ఇట్లయితే బెంగాల్‌లో జీఎస్టీ నిలిపేస్తాం- సీఎం మమత హెచ్చరిక

జీఎస్టీ నిధులను రాష్ట్రాలకు సరిగా పంచడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. వివిధ పథకాలకు సంబంధించిన బకాయిలను కూడా కేంద్రం సరిగా రాష్ట్రాలకు చెల్లించడం లేదు.

Advertisement
Update:2022-11-16 08:24 IST

డమ్మీ రాష్ట్రాలు- బలమైన కేంద్రం అన్న ఆలోచనను ఒక పద్దతి ప్రకారం మోడీ సర్కార్ అమలు చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బకొడితే సహజంగానే కేంద్రం బలంగా కనిపిస్తుందన్న ఆలోచనతో నడుస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ ఆలోచనతోనే జీఎస్టీ నిధులను రాష్ట్రాలకు సరిగా పంచడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. వివిధ పథకాలకు సంబంధించిన బకాయిలను కూడా కేంద్రం సరిగా రాష్ట్రాలకు చెల్లించడం లేదు. ఈ పరిస్థితిపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమీ భిక్ష అడగడం లేదని, ఈ విషయాన్ని కేంద్రం గుర్తించాలన్నారు. మా నిధులు మాకు ఇవ్వడానికి మిమ్మల్ని అడుక్కోవాలా..? అని నిలదీశారు.

చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా కేంద్రం ఎగ్గొడుతోందని మమతా ఫైర్ అయ్యారు. పరిస్థితి ఇలాగే ఉంటే తమ రాష్ట్రం నుంచి కేంద్రానికి జీఎస్టీ ఆపేస్తామని మమత హెచ్చరించారు. నిధులు ఇవ్వడం చేతగాకపోతే మోడీ ప్రభుత్వం గద్దె దిగి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. బెంగాల్‌పై కక్ష కట్టిన మోడీ ప్రభుత్వం.. ఉపాధి హామీ నిధులను కూడా ఆపేసిందని మమతా బెనర్జీ వివరించారు. ఉపాధి హామీ నిధులను కేంద్రం మంజూరు చేసేలా ప్రజలు రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేయాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ నిధులపై తాను ప్రధానిని కలిసినా ఫలితం లేకుండాపోయిందన్నారు.

మనం ప్రజాస్వామ్య భారత దేశంలో ఉన్నామా..?, లేక భారత్‌ ఏమైనా ఏకపార్టీస్వామ్యంగా మారిపోయిందా..? అని మమత ప్రశ్నించారు. బెంగాల్‌కు నిధులు ఆపేస్తామని వారు బెదిరిస్తున్నారని.. అదే జరిగితే తాము కూడా కేంద్రానికి జీఎస్టీ చెల్లించబోమని హెచ్చరిస్తున్నామని మమతా వ్యాఖ్యానించారు. తమకు నిధులు ఇవ్వని పక్షంలో బెంగాల్‌లో జీఎస్‌టీని వసూలు చేసుకోలేరన్న విషయాన్ని కేంద్రం గుర్తించుకోవాలన్నారు.

Tags:    
Advertisement

Similar News