'కవచ్' వ్యవస్థకు ఏమైంది? ఆ సిస్టమ్ ఉండుంటే ప్రమాదం జరిగేది కాదా!

అత్యంత ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ కాలంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదానికి గురి కావడం అందరినీ ఆందోళనకు గురి చేసింది.

Advertisement
Update:2023-06-03 09:07 IST

మాటలకు అందని ఘోర విషాదం.. ఎటు చూసినా గుట్టలుగా శవాలు.. ఒకరి చేయి తెగి.. మరొకరి కాలు ఛిద్రమై.. బాధితుల హాహాకారాలతో బాలేశ్వర్ రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రమాదం జరిగిన ప్రాంతం విషాదంలో నిండిపోయింది. రాత్రంతా ఆంబులెన్సులు క్షతగాత్రులను తీసుకొని ఆసుపత్రులకు వెళ్తూనే ఉన్నాయి. బోగీల్లో ఇరుక్కొని పోయిన వారు తమను రక్షించండి అంటూ వేడుకోవడం స్థానికులను కలిచి వేసింది.

అత్యంత ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ కాలంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదానికి గురి కావడం అందరినీ ఆందోళనకు గురి చేసింది. భారతీయ రైల్వే నెట్‌వర్క్‌ను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తున్నారు. సిగ్నలింగ్ వ్యవస్థలో కూడా ఎన్నో మార్పులు చేశారు. గతేడాది 'కవచ్' (ట్రెయిన్ కొల్యూషన్ అవాయిడెన్స్ సిస్టమ్) అనే వ్యవస్థను రూపొందించారు. అతి తక్కువ ఖర్చుతోనే అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ వ్యవస్థను అభివృద్ధి చేశారు. 2012 నుంచి ఈ వ్యవస్థను అభివృద్ధి చేస్తుండగా.. చివరకు గతేడాది విజయవంతంగా పరీక్షించారు.

2022 మార్చి 4న దక్షిణ మధ్య రైల్వే పరిధి సికింద్రాబాద్ డివిజన్‌లోని గుల్లగూడ, చిట్టిగిద్ద రైల్వే స్టేషన్ల మధ్య ఈ వ్యవస్థను పరీక్షించారు. ఒక లోకోమోటీవ్‌లో స్వయంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఎదురుగా వస్తున్న ఇంజన్‌లో రైల్వే బోర్డు చైర్మన్ వినయ్ కుమార్ త్రిపాఠి ప్రయాణించారు. ఈ రెండు లోకో మోటీవ్‌లు ఎదురెదుగా 400 మీటర్ల దూరంలో ఆటోమేటిక్‌గా ఆగిపోయాయి. ఆ తర్వాత దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంటులో వివరించారు.

దేశంలో 16 రైల్వే జోన్లు ఉండగా.. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 'కవచ్' వ్యవస్థను పూర్తిగా ఇంప్లిమెంట్ చేశారు. దక్షిణ మధ్య రైల్వే లోని 1,455 కిలోమీటర్ల కారిడార్‌లో ఈ వ్యవస్థ ఏర్పాటు అయ్యింది. దీనికి అనుగుణంగా 77 లోకోమోటీవ్‌లను కూడా సిద్ధం చేశారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కవచ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. తర్వాతి దశంలో ఢిల్లీ-హౌరా, ఢిల్లీ - ముంబై మార్గంలో 3,000 కిలోమీటర్ల మేర కవచ్ వ్యవస్థ ఇంప్లిమెంటేషన్ జరుగుతోంది. కవచ్ వ్యవస్థను దశలవారీగా అన్ని జోన్లలో ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

ప్రమాదం జరిగిన ఈస్ట్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలో 'కవచ్' వ్యవస్థ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానట్లు అధికారులు తెలిపారు. ఇంకా దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని అన్నారు. ఒక వేళ కవచ్ వ్యవస్థ ఉండి ఉంటే.. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం జరిగేది కాదని వారు స్పష్టం చేస్తున్నారు. కవచ్ లేకపోవడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుందని అన్నారు. ప్రస్తుతం ప్రమాదంపై అత్యున్నత విచారణకు రైల్వే శాఖ ఆదేశించింది. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు ఏమైనా ఉన్నాయో కూడా గుర్తించే పనిలో పడ్డారు.

4జీతో పని చేసే కవచ్..

కవచ్‌ను ప్రతీ లోకోమోటీవ్, ట్రాక్‌ల పక్కన, రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థలో ఏర్పాటు చేస్తారు. ప్రతీ కిలోమీటరుకు ఒక చోట దీనికి సంబంధించిన పరికరాలు అమర్చబడి ఉంటాయి. అవన్నీ దగ్గరలోని స్టేషన్‌కు కనెక్ట్ చేస్తారు. 4జీ సిగ్నల్స్ ఉపయోగించుకొని కవచ్ పని చేస్తుంది. ఈ సిస్టమ్‌లో ఉండే అల్ట్రా హై రేడియో ఫ్రీక్స్వెన్సీ ద్వారా కమ్యునికేట్ చేస్తుంది. ఏవైనా రెండు రైళ్లు ఎదురెదురుగా వస్తున్నట్లు సిగ్నల్ అందగానే.. ఆటోమెటిక్ బ్రేక్స్ అప్లయ్ అవుతాయి. కిలోమీటర్ పరిధిలోనే లోకో‌మోటీవ్‌లకు తెలిసిపోతుంది. దీంతో 400 మీటర్లకు తగ్గని దూరంలో రైళ్లు నిలిచిపోతాయి.

Tags:    
Advertisement

Similar News