బేటీ బచావో కాదు.. బేటీ జలావో..

కేంద్రం అసమర్థత వల్లే మణిపూర్ లో అల్లర్లు జరుగుతున్నాయని మండిపడ్డారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.

Advertisement
Update:2023-07-21 18:14 IST

కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పఢావో అనే కార్యక్రమం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మణిపూర్ అల్లర్ల తర్వాత ఆ కార్యక్రమం కాస్తా బేటీ జలావో( ఆడబిడ్డలను కాల్చండి) అయిందని తీవ్ర విమర్శలు చేశారు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మణిపూర్ లో ఇద్దరు యువతులను నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన వేళ.. కేంద్రాన్ని విపక్షాలు టార్గెట్ చేశాయి. మణిపూర్ అల్లర్ల విషయంలో కేంద్రం అసమర్థతను నిలదీశాయి.

కేంద్రం అసమర్థత వల్లే మణిపూర్ లో అల్లర్లు జరుగుతున్నాయని మండిపడ్డారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. బెంగాల్ అల్లర్ల విషయంలో క్షణం ఆలస్యం చేయకుండా కేంద్ర బృందాలను పంపారని, మరి మణిపూర్ తగలబడిపోతున్నా ఇంకా మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారని మండిపడ్డారు మమత. ఇప్పటి వరకూ మణిపూర్ లో 160మంది అల్లర్ల కారణంగా మరణించారని, ఇంకా పరిస్థితి అదుపులోకి రాలేదన్నారు. మణిపూర్ కి సంఘీభావం తెలియజేసిన ఆమె, ఈశాన్య రాష్ట్రానికి కనీసం కేంద్ర బృందాన్ని పంపించి పరిస్థితి అంచనా వేసేలా చూడాలని సూచించారు.


బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రతిపక్ష కూటమి INDIAకి ఆమె సంఘీభావం తెలిపారు. కాషాయ శిబిరాన్ని అధికారం నుంచి తొలగించడమే తమ ధ్యేయమని చెప్పారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో పతనం అవుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 2024లో కేంద్రం నుంచి బీజేపీని గద్దె దింపడం తప్ప తమకు వేరే లక్ష్యమేదీ లేదన్నారు. తనకు ఏ కుర్చీ వద్దని స్పష్టం చేసిన మమత, పరోక్షంగా ప్రధాని పదవిపై ఆశ లేదని తేల్చేశారు. 

Tags:    
Advertisement

Similar News