భారత్‌ను కవ్వించి భారీగా నష్టపోయిన పాక్
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ రేంజర్ల కాల్పులు
ప్రశాంతంగా ఉన్న భారత్‌ను కవ్వించి పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకున్నది. బుధవారం రాత్రి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్థాన్ రేంజర్లు నియంత్రణ వెంబడి భారత సైన్యం దిశగా కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం ధీటుగా బదులిచ్చింది. భారత బలగాల ధాటికి పొరుగు దేశంలో భారీగా ప్రాణనష్టం వాటిల్లినట్లు సమాచారం.
జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లా కృష్ణ ఘాటి సెక్టార్ బుధవారం రాత్రి పాక్ సైన్యం అనూహ్యంగా కాల్పులకు తెగబడింది. నియంత్రణ రేఖ వెంబడి భారత ఫార్వర్డ్ పోస్టుపై పాక్ రేంజర్లు కాల్పులు జరిపాయి. ప్రశాంతంగా ఉన్న భారత్‌పై పాక్ కాల్పులు జరపడంతో భారత సైన్యం పొరుగుదేశంపై విరుచుకుపడింది. పాక్ రేంజర్ల పై తూటాల వర్షం కురిపించింది. ఈ కాల్పుల్లో పాక్ సైన్యం వైపు భారీ ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య వివరాలు స్పష్టంగా తెలియలేదు. అయితే ఈ సమాచారాన్ని భారత సైన్యం ఖండించలేదు. ధృవీకరించలేదు. కాల్పుల విరమణకు సంబంధించి ఈ ఏడాది ఇదే మొదటి ఘటన. గత కొన్నిరోజులుగా వివిధ మార్గాల ద్వారా పాకిస్థాన్ కవ్వింపులకు పాల్పడుతూనే ఉన్నది. ఫిబ్రవరి 4,5 తేదీల మధ్య అర్ధరాత్రి కొందరు చొరబాటుదారులు భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా భద్రతా దళాలు వారిపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఏడుగురు హతమవ్వగా వారిలో కొందరు పాక్ భద్రతా సిబ్బంది ఉన్నట్లు సమాచారం.