్ని అనేకులు తిరగరాశారు. అనేకానేక ఉపకథలు జోడించారు. అనేకానేక రామాయణాలు ఇవాళ ప్రచారంలో ఉన్నాయి. రామాయణం, రామాయణం పాత్రల్ని కేంద్రంగా చేసుకొని యానిమేషన్ సినిమాలు కూడా వచ్చాయి. రాముడు, లక్ష్మణుడు, సీత, రావణుడు, హనుమంతుడు ఇలా మొదలయిన పాత్రల్ని ఎవరి ఊహాశాలితతో వారు తీర్చిదిద్దారు. తెలుగు వారికి రాముడు అంటే ఎన్టీ రామారావు, రావణాసురుడి పాత్రలో ఎస్వీ రంగారావు స్థిరపడిపోయారు. కానీ దేశంలో రాముడు, రావణుడు, సీత వంటి పాత్రలకు విశ్వజనీన రూపాలు లేవు. అప్పుడు లేని వివాదాలు ఇప్పుడే ఎందుకు చెలరేగుతున్నాయో యోచించాలి.
శాస్త్ర, సాంకేతిక రంగాల విస్తృతితో సినిమాలు కూడా కొత్త పుంతలు తొక్కాయి. కనుక ఇవాళ ఆదిపురుష్ పేరుతో రామాయణాన్ని తెరకెక్కించినా, రేపు మరెవరయినా మహాభారతానికి వెండితెర రూపమిచ్చినా సాంకేతిక హంగులుండటం సహజం. అందుకు తగ్గట్టుగా పాత్రలు కొత్తరూపాన్ని ధరిస్తాయి. అయితే అంతిమంగా కాల్పనిక గాథలని నిజమనిపించేలా తీసే ఈ సినిమాలు ఎవరి భావజాలాన్ని బలపరుస్తాయో ఆలోచించాలి.
ఈ మధ్యన వచ్చిన బ్రహ్మాస్త్ర, కార్తికేయ వంటి సినిమాల్లో కల్పనలనే నిజమనిపించేలా చూపించారు. కార్తికేయలో చూపిన కృష్ణుని ఫిలాసఫీ, నెమలిబొమ్మ ఉదంతాలు కేవలం కల్పనలు. నెమలిబొమ్మలో ఏదో దాగుందనే ఉత్కంఠకు ప్రేక్షకుల్ని లోను చేయవచ్చు. కానీ సామాజిక, చారిత్రక పరిణామాలకు వీటికీ ఏ సంబంధం లేదు. మనుషులంతా విధి ఆడే నాటకంలో వింత జీవులనే నమ్మకాన్ని ప్రచారం చేయడమే ఈ చిత్రాల వెనుక ఉన్న కుటిల వ్యూహం.
ఈ క్రమంలోనే ఆదిపురుష్‌ని వివాదం చేయడం వెనుక సంఘ్ పరివార్ మద్దతుదారులు ముందు ఉండటంలో ఆశ్చర్యం లేదు. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయనే పేరుతో రాముడు ఎలా ఉండాలో ఉండకూడదో, రావణుడు ఎలా ఉండాలో చెప్పడానికి సాహసిస్తారు. దీని వెనుక వారికి రెండు ప్రయోజనాలున్నాయి.
1. ఈ సినిమా మీద జరిగే ట్రోలింగ్ ద్వారా తమ అభిప్రాయాలకు భిన్నంగా ఎవరూ సినిమాలు తీయకూడదని కాషాయ పరివార శక్తులు హెచ్చరించ దలుచుకున్నాయి. ఆదిపురుష్ హిందూత్వ భావజాలానికి భిన్నమైందేం కాదు. కానీ బ్రాహ్మణుడైన రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్‌ని చూపిన తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అభ్యంతరాల ద్వారా తమను మెచ్చేలా పాత్రల్ని తీర్చిదిద్దాలన్న హెచ్చరిస్తున్నది కాషాయ పరివారం.
రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛను హరించే ఈ ట్రోల్స్ పట్ల బిజెపి ప్రభుత్వాలు మౌనంగా ఉండడం విస్మయం కలిగించదు. విభజన రాజకీయాలకు ఉపకరించే దాష్టీకం ఇది. కనుక కాషాయ అనుకూల శక్తులు నోరు మెదపవు.
2. వివాదం ఎంతగా పెరిగితే సినిమా అంతగా సక్సెస్ అవుతుందా? అందుకే కొన్ని సినిమాల మీద పని గట్టుకొని ప్రతికూల ప్రచారం చేయడం ఇటీవలి ధోరణి. అయితే సదరు నిర్మాతలే ఇలాంటి చీప్ ట్రిక్స్‌కు పాల్పడతారనలేము. వందల కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమా మీద ఉద్దేశ పూర్వకంగా వారు ఇలాంటి వ్యూహాల్ని అమలు చేయరు. కానీ 'ఆదిపురుష్' మీద వస్తున్న వివాదాలు అంతిమంగా ఆ సినిమా మీద ఆసక్తిని ఇనుమడిరపజేస్తుంది.
సంఘ్ పరివార్ హెచ్చరికల్ని మన్నించి కొన్ని మార్పులు చేయడం వల్ల ఈ సినిమా మీద వారే తిరిగి అనుకూల ప్రచారం చేసే అవకాశం లేకపోలేదు. తద్వారా ఈ సినిమా ఎక్కువగా జనాల్లోకి పోతుంది. హిందూత్వ ప్రతీకగా శ్రీరాముడు జనవాళిలోకి మరింత విస్తృతంగా వెళతాడు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో ఎన్నికలు రానున్న వేళ ఆదిపురుష్ లాంటి సినిమాలు, వాటి మీద వచ్చే ట్రోల్స్, రకరకాల వివాదాలు చివరకు ఎవరికి లాభించాలో వారికే లాభిస్తాయి. సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో ఎవరు ఎంత గింజుకున్నా వర్తమాన పరిణామాల పరంపర లక్ష్యం ఇందుకు భిన్నంగా వుండే అవకాశం లేదు.