పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. అలా ఇలా కాదు, నాలుకలు తెగ్గోస్తానంటూ హెచ్చరించారు. పార్థా ఛటర్జీ అరెస్ట్ వ్యవహారంలో పట్టుబడిన సొమ్ముకి తనకు సంబంధం ఉందంటూ కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తనను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారని, తాను రాజకీయాల్లో లేకపోతే అలాంటి వారి నాలుకలు కోసేసేదాన్ని అని హెచ్చరించారు మమత.
తప్పు ఎవరు చేసినా తప్పే..
టీచర్ రిక్రూట్ మెంట్ స్కామ్ లో మంత్రి పార్థా ఛటర్జీ అరెస్ట్ వ్యవహారంపై మమతా బెనర్జీ మూడురోజులుగా స్పందించలేదని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. దీంతో ఆమె పెదవి విప్పారు. తాను అవినీతికి మద్దతివ్వబోనని తేల్చి చెప్పారు. లోక్ సభ మాజీ సభ్యురాలిగా లక్ష రూపాయల పింఛన్, రాష్ట్ర ఎమ్మెల్యేగా రూ.2 లక్షల జీతం.. వీటితోటే తాను జీవనం గడుపుతున్నానని, గత 11 ఏళ్లలో తాను ఎంత సంపాదించానో ఎవరైనా లెక్కగట్టొచ్చని చెప్పారు. అది మినహా తాను ఎవరి వద్దా ఒక్క పైసా కూడా తీసుకోలేదన్నారు. రెండు రోజులుగా బీజేపీ తనను టార్గెట్ చేసిందని అన్నారు మమత.
ప్రజలు తప్పులు చేస్తుంటారని, అలా ఎవరైనా తప్పులు చేస్తే, వారు శిక్ష అనుభవించాల్సిందేనని, వారికి ఎలాంటి కఠినమైన శిక్ష పడినా.. తాము జోక్యం చేసుకోబోమని, వారికి మద్దతు ఇవ్వబోమని చెప్పారు మమత. టీచర్స్ స్కామ్ కేసుని స్త్రీకి సంబంధించిన సంఘటనగా తాను భావిస్తానని, మహిళలంటే తనకెంతో గౌరవం కానీ, అందరూ మంచివారు కాదని చెప్పారు మమత. పరోక్షంగా అర్పిత ఎపిసోడ్ పై ఆమె కామెంట్ చేశారు. అయితే నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేసి తీర్పు ఇవ్వాలని అన్నారామె. రాజకీయ కారణాలతో విచారణను సాగదీస్తూ.. కక్షసాధింపులకు పాల్పడటం మాత్రం దారుణం అని చెప్పారు. ఈ కేసు విచారణ సమయంలో ఈడీ స్వాధీనం చేసుకున్న డబ్బుతో తనకెలాంటి సంబంధం లేదని, తనను ట్యాగ్ చేస్తూ ఈ వివాదంలోకి లాగాలని చూడటం నీఛమైన చర్యగా భావిస్తున్నట్టు తెలిపారు మమతా బెనర్జీ.
ఫోన్ కాల్స్ రాలేదు..
పార్థా ఛటర్జీ అరెస్ట్ విషయంలో ఆయన తరపున ఈడీ అధికారులు మమతా బెనర్జీకి ఫోన్ చేశారని, అయితే ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదనే ప్రచారం జరిగింది. మూడుసార్లు కాల్ చేసినా మమత ఫోన్ తీయలేదని, టైమ్ తో సహా కొంతమంది సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టారు. కానీ అసలు పార్థా ఛటర్జీ ఇంటినుంచి కానీ, ఆయన మొబైల్ నుంచి కానీ సీఎం కార్యాలయానికి ఫోన్ రాలేదని అధికారులు వివరణ ఇచ్చారు. ఈ కేసు విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, అనవసరంగా మమతా బెనర్జీ పేరు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని టీఎంసీ నేతలు మండిపడుతున్నారు.